ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అనుష్క ‘నిశ్శబ్దం’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. కరోనా నేపథ్యంలో థియేటర్లు మూతపడటం వల్ల ఓటీటీవైపే దర్శకనిర్మాతలు మొగ్గు చూపారు. అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబరు 2 నుంచి అందుబాటులోకి రానుందని ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దీనిని విడుదల చేయనున్నారు.
ఓటీటీలోనే అనుష్క 'నిశ్శబ్దం' సినిమా - అక్టోబరు 2న నిశ్శబ్దం సినిమా
స్వీటీ అనుష్క 'నిశ్శబ్దం' సినిమా.. అక్టోబరు 2న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
'నేను ఇప్పటి వరకు పోషించిన అన్ని పాత్రలతో పోలిస్తే 'సాక్షి' నాకు చాలా కొత్తగా అనిపించింది. మాధవన్‌తో మళ్లీ పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. వృత్తిపట్ల ఎంతో అంకితభావం ఉన్న వ్యక్తి ఆయన. సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్, అంజలి, షాలినీ పాండే, మైకేల్ మాడ్సెన్, ఒలీవియా డంక్లే, హేమంత్ మధుకర్, వివేక్ కూచిభోట్ల, డిఓపి షనీల్ డియోతోపాటు 'నిశ్శబ్దం'లో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మా బృందం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికీ సినిమా అందుబాటులోకి తీసుకురాబోతున్న అమెజాన్‌కు ధన్యవాదాలు' అని అనుష్క చెప్పింది.
ఈ ఏడాది ఆరంభంలోనే 'నిశ్శబ్దం' థియేటర్లలోకి రావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల దానిని వాయిదా వేశారు. లాక్‌డౌన్ వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమాలో అనుష్క దివ్యాంగురాలిగా నటించింది. హేమంత్ మధుకర్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై కోన వెంకట్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు.