కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో కథానాయిక అనుష్క శెట్టి భావోద్వేగ సందేశం పోస్ట్ చేశారు. బాధల్ని పంచుకోవాలని, ఇతరుల మాటలు వినాలని సలహా ఇచ్చారు. ఈ ప్రపంచంలో ఎవరూ పర్‌ఫెక్ట్ కాదని తెలిపారు.
"మనమంతా మనకు తెలిసిన విధంగా జీవితంలోని సమస్యల్ని పరిష్కరించుకుంటాం. ఎవరూ పర్‌ఫెక్ట్ కాదు. ఇదే సరైన మార్గం, ఇది సరికాని మార్గం.. అంటూ ఏమీ ఉండవు. మనమంతా రోడ్డు మ్యాప్‌తో పుట్టలేదు. మనకు సరైంది అనిపించిన మార్గంలో ముందుకు సాగుతున్నాం. మనమంతా మానసికంగా బాధలు పడుతుంటాం.. అయినా పర్వాలేదు. కొందరు సాయం కోసం బయటపడి ఏడుస్తుంటారు, కొందరు లోలోపలే కుమిలిపోతుంటారు. కొందరు పరధ్యానంలో ఉంటారు, కొందరు తమదైన మార్గాల్ని ఎంచుకుంటారు, కొందరు నిస్సహాయంగా ఉంటారు. మనమంతా కలిసి ఇంకా ఉత్తమంగా జీవించటానికి ప్రయత్నిద్దాం. ఇంకా దయతో జీవిద్దాం. ఇతరుల మాటల్ని విందాం, వారిని ప్రేమిద్దాం. బలంగా ఉందాం. మనమంతా మనుషులం. ఓ నవ్వు, మాటల్ని వినే గుణం, ఆప్యాయతతో కూడిన స్పర్శ.. ఎదుటి వ్యక్తి జీవితంలో ఎంతో మార్పును తెస్తుంది. మనం ప్రతి సమస్యకు పరిష్కారం చూపలేకపోవచ్చు. కానీ ఓ చిన్న చొరవ ఎంతో మార్పును తెస్తుంది. మార్పనేది నెమ్మదిగానే మొదలవుతుంది"