'బాహుబలి', ‘'దంగల్' చిత్రాలు రూ. రెండు వేల కోట్ల వసూళ్లు సాధిస్తే.. అమ్మో అనుకున్నారు సినీప్రియులు. హాలీవుడ్ చిత్రాల స్థాయికి ఇదేం పెద్ద విషయం కానప్పటికీ భారతీయ చిత్రసీమకు పెద్ద మొత్తమే అని చెప్పాలి. హాలీవుడ్ విషయానికొస్తే.. రూ.18,800 కోట్లన్నది (2.7 బిలియన్ డాలర్లు) రికార్డు కలెక్షన్. ప్రపంచ సినీ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో వసూళ్లు సాధించిన ఏకైక చిత్రంగా ‘'అవతార్' నిలిచింది. ఇప్పుడీ రికార్డును రూ.20,000 కోట్ల (3 బిలియన్ డాలర్లు) వసూళ్లతో తిరగరాయబోతుందట 'అవెంజర్స్ ఎండ్ గేమ్'’.
అవెంజర్స్ సిరీస్ నుంచి వస్తోన్న ఈ ఆఖరి చిత్రం ఏప్రిల్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. భారత్‌లో హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో రిలీజ్ అవబోతుంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. కొద్ది గంటల్లోనే వారానికిపైగా టికెట్లు కొనుగోలు చేసేశారు సినీప్రియులు. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే చిత్ర బృందానికి వేల కోట్ల రూపాయలు వెనక్కు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడీ జోరు చూస్తుంటే రూ.20,000 కోట్ల వసూళ్లన్నవి ‘'అవెంజర్స్ ఎండ్ గేమ్’'కు పెద్ద విషయమే కాదనిపిస్తోంది.