దేశంపై కరోనా ప్రకోపం ఇప్పట్లో చల్లారేలా లేదు. రోజూ లక్షలాది పాజిటివ్ కేసులు, వేలాది మరణాలు నమోదవుతుండడం, ఎక్కడ చూసినా కరోనాకు సంబంధించిన వార్తలు, అంశాలే కనిపిస్తుండడం వల్ల ప్రతి ఒక్కరిలో ఆందోళన వ్యక్తమవుతోంది. పేద-ధనిక, ఆడ-మగ, చిన్నా-పెద్దా...ఈ తేడాలేవీ చూడని వైరస్ తమ దాకా వస్తే పరిస్థితేంటి? అన్న ఆలోచనలు అందరినీ వెంటాడుతున్నాయి. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా కరోనా కల్లోలంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ అవికాగోర్ కొవిడ్ పరిస్థితులపై స్పందించింది. తన కుటుంబం కూడా కరోనాతో పోరాడిందంటూ ఇటీవల ఇన్‌స్టాలో ఓ సుధీర్ఘమైన పోస్ట్ షేర్ చేసింది.
'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో పక్కింటి అమ్మాయిలా మారిపోయింది అవికాగోర్. ఆ తర్వాత ఉయ్యాల జంపాల, లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజుగారి గది 3 సినిమాలతో తెలుగు సినీ ప్రియులకు మరింత చేరువైంది. గత కొన్నేళ్లుగా బొద్దుగా ఉన్న ఈ భామ ఇటీవల సన్నజాజి తీగలా మారిపోయింది. అదేవిధంగా తన గ్లామరస్ ఫొటోలు, వీడియోలతో పాటు బాడీ పాజిటివిటీ పోస్టులను షేర్ చేస్తూ తన ఫాలోవర్లను రోజురోజుకూ పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే కరోనాకు సంబంధించి తన అనుభవాలను పంచుకుంది.
మనం చేయాల్సింది చేద్దాం!
కరోనాతో బయట పరిస్థితులు భయానకంగా మారిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం కొవిడ్ వల్ల దాదాపు 2 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ సంఖ్య నాలుగైదు రెట్లు ఎక్కువే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా సుమారు 20 మిలియన్ల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. కోలుకున్న వారిలో చాలామంది భవిష్యత్‌లోనూ అనారోగ్యంతో బాధపడే అవకాశం ఉంది. ఈ మహమ్మారిని నియంత్రించడం వైద్య, ఆరోగ్య సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. కాబట్టి ఈ వైరస్ వ్యతిరేక పోరులో మనమూ భాగస్వాములమవుదాం. దీనిని కట్టడి చేసేందుకు మనం చేయగలిగినదంతా చేద్దాం.’
నా కుటుంబం కూడా కరోనాతో పోరాడింది!
కొద్ది రోజుల క్రితం నా కుటుంబం కూడా కరోనా బారిన పడింది. అప్పుడు నాకు చాలా భయమేసింది. అదృష్టవశాత్తూ కొవిడ్‌తో జరిగిన పోరాటంలో వాళ్లు విజయం సాధించారు. అందుకు నాకెంతో సంతోషంగా ఉంది. కానీ మరెవరికీ ఈ పరిస్థితులు రాకూడదని కోరుకుంటున్నా. కరోనాను జయించిన వారు దయచేసి ప్లాస్మా దానానికి ముందుకు రండి. ఈ విషయంలో అపోహలు, అవాస్తవాలను నమ్మకండి. అదేవిధంగా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది మనల్ని వైరస్ బారిన పడకుండా ఆపలేదు.. కానీ వైరస్ తీవ్రతను బాగా తగ్గిస్తుంది. పరిస్థితులు చేయి దాటిపోకుండా రక్షణ కలిగిస్తుంది అని చెబుతున్న వైద్య నిపుణుల మాటలను మనం ఆలకించాలి.
ఈ సందర్భంగా ఒక విషయం గుర్తుంచుకోండి.. అత్యవసరమైతే తప్ప బయట అడుగు పెట్టకండి. ఇంట్లోనే ఉందాం. మనందరం సమష్టిగా వైరస్‌పై పోరాడదాం. ఇప్పటికే ఒకసారి కరోనాను(మొదటి దశ) జయించాం. మరోసారి (సెకండ్ వేవ్) విజయం సాధిస్తామన్న నమ్మకం కూడా నాకుంది. నేను మీకు మాటిస్తున్నాను. కరోనా విముక్తి కోసం నాకు చేతనైనంత కృషి చేస్తాను. మీరూ నాతో చేయి కలపండి’ అని తన అభిమానుల్లో స్ఫూర్తి నింపిందీ అందాల తార.