అందం, అభినయంతో పాటు తెలివి తేటలు కూడా ఉంటే అలాంటి అమ్మాయిల క్రేజ్ వేరే స్థాయిలో ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే చాలామంది వృత్తిరీత్యా తీరిక లేకపోవడం వల్ల చదువు మీద పెద్దగా దృష్టి పెట్టలేకపోతుంటారు. బాలీవుడ్‌కు చెందిన నటి అష్నూర్ కౌర్ మాత్రం ఒకవైపు వృత్తి, మరోవైపు చదువును సమన్వయం చేసుకుంటూ నటిగా సత్తా చాటుతూనే చదువులోనూ టాపర్‌గా నిలుస్తోంది. తాజాగా ప్రకటించిన సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో ఆమె ఏకంగా 94శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి వారెవ్వా అనిపించింది. సాధారణ విద్యార్థులకు ఈ మార్కులు వస్తే పెద్ద వింతేం కాదు. అయితే.. ఇప్పటికే నటిగా తన కెరీర్ ప్రారంభించి అటు సినిమాల్లో బిజీగా ఉంటూ మరోవైపు మెరుగైన ఉత్తీర్ణత సాధించడం అంటే మామూలు విషయం కాదు. అయితే.. పదో తరగతిలోనూ ఈ చిన్నది 93శాతం మార్కులు సాధించడం విశేషం.
సీబీఎస్‌ఈ ఫలితాల్లో అదరగొట్టిన నటి.. 94 శాతం మార్కులతో - అష్నుర్ కౌర్ ఫలితాలు
అందం, అభినయంతో పాటు తెలివి తేటల్లోనూ టాప్ అంటోంది బాలీవుడ్ నటి అష్నుర్ కౌర్. తాజాగా సీబీఎస్‌ఈ విడుదల చేసిన 12వ తరగతి ఫలితాల్లో ఈ నటి ఏకంగా 94 శాతం మార్కులతో వారెవ్వా అనిపించింది.
ఇంతేనా అంటే..! కాదు ఇంకా ఉంది.. పదేహేడేళ్ల వయసులోనే తన సంపాదనతో ఇప్పటికే కౌర్ సొంత ఇల్లు కూడా కొనుక్కుందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆ విషయాలు ఆమె వెల్లడించింది. ఆ ఇల్లు ఆమె కలల ఇల్లుగా ఆమె అభివర్ణించింది. వచ్చే ఏడాదికి సిద్ధమవుతుందని, ఇలాంటివి చూస్తుంటే మనం జీవితంలో ఎదుగుతున్నామనే భావన కలుగుతుందని ఆమె చెప్పుకొచ్చింది. కరోనా సమయంలోనూ పరీక్షలు రాయకూడదని తాను ఎప్పుడూ అనుకోలేదని, ఏడాదంతా పరీక్షలు రాసేందుకు సన్నద్ధమవుతూనే ఉన్నానని ఆమె చెప్పుకొచ్చింది. 'ఝాన్సీ కీ రాణి 2', 'ఏ రిస్తా క్యా కెహ్లతా హై', 'పాటియాలా బేబ్స్'తో పాటు 'సంజూ' వంటి సినిమాల్లో నటించిందామె.
చదువు మీద దృష్టి పెట్టేందుకు ప్రాజెక్టులకు సంతకాలు చేయలేదట. పదో తరగతిలో వచ్చిన మార్కుల కంటే ఇప్పుడు మరింత మెరుగైన ఫలితాలు రావాలని కోరుకున్నానని, అయితే.. మొత్తానికి తాను అనుకున్నట్లుగానే మంచి మార్కులు వచ్చాయని కౌర్ సంతోషం వ్యక్తం చేసింది. చదువులో ఇంతటితో ఆగిపోకుండా.. బి.బి.ఎం(బ్యాచ్‌లర్ ఆఫ్ మాస్ మీడియా)లో డిగ్రీ చేయాలని, ఆ తర్వాత మాస్టర్స్ కోసం విదేశాలకు వెళ్తానని ఆమె అంటోంది. అక్కడ ఫిల్మ్ మేకింగ్, డైరెక్షన్‌లో మెళకువలు నేర్చుకోవడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటోందీ యువ నటి.