రాజమహేంద్రవరంలో ఓ స్టోర్ ప్రారంభోత్సవానికి వచ్చిన అభిమానులకు ప్రముఖ యాంకర్, నటి రష్మి క్షమాపణలు చెప్పింది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రాజమహేంద్రవరంలో స్టోర్‌ను ఆరంభించబోతున్నామని ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఫలితంగా నెటిజన్లు తనపై ప్రశ్నల వర్షం కురిపించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో పబ్లిక్ కార్యక్రమాలు ఏంటని, ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందని.. రకరకాల కామెంట్లు చేశారు.
శుక్రవారం ఉదయం రష్మి స్టోర్‌ను ప్రారంభించింది. ఆమెను చూసేందుకు వందల సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఫలితంగా పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేయాల్సి వచ్చింది. అయితే కార్యక్రమం అనంతరం రష్మి ట్విట్టర్ లైవ్‌లో మాట్లాడింది. తన వల్ల ఇబ్బందిపడిన వారికి క్షమాపణలు చెప్పింది. ప్రజలు అధిక సంఖ్యలో రావాలి అనుకోలేదని, కరోనా నేపథ్యంలో ఎవరూ రారు అనుకున్నామని చెప్పింది.
ప్రముఖ యాంకర్, నటి రష్మి ఈ సందర్భంగా ఓ నెటిజన్ "అందరూ షాపింగ్స్ చేయడం కూడా మానేస్తే.. మీరెందుకు స్టోర్‌ను ప్రారంభించారు?" అని అడిగాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. "మన దేశంలో ప్రజలు దేన్నీ సీరియస్‌గా తీసుకోరు. నిబంధనలు విధించినా.. జరిమానా కట్టేద్దాంలే అనుకుంటారే కానీ, జాగ్రత్తలు తీసుకోవాలనుకోరు. ఇప్పుడు కూడా ఈ వేడికి కరోనా వైరస్ బతకదు, ఎంతో కలుషితంగా ఉన్న ఆహారం తింటున్నాం అదే ఏం చేయలేదు, ఇదేం చేస్తుందిలే.. మనకేం కాదు..’ ఇలా అనుకుంటున్నారు. జోక్‌గా తీసుకుని టిక్‌టాక్‌లు చేస్తున్నారు. మన వారికి అవగాహన చాలా తక్కువ. ఒంటరిగా ఉంటామని చెప్పి.. బయటికెళ్లి తిరుగుతున్నారు. ఉద్యోగుల్లో కొంత మంది ఇంకా ఆఫీసులకు వెళ్తున్నారు. కొంత మందికి మాత్రం ఇంట్లో ఉండే అవకాశం దొరికింది. పరిస్థితుల్ని అర్థంచేసుకుని వెళ్లాలి. నేను స్టోర్ యాజమాన్యంతో ఎన్నో రోజుల క్రితం ఒప్పందం కుదుర్చుకున్నా. షాపు ఓపెనింగ్‌కు కూడా అనుమతి దొరికింది. అందుకే నేను కాదనలేకపోయా. అన్నీ జాగ్రత్తలు తీసుకునే ఈ పనిచేశాం. ప్రజలు కార్యక్రమానికి రాకపోయినా ఫర్వాలేదు అనుకున్నాం. కానీ వందల్లో వచ్చారు, కరోనాపై ఎవరికీ అవగాహన లేదు. అందుకే పోలీసులు వచ్చిన వారిని అక్కడి నుంచి పంపేశారు. ఎవరైనా ఇబ్బంది పడుంటే క్షమించండి. జాగ్రత్తగా ఉండండి" అంటూ చెప్పుకొచ్చింది రష్మి.
ఇదీ చూడండి : 'ధాకడ్' కోసం కసరత్తులు చేస్తోన్న కంగనా