తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ తారలు.. బాక్సాఫీస్​పై ఎక్కుపెట్టిన బాణాలు - RRR RLEASE DATE

విలువిద్య నేపథ్య కథతో తెరకెక్కిన సినిమాలు త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. హీరోహీరోయిన్లు కూడా తమ గురి తప్పదనే నమ్మకంతో ఉన్నారు. ఇంతకీ ఆ సినిమాలేంటి? విలువిద్యతో ఏ నటీనటులు, వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు?

archery based movies in tollywood
మూవీ న్యూస్

By

Published : Jul 1, 2021, 6:42 AM IST

Updated : Jul 1, 2021, 3:47 PM IST

విలుకాళ్లకు పెట్టింది పేరు మన భరత ఖండం. మన పురాణ పురుషులు ఎక్కువగా విల్లు భుజాన ధరించే కనిపిస్తుంటారు. పురాణ గాథల్లో వాళ్లు విల్లు ఎక్కిపెట్టి బాణం వదిలారంటే లక్ష్యం ఛేదించాల్సిందే. అదే స్ఫూర్తిని నింపుకొన్న మన దేశ ఆర్చరీ క్రీడాకారులు నేడు పతకాల పంట పండిస్తున్నారు. ఆర్చరీ ప్రపంచకప్‌లో దీపిక కుమారి మూడు స్వర్ణాలతో ధగధగ మెరిసింది. ఆమె భర్త అతానుదాస్‌, భారత అగ్రశ్రేణి ఆర్చర్‌ అభిషేక్‌ వర్మ... ఇలా పలువురు తమ సత్తా చాటి స్వర్ణ పతకాల్ని సొంతం చేసుకున్నారు. విశ్వక్రీడల్లోనూ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వీళ్లలాగే సినీ తారలూ విల్లు ఎక్కుపెట్టారు. బాక్సాఫీసుపై పెట్టిన మా గురి తప్పదంతే అని నమ్మకంగా చెబుతున్నారు.

అల్లూరి.. బాణమై

శత్రువులపై నిప్పులవర్షం కురిపించి అగ్గిపిడుగు అనిపించుకున్నారు స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు. నిలబడిన నిప్పుకణంలాంటి ఆ యోధుడి పాత్రను పోషిస్తున్న రామ్‌చరణ్‌.. ఇప్పుడు విల్లు ఎక్కుపెట్టారు. అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రచార చిత్రాల్లో రామ్‌చరణ్‌ ఎక్కువగా విల్లుతోనే సందడి చేశారు. బాణమైనా.. బందూక్‌ అయినా వానికి బాంచెన్‌ అయితదంటూ ఇప్పటికే ఎన్టీఆర్‌ ఆ పాత్రను పరిచయం చేసిన టీజర్​ సందడి చేస్తోంది. మరి రామ్‌చరణ్‌ బాణాలతో ఎలా ఆడుకున్నాడో తెలియాలంటే 'ఆర్ఆర్ఆర్' విడుదల వరకు ఎదురు చూడాల్సిందే.

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్​చరణ్

'ఆదిపురుష్‌' అస్త్రమై..

విలువలు కలిగిన విలుకాడు.. పలు సుగుణాలకు చెలికాడు అనిపించుకున్నారు మన పురాణ పురుషుడు శ్రీరామచంద్రుడు. మరి ఆ పాత్రలో కనిపించాలంటే ఎవరైనా సరే విల్లు ఎక్కుపెట్టాల్సిందే కదా! అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ అదే ప్రయత్నంలోనే ఉన్నారు. ప్రభాస్‌ శ్రీరాముడిగా నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో, మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీతో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రభాస్‌ విలువిద్య నేర్చుకుంటున్నారు. తన నివాసంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుని మరీ సాధన చేస్తున్నారు. ప్రభాస్‌ విల్లు ఎక్కుపెట్టడం ఇది తొలిసారి కాదు. ‘బాహుబలి’ చిత్రాల్లో ఆయన శత్రుసేనలపై విల్లు ఎక్కుపెట్టి విరుచుకుపడ్డారు. ‘ఆదిపురుష్‌’ కోసం మరోసారి ఆ ప్రయత్నం చేయనున్నారు. విలుకాడిగా కనిపించడం కోసం శారీరకంగా మార్పు కనిపించేలా ప్రత్యేకంగా కసరత్తులు చేస్తున్నారు. ఈ పాత్రకు ఉన్న ప్రాధాన్యం అలాంటిది.

బాహుబలిలో ప్రభాస్

విలువిద్య.. తొలి పాఠమై

విలువిద్య నేపథ్యంలో రూపొందిన భారతదేశ తొలి చిత్రం మాదే అంటున్నారు యువ తార నాగశౌర్య. ఆయన కథానాయకుడిగా ‘లక్ష్య’ తెరకెక్కుతోంది. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. నారాయణదాస్‌ కె.నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తుదిదశకు చేరుకున్న ఈ సినిమాలో కథానాయకుడు నాగశౌర్య విలుకాడిగా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ఎనిమిది పలకల దేహాన్ని సిద్ధం చేసుకుని కెమెరా ముందుకొచ్చారు. ‘‘తీక్షణమైన దృష్టి, ఏకాగ్రత, క్రమశిక్షణ కలగలిపిన క్రీడ ఇది. ఆ క్రీడ నేపథ్యంలో సినిమాని రూపొందిస్తుండడం ఓ గొప్ప అనుభవం’’ అంటోంది ‘లక్ష్య’ బృందం.

లక్ష్య సినిమాలో నాగశౌర్య

హీరోయిన్లూ..

* హీరోలే కాదు, హీరోయిన్లూ విల్లు అందుకున్నారు. ఈషా రెబ్బా మలయాళంలో చేస్తున్న ఓ చిత్రం కోసం ఆర్చరీలో శిక్షణ తీసుకుంది. తమిళ కథానాయకుడు విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ చిత్రంలో ఆండ్రియా కూడా విల్లుతో సందడి చేసింది. అందుకోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. సినిమాలోని పాత్రల కోసం ప్రొఫెషనల్‌ క్రీడాకారుల్ని తలపించేలా చెమటోడుస్తున్న మన తారల గురి తప్పకూడదని కోరుకుందాం.

ఈషా రెబ్బా
Last Updated : Jul 1, 2021, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details