ఇప్పటికే ఎన్నో థ్రిల్లర్ సినిమాల్ని అందించిన ప్రముఖ ఓటీటీ 'ఆహా' ఆద్యంతం ఉత్కంఠ పెంచే మరో చిత్రాన్ని విడుదల చేయనుంది. ఫహద్ ఫాజిల్, సాయి పల్లవి జంటగా నటించిన మలయాళ చిత్రం 'అతిరన్'ను తెలుగులో 'అనుకోని అతిథి' పేరుతో అందుబాటులోకి తీసుకురానుంది. మే 28 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఇందులోని ప్రతి సన్నివేశం ఉత్కంఠ పెంచుతోంది. ఓ బంగ్లా నేపథ్యంలో వచ్చే.. 'బయట వాళ్లకు ఇక్కడ ఏం పని? ఇక్కడ ఎవర్నీ నమ్మకూడదు' అనే సంభాషణలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సాయి పల్లవి నటన ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తోంది. జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలుస్తోంది. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో వివేక్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు.
హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధానపాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'ముగ్గురు మొనగాళ్లు'. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను మంగళవారం చిత్రబృందం విడుదల చేసింది. కళ్లు కనిపించని, చెవులు వినిపించని, మాట్లాడలేని ముగ్గురు వ్యక్తుల కథ ఇది. శ్రీనివాస్, దీక్షిత్, రామారావు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నవ్వులు పూయిస్తున్నారు.