తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'భారతీయ చిత్రాలంటే పాటలు ఉండాల్సిందే'

హీరో కార్తికేయ నటిస్తోన్న 90 ఎం.ఎల్ సినిమా డిసెంబరు 5న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చిన అనూప్​ తన మనసులో మాటలను వెల్లబుచ్చాడు.

anup rubens latest interview at hyderabad
'భారతీయ చిత్రాలంటే పాటలు ఉండాల్సిందే'

By

Published : Nov 30, 2019, 6:31 PM IST

సరికొత్త స్వరాలు పలికిస్తూ సంగీత ప్రియులను తన వైపు తిప్పుకుంటున్నాడు యువ సంగీత దర్శకుడు అనూప్​ రూబెన్స్​. ఏదైనా చక్కటి పాటని స్ఫూర్తిగా తీసుకొని మనదైన శైలిలో కొత్త స్వరాన్ని సిద్ధం చేసుకోవడం తప్పే కాదంటున్నాడు. తాజాగా 90 ఎం.ఎల్​ చిత్రానికి సంగీతం అందించాడు అనూప్. ఈ సందర్భంగా హైదరాబాద్​లో ఓ మీడియా సమావేశంలో ముచ్చటించాడు.

తాగకుండానే కిక్ ఎక్కుతుంది

నేను ఆల్కహాల్‌ ముట్టను. కానీ, దర్శకుడు కథ చెప్పినప్పుడే 90 ఎం.ఎల్‌ తాగినంత కిక్‌ వచ్చేసింది. కొత్తదనంతో నిండిన కథ ఇది. శేఖర్‌ ఎంత చక్కగా కథ చెప్పాడో అంతకంటే బాగా వాణిజ్యాంశాలు మేళవించి తెరకెక్కించాడు. ఈ చిత్రం కోసం పూర్తిగా మాస్‌ బీట్స్‌నే సిద్ధం చేశా. గతంలో నేను కొన్ని మాస్‌ పాటలు చేశా. కానీ, పూర్తిస్థాయిలో మాస్‌ స్వరాలు సమకూర్చింది ఈ చిత్రానికే. మొత్తం ఆరు పాటలతో పాటు ఓ బిట్‌ సాంగ్​ ఉంటుంది. ఈ పాటలకు కార్తికేయ వేసిన స్టెప్పులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ చిత్రంతో ఆయన్ని సరికొత్తగా చూస్తారు.

అనూప్ రుబెన్స్​

పనిలో సంతృప్తి పొందాలనుకుంటా

స్టార్‌ కథానాయకుడితో పని చేస్తున్నప్పుడు ఆయన ఇమేజ్‌ను కథను దృష్టిలో పెట్టుకొని సిద్ధం చేస్తుంటా. మామూలు హీరోతో చేస్తున్నప్పుడు కథకు తగ్గట్లుగా స్వరాలు సిద్ధం చేసుకుంటా. నేనెప్పుడూ సినిమా చిన్నదా..పెద్దదా అని పట్టించుకోను. నేను చేసే పనికి మనస్ఫూర్తిగా సంతృప్తి పొందాలనే చూస్తుంటా. ఒక్కోసారి మనం ఇచ్చే సంగీతం పెద్ద హిట్‌ అయినా సినిమాకు ఆదరణ దక్కకపోతే మన శ్రమ వృథా అవుతుంటుంది. అలాంటప్పుడు కాస్త బాధగా ఉంటుంది. కానీ, తప్పదు సమష్టి కృషికి ఫలితం దక్కినప్పుడే సరైన విజయం అందుకున్నట్లు.

నేను మెలోడీ మాత్రమే చేయగలను అనుకుంటారు

స్వతహాగా పెప్స్, మాస్‌బీట్లు అంటే నాకు చాలా ఇష్టం. కానీ నాకు మెలోడీ గీతాలతో ఎక్కువ హిట్లు పడటం వల్ల మాస్‌ చిత్రాలకు పని చేసే అవకాశం పెద్దగా దక్కలేదు అనుకుంటా. ఇటీవల నేను చేయాలనుకున్న కొన్ని పెద్ద ప్రాజెక్టులు చేజారి కాస్త విరామం తీసుకుంటున్నానని కొంత మంది అనుకుంటున్నారు. ఎప్పుడేం జరుగుతుందో మన చేతుల్లో లేదు. ఇదీ అంతే. ఈ విషయంలో నేనెప్పుడూ బాధ పడలేదు. నవతరం సంగీత దర్శకుల పాటలు విని స్ఫూర్తి పొందుతుంటా.

అనూప్ రుబెన్స్​

ఖైదీ సినిమాతో సంగీత దర్శకులకు దెబ్బే?

ఇటీవల కాలంలో సినీప్రియుల్లో సంగీతం పట్ల అభిరుచి పెరుగుతోంది. ఇదే సమయంలో కొత్తదనంతో నిండిన సంగీతమూ వస్తోంది. చాలా మంది పాటలు నచ్చి థియేటర్లకొచ్చి సినిమాలు చూస్తున్నారు. 'ఖైదీ' వంటి చిత్రాల్ని చూసినప్పుడు భవిష్యత్తులో పాటల్లేని సినిమాలొస్తే సంగీత దర్శకులకు పెద్ద దెబ్బే కదా అని అడుగుతుంటారు. అందులో ఏ మాత్రం వాస్తవం లేదు. పాటలు లేకపోయినా నేపథ్య సంగీతానికి ప్రాధాన్యం ఉంటుంది. అది కూడా సంగీత దర్శకుడి పనే కదా. అయినా భారతీయ తెరపై నుంచి పాటెప్పుడూ కనుమరుగు కాదు. భారతీయ సినిమాలంటే పాటలుండాల్సిందే అని షారుఖ్‌ ఖానే చెప్పారు. అది మన ప్రేక్షకుల్లో ముద్రించుకుపోయిన స్టాంప్‌. ప్రస్తుతం రాజ్‌తరుణ్‌ 'ఒరేయ్‌ బుజ్జి' చిత్రంతో పాటు ఓ కన్నడ సినిమాకు స్వరాలందిస్తున్నా.

'ఇష్క్‌', 'గుండె జారి గల్లంతయ్యిందే', 'మనం' వంటి చిత్రాలతో సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు అనూప్​. ఇప్పుడు '90 ఎం.ఎల్‌' చిత్రానికి స్వరాలు సమకూర్చాడు. ఇందులో కార్తికేయ కథానాయకుడు. శేఖర్​ రెడ్డి ఎర్రా దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబరు 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. 'క్షీరసాగర మథనం' విలన్​ను పరిచయం చేసిన అడవి శేషు

ABOUT THE AUTHOR

...view details