తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నా జీవితానికి, ఈ కథకు సంబంధం లేదు!' - 99 సాంగ్స్​

'99 సాంగ్స్​' సినిమా తన జీవితాధారంగా రూపొందించినది కాదని అంటున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్​ రెహమాన్​. కేవలం కథ నచ్చి నిర్మాతగా మారినట్లు స్పష్టం చేశారు. పాన్​ ఇండియా స్థాయిలో ఏప్రిల్​ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో రెహమాన్​, హీరో ఇహాన్ భట్​ మీడియాతో ముచ్చటించారు.

ar rahman interview on 99 songs
'నా జీవితానికి, ఈ కథకు సంబంధం లేదు!'

By

Published : Apr 13, 2021, 8:04 AM IST

Updated : Apr 13, 2021, 10:07 AM IST

ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ నిర్మించిన చిత్రం '99 సాంగ్స్‌'. విశ్వేశ్‌ కృష్ణమూర్తి దర్శకుడు. ఇహాన్‌ భట్‌, ఎడిల్సీ నాయకానాయికలు. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏప్రిల్‌ 16న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జూమ్‌ వేదికగా సినిమా విశేషాలు పంచుకున్నారు రెహమాన్‌, ఇహాన్‌ భట్‌. ఆ సంగతులవీ..

సంగీత ప్రధానంగా గతంలో 'సర్వం తాళమయం' అనే చిత్రం వచ్చింది కదా! ఈ సినిమా ఎలా ఉండబోతోంది?

రెహమాన్‌:అవును. ఆ చిత్రానికి నేను సంగీతం అందించాను. నేపథ్యం ఒకటే కావొచ్చు. కానీ, రెండు కథలకు చాలా తేడా ఉంది. అదొక ప్రపంచానికి సంబంధించింది. ఇదొక ప్రపంచానికి సంబంధించింది. గమ్యం ఒకటే అయినా దాన్ని చేరుకునే మార్గాలు విభిన్నం కదా. ఇందులో తాను కన్న కలను నిజం చేసేందుకు కథానాయకుడు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సంగీతం అనేది సంస్కృతి, తరాల వారధిగా నిలుస్తుంది. ఈ చిత్రంలోని హీరో పాత్ర సైతం రెండు తరాల మధ్య సాగేదిగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య తను పడిన సంఘర్షణే ఆసక్తికరం.

దర్శకుడిగా విశ్వేశ్‌ కృష్ణమూర్తినే ఎందుకు ఎంపిక చేసుకున్నారు?

రెహమాన్‌:ఏ కథనైనా ఫ్రెష్‌గా చెప్పాలనుకున్నప్పుడు అన్ని విషయాల్లోనూ కొత్తదనమే కోరుకోవాలి. రచయితగా నేనూ కొత్తవాణ్నే, నటీనటులు కొత్తవారే. దర్శకుడు కూడా కొత్త వాడైతేనే ఈ ప్రాజెక్టుకు తాజాగా ఉంటుందనే ఉద్దేశంతో విశ్వేశ్‌ను తీసుకున్నా. గతంలో ఆయన దర్శకత్వం వహించిన కొన్ని వీడియోలు, వెబ్‌ సిరీస్‌ చూశాను. అప్పుడే తన ప్రతిభను గుర్తించి ఈ కథను తెరకెక్కించే బాధ్యత అప్పగించాను. నా ప్రయత్నానికి తన సహకారం తోడై అనుకున్నది సాధ్యమైంది. ప్రేక్షకుడికి ఇది మన సినిమా అనే ఫీల్‌ రావాలని ఆయా భాషలకు తగ్గట్టు చిత్రీకరించాం.

చాలా మంది ఈ చిత్రం మీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది అంటున్నారు. నిజమేనా?

రెహమాన్‌:నా జీవితానికి, ఈ సినిమాకీ సంబంధం లేదు. సంగీతం నేపథ్యంలో వస్తోన్న కథ కావడం వల్ల అలా అనుకుంటున్నారేమో! నాది సంగీత నేపథ్య కుటుంబం. ఈ సినిమా ఎలాంటి సంగీత నేపథ్యం లేని ఓ యువకుడి కథ. నేను నిర్మాతను అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. కొన్ని సంఘటనలు నాలో కొత్త ఆలోచన తీసుకొచ్చాయి. దాంతో ధైర్యం చేసి నిర్మాతగా మారాను.

ఈ సినిమాకు కథ కూడా మీరే అందించారు. దానికి స్ఫూర్తి ఏంటి?

రెహమాన్‌:ఆస్కార్‌ అవార్డు వచ్చిన తర్వాత విదేశాలు పర్యటించాను. ఎక్కువగా హాలీవుడ్‌కే పరిమితం అయ్యాను. ఎంతోమంది సాంకేతిక నిపుణుల్ని కలిశాను. ఆ సమయంలో స్క్రీన్‌ రైటింగ్‌, వర్చువల్‌ రైటింగ్‌కు సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అందులో భాగంగానే సినిమా కథ రాయాలనే ఆలోచన వచ్చింది. నేను గడిపిన జీవితం, నా ఇన్నేళ్ల సంగీత అనుభవంలో నేను గమనించిన అంశాలతో రాసుకున్నాను.

ఇటీవలే నటుడిగానూ మారారు. ఈ సినిమాలో ఏదైనా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారా?

రెహమాన్‌:ఈ చిత్రంలో నేను ఎలాంటి పాత్ర పోషించలేదు. అంతటి అవసరం రాలేదు.

ఈ చిత్రంలో కథానాయకుడిగా అవకాశం ఎలా వచ్చింది?

ఇహాన్:ఈ సినిమాలోని నాయకానాయికల పాత్ర కోసం 1000పైగా ఆడిషన్స్‌ నిర్వహించారు. నేనూ ఆడిషన్‌ ద్వారానే ఈ చిత్రంలోకి నటుడిగా అడుగుపెట్టాను. రెహమాన్‌ సర్‌ నిర్మాణంలో హీరోగా పరిచయమవడం చాలా ఆనందంగా ఉంది. నటన విషయంలో రెహమాన్‌ నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఇందులో జై అనే పాత్ర పోషించాను. నటనలో శిక్షణ తీసుకుని, సంగీత కారుడిగా పాత్రలో ఒదిగిపోయేందుకు తగిన కసరత్తులు చేశాను.

'99 సాంగ్స్‌' ప్రత్యేకత ఏంటి?

రెహమాన్‌:సంగీతానికి సంబంధించి కొత్త గళాన్ని వినిపించనుంది. మణిరత్నం, శంకర్‌, రాజమౌళి.. ఇలా ఒక్కో దర్శకుడు ఒక్కో వాయిస్‌తో కథల్ని తెరకెక్కిస్తుంటారు. అలానే '99 సాంగ్స్‌' ఓ కొత్త వాయిస్‌తో రానుంది.

తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు?

రెహమాన్‌:నాకు తెలుగు సినిమాలంటే ఇష్టం. మంచి కథ వస్తే తప్పకుండా చేస్తాను.

ఇదీ చూడండి:రాధేశ్యామ్: పండగలు ఎన్నో.. ప్రేమ ఒక్కటే!

Last Updated : Apr 13, 2021, 10:07 AM IST

ABOUT THE AUTHOR

...view details