తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఓ స్నేహం.. కారు డ్రైవర్‌ను కోటీశ్వరుణ్ణి చేసింది!

మలయాళ ప్రముఖ నిర్మాత ఆంటనీ పెరుంబావూరు.. ప్రస్తుతం పలు భారీ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన గతంలో మోహన్​లాల్ దగ్గర కారు డ్రైవర్​గా చేశారని మీకు తెలుసా? ఇంతకీ ఆంటనీ కథేంటి?

antony perumbavoor mohanlal friendship story
ఓ స్నేహం.. కారు డ్రైవర్‌ను కోటీశ్వరుణ్ణి చేసింది!

By

Published : Mar 7, 2021, 8:40 AM IST

ఇదో అభిమాని కథ. ఆ అభిమానిని స్నేహితుడిగా మార్చుకుని నిర్మాతగా మలచిన మనసున్న మంచి నటుడి కథ కూడా! ఆ నటుడు మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ అయితే... నిర్మాతగా మారిన ఆ అభిమాని పేరు ఆంటనీ పెరుంబావూరు. మోహన్‌లాల్‌ దగ్గర కారుడ్రైవర్‌గా చేరిన ఆంటనీ.. తాను అంచెలంచెలుగా ఎదగడమే కాదు... మలయాళ సినిమా సక్సెస్‌ గ్రాఫ్‌నూ అమాంతం పెంచేశారు. ఈ వింత స్నేహగాథ ఏంటంటే...

పెరుంబావూరు... కేరళ వాణిజ్య రాజధాని కొచ్చి పరిసరాల్లో ఉన్న ఓ చిన్న టౌను. అక్కడో కలప మిల్లులో పని చేస్తుండేవాడు ఆంటనీ వాళ్ల నాన్న. ఆంటనీ ఇంటర్‌దాకా చదువుకుని ఆ తర్వాత డ్రైవర్‌ అయ్యాడు. పద్దెనిమిదేళ్ల వయసులో స్నేహితుల దగ్గర అప్పుచేసి జీపు కొని నడుపుతుండేవాడు. ఓసారి వాళ్ళూరి దగ్గర్లో షూటింగ్‌ జరుగుతుంటే... అక్కడ వాహనాల కాంట్రాక్టరు ఒకాయన ఆంటనీ జీపును అడిగాడట. ఆ షూటింగ్‌కు వెళ్లి నప్పుడు సాజన్‌ అనే నిర్మాత పరిచయమయ్యారు. ఆయన ‘పట్టణ ప్రవేశం’ సినిమా తీస్తూ షూటింగ్‌ జరిగినంత కాలం తన కారు నడిపే బాధ్యతను ఆంటనీకి అప్పగించారు. ‘పట్టణ ప్రవేశం’ సినిమా హీరో మోహన్‌లాల్‌. ‘ఓ రోజు నిర్మాత నన్ను పిలిచి ‘హీరోగారి ఇంటికెళ్లి ఆయన్ని సెట్‌కు తీసుకురా!’ అన్నాడు. ఆలస్యం చేస్తే ఆయన మనసు మారి ఇంకెవర్నైనా పంపిస్తాడనే భయంతో... కారు తీసుకుని ఆగమేఘాల మీద మోహన్‌లాల్‌ ఇంటికి వెళ్లాను. లాల్‌ కారెక్కారు. ఆయనపైన ఎంత అభిమానం ఉన్నా సరే... దారిలో నేను ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. పన్నెత్తి మాట్లాడలేదు. షూటింగ్‌ స్పాట్‌కు చేరగానే దిగి ఆయన డోర్‌ తీద్దామని వెళ్లానుకానీ... ఆయన తానే తీసుకుని చకచకా వెళ్లిపోయారు. చివరి రోజూ ఆయన్ని ఇంట్లో దింపే అవకాశం నాకే వచ్చింది. ఇంటి దగ్గర దిగాక ‘ఆంటనీ తిన్నావా... మా ఇంట్లో భోజనం చేస్తావా?’ అన్నారు. ఎప్పుడూ మౌనంగా ఉండే ఆయన నోట నా పేరు వినడంతోనే కడుపునిండిపోయింది నాకు... ఇంకేం తింటాను! ‘షూటింగ్‌లో తింటాను సార్‌!’ అని వచ్చేశాను.

ఆ సినిమా షూటింగ్‌ పూర్తయ్యాక... మా ఊరెళ్లిపోయాను. నేను మోహన్‌లాల్‌కు కారు నడిపానంటే ఫ్రెండ్సెవ్వరూ నమ్మలేదు. వాళ్ల కోసమైనా మోహన్‌లాల్‌తో ఓసారి మాట్లాడి చూపించాలనుకున్నాను. ఆ సందర్భం కోసం వేచి చూస్తూ ఉండగానే... మా ఊరికి కాస్త దూరంలో ఆయన కొత్త సినిమా షూటింగ్‌ జరుగుతుంటే ఫ్రెండ్స్‌ను తీసుకెళ్లాను. కానీ... షూటింగ్‌ స్పాట్‌ చుట్టూ కంచెకట్టి... మాలాంటి జనాలనెవ్వరినీ లోపలికి అనుమతించలేదు. దాంతో బయటే నిల్చుండిపోయాను. ఈలోపు నా ఫ్రెండ్స్‌ నన్ను ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. మధ్యాహ్నం తర్వాత- అంతమంది జనాల్లో నన్నెలా గుర్తుపట్టారో తెలియదుకానీ ‘ఆంటనీ, ఇలా రా’ అన్నారు లాల్‌...! ఒక్క ఉదుటన కంచె దూకి పరుగెత్తాను. నేను వెళ్లగానే ఓ పాత స్నేహితుణ్ణి చూసినట్టు దగ్గరకు తీసుకుని ‘నాకు పర్సనల్‌ డ్రైవర్‌ కావాలి... చేరతావా!’ అన్నారు. అంతకంటే ఏం కావాలి... చేరిపోయాను!’ అని గుర్తుచేసుకుంటారు ఆంటనీ.

మొదటి రోజు నుంచే ఆంటనీని లాల్‌ తన ఇంట్లోనే ఉండిపొమ్మన్నాడు. అలా మొదలైన వాళ్ల అనుబంధం యజమాని- పనిమనిషి అనే పరిధి దాటి స్నేహంగా మారింది. కొన్నాళ్లు గడిచాక ఆంటనీకి మేనేజర్‌ హోదానిచ్చాడు మోహన్‌లాల్‌. అక్కడితో ఆగలేదు...

దృశ్యం 2 మూవీ

ఆ చిత్రాలు అతనివే...

1999లో ఓ రోజు మోహన్‌లాల్‌ హీరోగా ‘నరసింహం’ సినిమా కథాచర్చలు జరుగుతున్నాయి. అక్కడే ఉన్న ఆంటనీతో లాల్‌ చటుక్కున ‘నువ్వు ఈ సినిమాకి నిర్మాతగా ఉండరాదూ!’ అన్నాడట. ఆయనేం చెప్పినా కాదనని ఆంటనీ సరే అన్నాడు. స్నేహితుడి కోసం లాల్‌ పారితోషికం వద్దనేశాడు. మరి మిగతా డబ్బుకు ఏం చేయాలి... అప్పటిదాకా తన సంపాదనతో కొనుక్కున్న భూములన్నీ అమ్మేసి, దొరికినంత అప్పుచేసీ షూటింగ్‌ మొదలుపెట్టాడు ఆంటనీ. ఓ దశలో డబ్బు సరిపోక ఆరునెలలపాటు షూటింగ్‌ కూడా ఆపేయాల్సి వచ్చింది. అష్టకష్టాలుపడి ఎలాగైతేనేం సినిమాను విడుదలచేయగలిగాడు. అది... అప్పటిదాకా ఉన్న వసూళ్ల రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఆ లాభాలనేమీ దాచుకోలేదు ఆంటనీ... మళ్లీ మోహన్‌లాల్‌తోనే వరసగా సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. అలా గత రెండు దశాబ్దాలలో 30 సినిమాలు తీశాడు. వాటిల్లో దృశ్యం(తాజాగా దృశ్యం-2 కూడా), లూసిఫర్‌ వంటి చిత్రాలు మలయాళ సినిమాను వంద కోట్ల క్లబ్‌లోకి తీసుకెళ్లాయి.

అంతేకాదు, మలయాళ సినిమాలో తొలిసారి వందకోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న 'మరక్కార్‌: అరేబియా సముద్ర సింహం' సినిమాను నిర్మిస్తున్నది కూడా ఆంటనీయే!

‘నేను గుంపుల్లో ఒకడిగా నిల్చున్నప్పుడు నన్ను గుర్తుపట్టి మోహన్‌లాల్‌ పిలిచారు చూడండి... అది నేను ప్రార్థించే జీసస్‌ పిలుపే అనుకుంటాను’ అంటాడు ఆంటనీ ఏ వేదికనెక్కినా. ‘అదేంకాదు... నేను కొలిచే కృష్ణుడే ఆ రోజు నాకోసం అతణ్ణి అక్కడికి పంపించాడు!’ అంటుంటారు మోహన్‌లాల్‌. ఏదేమైనా కేరళలో మతాలూ, వర్గాలకి అతీతమైన అనుబంధానికి ఉదాహరణగా నిలిచిపోయింది ఈ ఇద్దరి స్నేహం!

ABOUT THE AUTHOR

...view details