"జెర్సీ.. వందలో గెలిచిన ఒక్కడి కథ కాదు.. ప్రయత్నిస్తూ ఓడిపోయిన 99 మంది కథ".. ఈ ఒక్క డైలాగ్తో సినిమా మొదట్లోనే ప్రతీ ప్రేక్షకుడు కనెక్ట్ అయిపోతాడు. ఇక పూర్తిగా చూశాక.. భావోద్వేగాలు నిండిన హృదయంతో హాల్లో నుంచి బయటకు వస్తాడు. 'అర్జున్' పాత్ర చాలా రోజులు మనతోనే ఉంటుంది. అద్భుత నటనతో ఆ పాత్రలో అంతలా ఒదిగిపోయాడు నేచురల్ స్టార్ నాని.
'జెర్సీ'.. క్రీడా నేపథ్యంలో తీసిన సినిమానే అయినా క్రికెట్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకున్ని మెప్పిస్తుంది. నవ్విస్తుంది. కంటతడి పెట్టిస్తుంది. అందుకే.. భాష, ప్రాంతం భేదం లేకుండా గుండెల్లో పెట్టుకుని ఆదరించారు అభిమానులు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వ ప్రతిభ, అనిరుధ్ సంగీతం సినిమాను జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలిపాయి.