సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం నిన్నటి కంటే మెరుగ్గా ఉందని అపోలో ఆస్పత్రి వెల్లడించింది. ఈ మేరకు రజినీ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన అపోలో ఆసుపత్రి ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.
రక్తపోటులో హెచ్చుతగ్గులకు సంబంధించి చికిత్స అందిస్తున్నట్లు అపోలో వైద్యులు వివరించారు. సాయంత్రం మరికొన్ని వైద్య పరీక్షల నివేదికలు వస్తాయని, రక్తపోటు నియంత్రణలోకి వచ్చాక డిశ్చార్జ్ విషయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. రజినీ ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అపోలో ఆసుపత్రి సీఎండీ సంగీతారెడ్డి స్పష్టం చేశారు.
స్పందించిన ప్రముఖులు..
రజినీకాంత్ ఆరోగ్యంపై తెలంగాణ గవర్నర్ తమిళసై అపోలో వైద్యులతో మాట్లాడారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ట్విటర్ వేదికగా స్పందించిన మంత్రి కేటీఆర్, హరీశ్‌రావులు.. తలైవా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
జనసేన అధినేత హీరో పవన్‌కల్యాణ్ కూడా స్పందించారు. ‘అస్వస్థతతో రజినీకాంత్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుసుకొని బాధపడ్డాను. ఆయనకు కరోనా లేదని వైద్యులు ప్రకటించడం ఊరటనిచ్చింది. మనోధైర్యం మెండుగా ఉన్న రజినీకాంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని తెలిపారు. రజినీ ఆరోగ్యంపై కమల్‌హాసన్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, తెదేపా అధినేత చంద్రబాబు తదితర సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆరాతీశారు.
సంబంధిత కథనం:రజినీకాంత్‌కు అస్వస్థత.. జూబ్లీహిల్స్ అపోలోలో చేరిన సూపర్ స్టార్