హీరో తరుణ్, రిచా జంటగా కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'నువ్వే కావాలి'. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం 20 వసంతాలు(అక్టోబరు 13)న పూర్తి చేసుకోబోతోంది. తరుణ్-రిచాల నటన, విజయ్ భాస్కర్ టేకింగ్, త్రివిక్రమ్ రచనా శైలితో పాటు, సంగీత దర్శకుడు కోటి అందించిన స్వరాలు యువతనే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత స్రవంతి రవికిశోర్, చిత్రవిశేషాలు కొన్నింటిని వెల్లడించారు.
''నువ్వే కావాలి' నన్ను ఆర్థికంగా ఆదుకుంది'
ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో, తరుణ్ హీరోగా కె. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన సినిమా 'నువ్వే కావాలి'. మంగళవారానికి (అక్టోబర్ 13) 20 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత స్రవంతి రవికిశోర్ కొన్ని ఆసక్తికర సంగతులు పంచుకున్నారు.
"ఇప్పటివరకు ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా థియేటర్లో ఎక్కువ మంది చూసిన చిత్రంగా నిలిచిపోతుంది. ఆ రోజుల్లోనే 3కోట్లకు పైగా మంది ప్రేక్షకులు ఈ సినిమాను చూశారు. అయితే ఈ చిత్రానికి మాతృక మలయాళ సినిమా 'నిరం'. దీన్ని చూడగానే చాలా బాగుందనిపించింది. తెలుగులో బాగా ఆడుతుందని భావించి దర్శకుడు విజయ్ భాస్కర్‌కు ఫోన్ చేసి ఈ సినిమా చేద్దామని అడిగా. వెంటనే సరే అన్నాడు. అంతకుముందే తనతో కలిసి పనిచేసిన త్రివిక్రమ్‌ను కూడా కలుపుకుందాం అన్నాడు. నేను అంగీకరించా. అయితే ఈ సినిమాలో సూపర్ హిట్ మెలోడీ సాంగ్ 'అనగనగా ఆకాశం ఉంది' పాట కోసం 400మంది జూనియర్ ఆర్టిస్టులతో, నాలుగు రోజులు పాటు చిత్రీకరించాలి. చాలా డబ్బుతో కూడుకున్న పని. నేను అప్పట్లో ఆర్థికంగా బాగోలేను. అప్పడు రామోజీరావు గుర్తుకువచ్చారు. తక్షణమే ఆయనను కలిసి ఈ ప్రాజెక్టు గురించి చర్చించా. ఆయన మాపై నమ్మకం ఉంచి మాకు సహకరించారు. అలా సినిమాను తెరకెక్కించడం, సూపర్ హిట్‌గా నిలవడం అంతా జరిగిపోయాయి. ఈ చిత్రం ఆర్థిక సమస్యలు నుంచి నన్ను బయటపడేసింది. మొత్తంగా ఈ సినిమా వల్ల హీరో తరుణ్, రిచా, త్రివిక్రమ్‌కు మంచి పేరు వచ్చింది. నా జీవితంలోనే ఈ సినిమా ఓ మైలురాయి" అని రవికిశోర్ మనుసులోని మాటలను పంచుకున్నారు.
ఇదీ చూడండి అమితాబ్‌కు చిరు విషెస్.. 'ప్రతిభకు పవర్‌హౌస్' అని ట్వీట్