యాంటీ హీరోలు.. హీరోలు తెలుసు.. విలన్లూ తెలుసు ఈ యాంటీ హీరోలు ఏంటి అనుకుంటున్నారా! మన సినిమాల్లో అందరికి మంచి చేసేవాడు కథానాయకుడు.. చెడు చేసేవాడు ప్రతినాయకుడు. ఆ రెండింటి సమాహారమే ఈ యాంటీ హీరో క్యారెక్టర్. ఒక్కమాటలో చెప్పాలంటే విలనిజంలో హీరోయిజం చూపించే పాత్ర. జై లవకుశలో జూనియర్ ఎన్టీఆర్, గద్దలకొండ గణేశ్‌లో వరుణ్‌తేజ్ పాత్రలు ఇలాంటివే.
తను ఎంచుకున్న మార్గమే సరైనది అనుకుంటూ సినిమా అంతా ప్రభావం చూపేది యాంటీ హీరో క్యారెక్టర్.. హాలీవుడ్లో ఎప్పటినుంచో పాపులర్ అయిన ఈ పాత్రలు తెలుగులో ఇప్పుడిప్పుడే ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. మరి విలనిజంలోనూ హీరోయిజం చూపిస్తున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం!
గజ గజ వణికించిన గణేశ్..
హరీశ్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నటించిన చిత్రం గద్దలకొండ గణేశ్. ఇందులో వరుణ్ నెగిటీవ్ పాత్రలో కనిపించి.. చివరికి మంచివాడుగా మారే ప్రతినాయకుడి పాత్ర చేశాడు. తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. సెప్టెంబరు 18న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంది. మొదటి నుంచి విభిన్న పాత్రలవైపు మొగ్గు చూపిస్తున్న వరుణ్ తేజ్.. మొదటి సారి పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాలో నటించి మెప్పించాడు.
ఇస్మార్ట్ శంకర్‌లో రామ్..
పూరీజగన్నాథ్ - రామ్ కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో కథానాయకుడి పాత్ర ఈ కోవలోకే వస్తుంది. తప్పో, ఒప్పో తను చేసేదే కరెక్టు అనుకుంటాడు హీరో. నమ్మిన వ్యక్తి కోసం ఒకరిని చంపి చిక్కుల్లో పడతాడు. అతడు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు అనేది చిత్ర కథాంశం. ఎప్పటి నుంచో విజయం కోసం ఎదురు చూస్తున్న పూరీకి ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. రూ. 80 కోట్లకు పైగా కలెక్షన్లతో రామ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.