"ఒక పాట ప్రేక్షకుల్ని థియేటర్ వరకు తీసుకొస్తోందంటే అంతకంటే ఆనందం ఏముంటుంది? ఒక సంగీత దర్శకుడిగా ఆ విషయంలో చాలా సంతోషిస్తాను. పాటలవల్లే కొన్ని చిన్న సినిమాలకు స్టార్ కథానాయకుల చిత్రాల స్థాయిలో ప్రారంభ వసూళ్లు వచ్చాయి" అని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అన్నారు. ఆయన ఇటీవల 'మంచి రోజులు వచ్చాయి' సినిమాకు స్వరాలు సమకూర్చారు. మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గురువారం అనూప్ హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. ఆ విషయాలివీ..
*మారుతి సినిమాలంటే నాకు ఇష్టం. ఆయన కథలు సానుకూల ధృక్పథంతో సాగుతాయి. చిన్న సందేశంతోపాటు, మంచి వినోదం ఉంటుంది. ఆయనతో పనిచేయాలని చాలా రోజుల నుంచి ఉండేది. అనుకోకుండా లాక్‌డౌన్ సమయంలో ఆయన్నుంచే ఫోన్ కాల్ వచ్చింది. చిన్న సినిమా చేయాలనుకుంటున్నా అని చెప్పారు. లాక్‌డౌన్ తొలగించిన మరుసటి రోజు నుంచే చిత్రీకరణకు వెళతామని చెప్పారు. కథ వినిపించగానే కచ్చితంగా చేద్దామని చెప్పా. ఇంటి నుంచే పనిచేశా. ఫోన్‌లోనే పాటలన్నీ పంపా. రెండు మూడువారాల్లోనే పాటలన్నీ సిద్ధమయ్యాయి. లాక్‌డౌన్ తొలగించిన మరుసటి రోజు నుంచే ప్రారంభించి, 30 రోజుల్లోనే సినిమా పూర్తి చేశారు.