తెలంగాణ

telangana

సినిమా: ఈ ఏడాది.. వైవిధ్యమే విజయరహస్యం..!

By

Published : Nov 29, 2019, 8:49 AM IST

ఈ ఏడాది ఎన్నో సినిమాలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. వాటిలో కొన్ని పెద్ద తారాగణంతో భారీ బడ్జెట్​తో రూపొందినవి అయితే మరికొన్ని కథనే నమ్ముకుని తక్కువ బడ్జెట్​తో తెరకెక్కినవి. చిన్న చిత్రాలైనా సామాజిక కథాంశాలను ఇతివృత్తంగా తీసుకుని ప్రేక్షకుల చేత ఔరా అనిపించుకున్న కొన్ని సినిమాలు మీ కోసం.

artistic movies got lot of success in this year
వైవిధ్యమైన చిత్రాలు

2019 పూర్తికావడానికి మరో నెల మాత్రమే ఉంది. ఇప్పటికే భారతీయ చలనచిత్ర రంగంలో ఎన్నో సినిమాలు విడుదలైనా.. కొన్ని చిత్రాలే ప్రేక్షకుల మనసును గెలవగలిగాయి. కారణం వీక్షకుడిని ఆకట్టుకునే కథనం, దాన్ని తీయగలిగే నేర్పుతో పాటు నటీనటుల ప్రదర్శనకే అభిమానులు ఓటు వేయడం.

ఈ ఏడాది బాలీవుడ్​ చిత్రం 'గల్లీబాయ్​' ఆస్కార్​కు నామినేట్​ కాగా... 'ఉరి: ద సర్జికల్​ స్ట్రైక్స్​' దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. సూపర్​ డీలక్స్, జెర్సీ వంటి సినిమాలు అద్భుతమైన ఆదరణను సంపాదించుకున్నాయి. వార్, సోంచిరియా యాక్షన్​ సన్నివేశాలను చూపిస్తే... మణికర్ణిక, సైరా వంటి చిత్రాలు చారిత్రక సందేశాన్ని చూపించాయి. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న కొన్ని చిన్న చిత్రాలివే...

1. మల్లేశం- తెలుగు

దర్శకుడు, రచయిత రాజ్​ రాచకొండ తెరకెక్కించిన ఈ చిత్రం.. పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కింది. సరైన ప్రోత్సాహం లేకుండా కుదేలైపోతున్న చేనేత పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలిచి, వాళ్ల కోసం ఆసు యంత్రాన్ని కనిపెట్టడానికి మల్లేశం చేసిన కృషిని ఇందులో చూపించారు. ఇందులో పులికొండ ప్రియదర్శి, అనన్య నాగల్ల కలిసి నటించారు. జూన్​ 14న విడుదలైన ఈ సినిమా ప్రశంసలు అందుకుంది.

2.ఆమిస్​(మీట్​)- అసామీస్​

అసోం భాషలో తెరకెక్కిన ఆమిస్​ చిత్రంలో లిమా దాస్​, అర్గదీప్​ నటించారు. హరర్​ డ్రామా రూపంలో రూపొందిన ఈ సినిమాను జాతీయ అవార్డు గ్రహీత భాస్కర్​ హజారికా తెరకెక్కించాడు. వయసుతో పనిలేకుండా ఇద్దరి మధ్య ఏర్పడిన ప్రేమ.. చివరికి ఏ విధంగా మారింది అనేది కథాంశం. ఈ సినిమా ప్రఖ్యాత ట్రిబెకా ఫిల్మ్​ ఫెస్టివల్​లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ ఏడాది నవంబర్​ 22న సినిమా విడుదలైంది.

3. ఆర్టికల్​ 15- హిందీ

కులం పేరుతో పాల్పడే దాడులకు ఓ పోలీసు అధికారి ఏ విధంగా చెక్​ పెట్టాడు అనేది కథాంశం. క్రైమ్​ డ్రామాగా దీన్ని రూపొందించారు. ఇందులో ఆయుష్మాన్​ ఖురానా, నాజర్​, మనోజ్​ పాహ్వా, కుముద్​ మిశ్రా, ఇషా తల్వార్​ వంటి ప్రముఖులు నటించారు. అనుభవ్​ సిన్హా దర్శకుడు. రూ.29 కోట్లతో తెరెకెక్కిన చిత్రం దాదాపు 93 కోట్లకు పైగా బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు రాబట్టింది.

4.అభ్యక్తో- బెంగాలీ

అర్పితా ఛటర్జీ, అదిల్​ హుస్సేన్​ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అభ్యక్తో. తల్లి, బిడ్డ మధ్య అనుబంధాన్ని ప్రధానంగా చూపించారు. ఈ సినిమాను కోల్​కతా అంతర్జాతీయ ఫిల్మ్​ ఫెస్టివల్​లో ప్రదర్శించారు. అర్జున్​ దత్తా దీనికి దర్శకుడు.

5.గమక్​ ఘర్​(హౌస్​ ఇన్​ ది విలేజ్​)-మైతిలీ

అచల్​ మిశ్రా దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో... 1998, 2010, ప్రస్తుత నేపథ్యంలో కథను కలిపి చూపించాడు. ఓ పుట్టినరోజు వేడుకలో భాగంగా స్వగ్రామానికి వచ్చిన ఓ కుటుంబం.. ఆ తర్వాత 20 ఏళ్ల కాలంలో బంధాలు ఏమయ్యాయి అనే కథాంశంతో తెరకెక్కింది. ఇది ముంబయి ఫిల్మ్​ఫెస్టివల్​లో ఉత్తమ చిత్ర విభాగంలో పోటీపడింది.

6.టూలెట్​- తమిళం

దర్శకుడు చెలియన్‌ తెరకెక్కించిన తమిళ చిత్రం 'టూలెట్‌'. సంతోష్‌ శ్రీరామ్‌, సుశీల, ఆధిరా పాండిలక్ష్మి, ధరుణ్‌ బాలా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలకు ముందే 80వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రం విభాగంలో నామినేట్‌ అయ్యింది. 26 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. చెన్నైలో అద్దె ఇంటిని వెతకడానికి ఓ కుటుంబం పడే కష్టాల్ని ఈ సినిమాలో దర్శకుడు ఎంతో సహజంగా చూపించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

7.వైరస్​ - మలయాళం

ఈ చిత్రాన్ని మెడికల్​ థ్రిల్లర్​ నేపథ్యంలో తెరకెక్కించాడు దర్శకుడు ఆశిక్​ అబు. 2018లో కేరళలో విజృంభించిన నిఫా వైరస్​ వ్యాధిని అరికట్టేందుకు ఓ బృందం ఎలా ప్రయత్నించింది అనేది చూపించారు. ఈ ఏడాది జూన్​లో విడుదలైన ఈ చిత్రం విపరీతంగా ప్రశంసలు అందుకుంది. కుంచాకో బోబన్​, పార్వతి తిరువొత్తు కీలకపాత్రల్లో నటించారు.

8.కవలుదారి(క్రాస్​ రోడ్స్​)- కన్నడ

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ నిర్మాతగా రూపొందిన సినిమా 'కవలుదారి'. గతంలో 'గోది బణ్ణ సాధారణ మైకట్టు'’ సినిమాకు దర్శకత్వం వహించిన హేమంత్‌ ఈ సినిమాకు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించాడు. అనంతనాగ్‌, రిషి, సుమన రంగనాథ్‌, అచ్యుత్‌కుమార్‌ ప్రధాన తారాగణం. ఓ ట్రాఫిక్​ పోలీసుకు క్రైం విభాగంలో పనిచేయాలని ఉంటుంది. కానీ అనుకోకుండా ఓ రోజు మెట్రో కోసం గుంతలు తీస్తుంటే నలభయ్యేళ్ల నాటి పుర్రెలు బయటపడతాయి. రెండ్రోజులు వార్తా ఛానళ్లు హల్​చల్​ చేశాక... ఆ విషయాన్ని అందరూ మరిచిపోతారు. కానీ ఆ ట్రాఫిక్​ పోలీసు, మరో రిటైర్డు పోలీసుతో కలిసి ఆ కేసును ఎలా ఛేదించాడన్నదే కథ.

ఇదీ చదవండి: సూపర్ స్టార్​తో ఖుష్బూ మరోసారి .. ఫ్యాన్స్ ఖుష్​!

ABOUT THE AUTHOR

...view details