తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విలన్ పాత్ర చేయడానికి సిద్ధం: అనుష్క

ఇటీవలే 'నిశ్శబ్దం' చిత్రంతో ప్రేక్షకులను అలరించిన అనుష్క శెట్టి.. తాజాగా సోషల్​మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు తీరిగ్గా సమాధానం చెప్పారు.

Anushka Shetty talks about working with Prabhas again, breaks silence on viral wedding photo
ప్రభాస్​తో పెళ్లి ఫొటోపై స్వీటీ స్పందన

By

Published : Oct 4, 2020, 9:27 PM IST

అందం, అభినయంతో దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న ముద్దుగుమ్మ అనుష్క. ఆమె తొలిసారి ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. 'నిశ్శబ్దం' సినిమా ప్రచారంలో భాగంగా ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన సినిమా ఇది. మాధవన్‌, షాలినీ పాండే, సుబ్బరాజు, అంజలి కీలక పాత్రలు పోషించారు. అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థ్రిల్లర్‌ మూవీగా అలరిస్తోంది. ఈ నేపథ్యంలో అనుష్క అభిమానులతో మాట్లాడిన విశేషాలు మీ కోసం..

మీ తర్వాతి రెండు ప్రాజెక్టుల్ని ప్రకటించండి. 'భాగమతి' తర్వాత 'నిశ్శబ్దం' కోసం రెండేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ ఎదురుచూపులు మమ్మల్ని చంపుతున్నాయి, మా వల్ల కాదు స్వీటీ..!

అనుష్క: త్వరలోనే చెబుతా. అన్నీ కుదిరిన తర్వాత నిర్మాణ సంస్థలు అధికారికంగా ప్రకటిస్తాయి.

సాక్షి ('నిశ్శబ్దం'లో పాత్ర) సవాలుతో కూడుకున్న పాత్ర, నటిస్తున్నప్పుడు మీకేం అనిపించింది. సినిమాలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఎలా ఫీల్‌ అయ్యారు?

అనుష్క:నటిగా నా పరిధిదాటి ఆలోచించేలా చేసిన పాత్ర ఇది. ఎంతో నేర్చుకున్నా.. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం.

అనుష్క శెట్టి

ఇదేం చాట్‌ సెషన్‌.. నువ్వు నాకు రిప్లై ఇవ్వడం లేదు. (దిగులుగా ఉన్న ఎమోజీలు షేర్‌ చేస్తూ)

అనుష్క:ఇప్పుడిప్పుడే ట్విట్టర్‌ గురించి తెలుసుకుంటున్నా. నెమ్మదిగా జవాబులు ఇస్తున్నందుకు క్షమించాలి.

మీ ఫ్యాన్స్‌ గురించి చెప్పండి?

అనుష్క:అందరికీ హాయ్‌.. మిమ్మల్ని నేనెంతో గౌరవిస్తున్నా.. మీ ప్రేమను నా గుండెల్లో భద్రంగా దాచుకున్నా. ధన్యవాదాలు.

ఇప్పటి వరకు మీరు నటించిన పాత్రల్లో ఇష్టమైంది?

అనుష్క: ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించే అవకాశం రావడం నా అదృష్టం. 'అరుంధతి', 'వేదం', 'రుద్రమదేవి', 'భాగమతి', 'సైజ్‌ జీరో', 'నిశ్శబ్దం', 'బాహుబలి', 'నాన్న'... సినిమాల్లోని పాత్రలంటే ఇష్టం. నా దర్శక, నిర్మాతలకు, చిత్ర బృందాలకు ధన్యవాదాలు.

నాది బిహార్‌, మీకు వీరాభిమానిని. ప్రభాస్‌తో కలిసి మరో సినిమా చేయండి. మీ ఇద్దరి జంట చక్కగా ఉంటుంది.

అనుష్క:సరైన కథ నా వద్దకు వస్తే.. కచ్చితంగా నటిస్తా. మీ ప్రేమకు కృతజ్ఞతలు.

ఈ ఫొటో ఎలా ఉంది అనుష్క. నాలుగు గంటలు కష్టపడి వేశా.

అనుష్క: థ్యాంక్యూ, థ్యాంక్యూ..

అభిమాని గీసిన చిత్రం

'నిశ్శబ్దం' సినిమా నుంచి మీరు నేర్చుకున్న మంచి విషయం ఏంటి? భవిష్యత్తులో మీరు ప్రతినాయకురాలిగా నటించే అవకాశాలు ఉన్నాయా?

అనుష్క:'నిశ్శబ్దం' వల్ల సైన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకున్నా. నేను ఎటువంటి పాత్ర చేయడానికైనా సిద్ధమే..

మీ రహస్యాల్ని ఎవరితో పంచుకుంటుంటారు?

అనుష్క:ఆ దేవుడు నాకు గొప్ప స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని ఇచ్చాడు.

నా ఒక్క ప్రశ్నకు కూడా నువ్వు జవాబు చెప్పలేదు.. లవ్‌ యూ సో మచ్‌ (ఏడుస్తున్న జిఫ్‌ షేర్‌ చేస్తూ..)

అనుష్క: లవ్‌ యూ.. క్షమించు.. వీలైనన్ని ప్రశ్నలకు రిప్లై ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా..

మీ ట్విట్టర్‌ ఖాతాను మీరే నడుపుతున్నారా? లేదా మీ బృందమా?

అనుష్క: నేను, నా టీం కలిసి చూసుకుంటున్నాం.

మీకు ఇష్టమైన యానిమేటెడ్‌ పాత్ర?

అనుష్క:నాకు 'మోనా' అంటే ఇష్టం.

అనుష్క శెట్టి

గతాన్ని మార్చుకోవాలి అనుకుంటారా? భవిష్యత్తును చూస్తారా?

అనుష్క: గతాన్ని నేను మార్చలేను. నా జీవితంలోని ప్రతి మూమెంట్‌ ఇవాళ నేను ఈ స్థాయికి చేరడానికి కారణమైనవే..

మీరు పుస్తకాలు చదువుతారా? మీకిష్టమైన పుస్తకం ఏది?

అనుష్క: ది ఆల్కెమిస్ట్.

మేడమ్‌ మీ ట్విట్టర్​కు బ్లూ టిక్‌ మార్క్‌ పెట్టించుకోండి. ఇది మీ ఖాతానా? కాదా? అని అభిమానులు తికమక పడుతున్నారు.

అనుష్క:ఆ ప్రక్రియ జరుగుతోంది.. త్వరలోనే పూర్తవుతుంది.

దక్షిణాదిలో కాకుండా బాలీవుడ్‌, ఇతర భాషల్లో నటించే ఉద్దేశం ఉందా?

అనుష్క: ఇతర భాషల్లో నటించడం నాకు ఇష్టమే. కంటెంట్‌ బాగుంటే భాష నాకు సమస్య కాదు.

లాక్‌డౌన్‌లో మీరు తెలుసుకున్న విషయం?

అనుష్క:జీవితం, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎల్లప్పుడూ మన అధీనంలో ఉండవు. ప్రతి క్షణానికి, వ్యక్తికి విలువ ఇవ్వాలి.

ఈ ఫొటో గురించి ఒక్క మాట చెప్పండి? ('మిర్చి'లో ప్రభాస్‌, అనుష్క పెళ్లి సన్నివేశం ఫొటో షేర్‌ చేస్తూ..)

'మిర్చి' సినిమాలో ఓ సన్నివేశంలోని చిత్రం

అనుష్క: మేమిద్దరం సాధారణంగా సన్నివేశం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో తీసిన ఫొటో అది.. ఆపై అందమైన పోస్టర్‌గా మారింది. నా హృదయానికి చేరువైన చిత్రమది. యూవీ క్రియేషన్స్‌లో చేసిన తొలి సినిమా.

ఇవాళ నా పుట్టినరోజు స్వీటీ..

అనుష్క: జన్మదిన శుభాకాంక్షలు.. ఎప్పుడూ ఆనందంగా ఉండండి.

జీవితం గురించి..?

అనుష్క: నన్ను నేను ఇంకా ఉత్తమంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటా..

'నిశ్శబ్దం' పాత్ర కోసం ఎలా శిక్షణ తీసుకున్నారు?

అనుష్క: హైదరాబాద్‌లో రమ్య, ఆమె బృందం శిక్షణ ఇచ్చారు. ఆపై అమెరికాలో ఒలీవియా డంక్లే అమెరికన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ నేర్పించారు. దర్శకుడు హేమంత్‌ మధుకర్‌ కూడా సాయం చేశారు.

యోగా శిక్షకురాలిగా మీరు నేర్చుకున్న విషయం ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది.

అనుష్క: మన సమాజంలో రకరకాల మనుషులున్నారు. ఎవరి ప్రత్యేకత వాళ్లదే. కాబట్టి మనల్ని మనం గౌరవించుకోవాలి. ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు.

అనుష్క

మీకు బెంగాలీ తెలుసా? హౌరా బ్రిడ్జ్‌ చూశారా? నేను మీకు పెద్ద అభిమానిని.

అనుష్క: చూశా, అక్కడ షూటింగ్‌ కూడా జరిగింది.. నాకు బెంగాలీ స్నేహితులు ఉన్నారు. మీ ప్రేమకు ధన్యవాదాలు.

దర్శకుడి విజన్‌, రచయిత ఆలోచనలు మీ నిర్ణయంపై ఎలాంటి ప్రభావం చూపుతుంటాయి?

అనుష్క: నేను దర్శకుల నటిని. వారి విజన్‌ను అనుసరిస్తా. నా కంటే కంటెంట్‌ ముఖ్యమని భావించే నటిని నేను.

మీ జీవితంలో స్ఫూర్తి నింపిన వ్యక్తి ఎవరు?

అనుష్క: నా తల్లిదండ్రులు, యోగా గురువు.. ఇంకా చాలా మంది ఉన్నారు.

కుటుంబ సభ్యులతో అనుష్క

నాకు బాధగా అనిపించిన ప్రతిసారీ మీ చిరునవ్వు చూస్తుంటా. నా జీవితంలో భాగమైనందుకు ధన్యవాదాలు

అనుష్క: నాలో భాగమైనందుకు మీకు థాంక్స్‌.

ఒక్కసారైనా మీ పాత్రకు మీరు డబ్బింగ్‌ చెప్పండి. ఇది మీ అభిమానుల కోరిక. మీ స్వరం బాగుంటుంది.

అనుష్క:భవిష్యత్తులో కచ్చితంగా చెప్తాను.

విభిన్న పాత్రలు పోషించడానికి భాష అడ్డంకి అని భావిస్తున్నారా?

అనుష్క:కొత్త భాషలు నేర్చుకోవడం నాకు ఇష్టం. భాష నేర్చుకుని.. నటించేందుకు ఆసక్తి చూపుతుంటా.

ABOUT THE AUTHOR

...view details