తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ ప్రత్యేకతే 'నిశ్శబ్దం'లో నటించేలా చేసింది'

స్టార్​ హీరోయిన్​ అనుష్క విభిన్న పాత్రలో నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. అక్టోబరు 2న అమెజాన్​ ప్రైమ్​లో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా​ ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి అనుష్క చెప్పిన విశేషాలేంటో చూద్దాం.

anushka shetty
అనుష్క

By

Published : Sep 29, 2020, 10:08 PM IST

కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలంటే అందరికీ గుర్తొచ్చేది టాలీవుడ్​ స్వీటి అనుష్క. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. ఇటీవలే 'భాగమతి'తో అందర్నీ అలరించిన స్వీటి.. ఇప్పుడు మరో సస్పెన్స్ థ్రిల్లర్​ 'నిశ్శబ్దం'తో మన ముందుకు రాబోతోంది. ప్రస్తుతం థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడం వల్ల అమెజాన్‌ ప్రైమ్​ వేదికగా అక్టోబరు 2న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్​ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సందర్భంగా ఈటీవీ భారత్​తో 'నిశ్శబ్దం' గురించి అనుష్క చెప్పిన ఆసక్తికర విశేషాలు మీకోసం.

నిశ్శబ్దం పోస్టర్​

విరామం తీసుకోవాలనుకున్నా..

'భాగ‌మ‌తి' త‌రువాత కావాల‌ని విరామం తీసుకున్నా. కొద్ది రోజులు సినిమాలు చేయొద్దనుకున్నా. ఆ స‌మయంలో రచయిత కోనా వెంక‌ట్, డైరెక్టర్ హేమంత్ 'నిశ్శబ్దం' కథ చెప్పారు. అందులో సాక్షి పాత్ర భిన్నంగా ఉండటం వల్ల వ‌ర్క్అవుట్ అవుతుంద‌ని బ‌లంగా అనిపించింది. అందుకే 'నిశ్శబ్దం'లో న‌టించ‌డానికి ఒప్పుకున్నా. అనుకోకుండా నా ద‌గ్గరకు వచ్చిన ఈ కథ బాగా నచ్చేసింది.

14 ఏళ్ల అమ్మాయి నాకు సైన్ లాంగ్వేజ్ నేర్పించింది..

ఈ చిత్రంలో నా పాత్రకు వినపడదు, మాట్లాడలేదని డైరెక్టర్ హేమంత్ ముందుగానే చెప్పారు. ఆ ప్రత్యేకతే నన్ను ఈ సినిమాలోకి తీసుకొచ్చింది. కొన్ని రోజులు ఇండియ‌న్ సైన్ లాగ్వెంజ్ నేర్చుకున్నా. అయితే ఆ త‌రువాత షూటింగ్​కి అమెరికా వెళ్లాక అక్కడ సైన్ లాంగ్వేజ్ వేరుగా ఉంది. ఇంట‌ర్నేష‌న‌ల్​గా అంద‌రూ ఎక్కువుగా వాడే సైన్ లాంగ్వేజ్ కూడా అదే కావ‌డం వల్ల, మ‌ళ్లీ అమెరికాలో ఓ 14 ఏళ్ల అమ్మాయి ద‌గ్గర ఇంట‌ర్నేష‌న‌ల్ సైన్ లాంగ్వేజ్​లో ట్రైనింగ్ తీసుకుని నిశ్శబ్దంలో న‌టించాను.

అనుష్క

ఓటీటీలో విడుదల కొత్తగా ఉంది

ఓటీటీ, థియేట‌ర్ రెండూ వేరువేరుగా ఉన్నప్పటికీ ఓటీటీలో సినిమాల విడుద‌లను పాజిటివ్​గా తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చిత్ర పరిశ్రమ ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లాలంటే.. టెక్నాల‌జీ ప‌రంగా ప్రేక్షకులకు వినోదం ఇవ్వడంలో ఇలాంటి మార్పులు రావ‌డం అవ‌సరం. వాటిని అందరూ స్వాగతించారు. తొలిసారిగా నేను న‌టించిన పెద్ద సినిమా ఇలా విడుద‌ల కావడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనుకుంటున్నా.

నిశ్శబ్దంలో అనుష్క

ఫార్వర్డ్ చేయకుండా చూస్తేనే మజా

మాధ‌వ‌న్​తో నా కెరీర్ తొలినాళ్లలో 'రెండు' అనే సినిమాలో క‌లిసి న‌టించా. మ‌ళ్లీ 14 ఏళ్ల త‌రువాత క‌లిసి న‌టించ‌డం చాలా అద్భుతంగా అనిపించింది. మా ఇద్దరికి ఈ సినిమాలో ఛాలెంజింగ్ రోల్స్ ఇచ్చారు. ఈ కథ కేవలం మా ఇద్దరి చుట్టూనే తిరగదు. స్క్రీన్ ప్లే ముందుకు సాగాలంటే మిగతా పాత్రలు కూడా కీలకంగా మారుతుంటాయి. ఈ థ్రిల్లింగ్ రైడ్​ని ప్రేక్షకులు ఖచ్చితంగా ఆస్వాదిస్తారు. అయితే ఎక్కడా ఫార్వర్డ్ చేయకుండా సినిమా మొత్తం చూస్తేనే ఆ ఫీల్ దొరుకుతుంది.

ఓటీటీలో విడుదలైతే.. ప్రాబ్లమ్​ అదొక్కటే

ఓటీటీలో విడుద‌ల అవడంలో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. థియేట‌ర్స్​లో ఉండే సౌండ్ సిస్టమ్, ఆడియో క్వాలిటీని ఓటీటీలో ప్రేక్షకులు మిస్ అవుతారు. హెడ్ ఫోన్స్, హోమ్ థియేట‌ర్స్​తో ఈ లోటును క‌వ‌ర్ చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ చాలా కీలకం. ముఖ్యంగా గోపీ సుంద‌ర్ ఇచ్చిన పాటలు, గిరీష్ గోపాలకృష్ణ ఇచ్చిన రీరికార్డింగ్ సినిమాకు ఎంతో కీలకం.

అనుష్క

ఈ ఏడాది కెమెరా ముందుకు రావట్లేదు

లాక్ డౌన్ వల్ల ఇంట్లోనే ఉండిపోయా. కుటుంబంతో గడిపా. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా. వెబ్ సిరీస్​లు, సినిమాలు చూశా. ఈ గ్యాప్​లో కొన్ని కొత్త కథలు విన్నా. వాటిలో కొన్ని నచ్చాయి. ప్రస్తుతం ఉన్న సినిమాలు పూర్తయ్యాకే వాటి గురించి ఆలోచిస్తా. కానీ ఈ ఏడాది ఏ సినిమాలు చేయడం లేదు. 2021లో మళ్లీ కెమెరా ముందుకు వస్తా.

ప్రభాస్ సినిమాలో లేను..

ప్రభాస్ నటిస్తున్న 'ఆదిపురుష్' సినిమా కోసం నన్నెవరూ సంప్రదించలేదు. ఆ సినిమాలో నేను చేయడం లేదు.

ఒత్తిడికి కారణం వేరు..

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అయినా మరే చిత్రమైనా ఒత్తిడి, బాధ్యత ఒకరి భుజాలపైనే ఉండదు. సినిమా అన్నది సమష్టి కృషి. సినిమా విడుదలకు ముందు నాకు కాస్త ఒత్తిడి అనిపించినా దానికి కారణం వేరు. నా పాత్రను ఎలా స్వీకరిస్తారు. నా ప్రయత్నం వాళ్లను మెప్పిస్తుందా లేదా అనే ఆలోచన ఉంటుంది.

నిర్మాతలు చేసింది సాహసమనే చెప్పాలి

ద‌ర్శకుడు హేమంత్ చాలా క్లారిటీతో పనిచేసుకుంటూ వెళ్తారు. తనకు ఏం కావాలో నటీనటుల నుంచి తీసుకోవడం హేమంత్​లో బాగా నచ్చింది. ఆయన దర్శకత్వంలో 'నిశ్శబ్దం' బాగా వచ్చింది. కోనా ఫిల్మ్ కార్పోరేష‌న్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని అమెరికా బ్యాక్ డ్రాప్​లో ఎక్కడా వెనుకాడకుండా నిర్మించారు. చాలా ధైర్యంగా చేశారు.

ABOUT THE AUTHOR

...view details