ప్రేమ, ఇష్క్, కాదల్, ప్యార్ ఇలా పేర్లు ఎన్నైనా భావం ఒక్కటే.. తొలి చూపులోనే మనసు దోచి.. చివరి శ్వాస వరకు తోడుంటానంటూ మాటిచ్చే ఈ ప్రేమ.. దూరమయ్యాక కొంత మందికి తీపి జ్ఞాపకాలను మిగిల్చితే.. మరికొంత మందికి వందేళ్ల బాధను పంచుతోంది.
ఇలా మాట్లాడుతూ పోతుంటే ఆనాటి ఇళయరాజా స్వరపరిచిన 'ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం' పాట నుంచి మొన్నీ మధ్య వచ్చిన 'ఓ మై బ్రదరూ చెబుతా వినరో వన్ సైడూ లవ్వేరా ఎంతో బెటరూ' సాంగ్ వరకు ప్రేమలో విఫలమైన వారికి ఊపందించే గీతాలు ఎన్నో ఎన్నెన్నో. ప్రేమలో సఫలమైన వారు జీవితంలో ప్రేమను పొందితే.. దూరమైన వారు అందులో పాఠాలు నేర్చుకొని ఆ జ్ఞాపకాలను గుండెల్లో మోస్తూ.. విజయాలవైపు అడుగులేస్తారు.
బ్రేక్ అప్ అయ్యిందా డోంట్ వర్రీ గురూ...
ఎంతో జాలీగా ఎవ్వరూ మనల్ని ఆపేవారే లేరనుకొని ఓ హీరోలా జీవిస్తుంటాం. అంతే అనుకోకుండా ఒకరోజు ఎవరో అమ్మాయి కనిపిస్తుంది. నా కోసమే పుట్టిందా అనిపిస్తుంది. ఒక్కసారిగా గాలితో పోటీ పడి పరుగులు పెట్టే వాడికి బ్రేకులు పడతాయి. తనే లోకంగా జీవిస్తున్న సమయంలో అనుకోకుండా 'బ్రేక్ అప్' అనే మాట వినిపిస్తుంది. అంతే మనోడికి గుండె పిండేసినట్టనిపిస్తుంది. బహుశా ఇలాంటి వారికోసమేమో సినీ రచయితలు ఏరి కోరి పాటలు రాస్తుంటారు. తాజాగా 'మాయ మాయ' పాట ఈ బ్రేక్అప్ ప్రేమికులకు థీమ్ సాంగ్ అయ్యింది.
వన్‌సైడ్ లవ్ ఎంతో బెటరూ...
అప్పుడెప్పుడో ఆర్య సినిమాలో 'వన్‌సైడ్ లవ్ ఎంతో బెటర్' అని చెప్పిన బన్నీ... 'ఆర్య 2' చిత్రంలో 'మై లవ్ ఈజ్ గాన్' పాటతో భగ్న ప్రేమికులకు మరింత ఊతమిచ్చాడు. 'ప్రేమను తీసుకునే వాళ్లకే ఇంత ఉంటే.. ఇచ్చే వాళ్లకు ఎంతుండాలంటూ' సుకుమార్ బన్నీతో చెప్పించిన డైలాగ్‌లు యువ ప్రేమికులను ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంటాయి.