తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అందుకే నా లవ్​స్టోరీ ఎవరికీ చెప్పను: అనసూయ

'జబర్దస్త్' యాంకర్​గా, నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్.. 37వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె గురించిన ఆసక్తిర విషయాలు మీకోసం.

Anasuya Bharadwaj birthday special
అనసూయ

By

Published : May 15, 2021, 5:31 AM IST

ఓవైపు టీవీ యాంకర్​గా అలరిస్తున్న అనసూయ భరద్వాజ్.. మరోవైపు 'పుష్ప' లాంటి భారీ బడ్జెట్​ సినిమాలోనూ నటిస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ భామ.. సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. అయితే శనివారం(మే 15) ఆమె పుట్టినరోజు సందర్భంగా గతంలో ఆమె, తన గురించి చెప్పిన సంగతులు మీకోసం.

మీ అసలు పేరు పవిత్రా?

అనసూయ: అమ్మ నా పేరు పవిత్ర అని పెడదామనుకున్నారట. నాన్న కుటుంబం నుంచి చూస్తే నేనే మొదటి ఆడపిల్లను. దీంతో వాళ్లమ్మ పుట్టిందనుకుని ఆ పేరు పెట్టారు. అలా నా పేరు అనసూయ అయింది.

అనసూయ భరద్వాజ్

అనసూయ పేరు కలిసొచ్చిందా? పవిత్ర పెడతే బాగుంటుందని ఎప్పుడైనా అనుకున్నారా?

అనసూయ: చాలాసార్లు అనుకున్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి స్కూల్లో చాలా మంది కావాలని గట్టిగా 'అనసూయ...' అంటూ పిలిచేవారు. అప్పటి నుంచి ఎవరైనా 'అను' అని పిలిస్తేనే పలికేదాన్ని. ఎన్‌సీసీలో చేరిన తర్వాత 'అనసూయ' పేరు వెనుక ఉన్న కథ తెలిసి సిగ్గుపడ్డా. ఆ తర్వాత ఎవరు ఎలా పిలిచినా పట్టించుకునేదానిని కాదు.

టీవీ ఇండస్ట్రీకి రాకముందు అనసూయ ఎవరు? ఏ ఊరు? ఏం చదువుకున్నావు?

అనసూయ: నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్‌. హెచ్‌ఆర్‌ మేజర్‌ తీసుకున్నా. ఒక విజువల్‌ ఎఫెక్ట్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా కూడా చేశా. అంతకన్నా ముందు బ్యాంకులో టెలికాలర్‌గా చేశా. రూ.5వేలు జీతం.

మీ ఆయన భరద్వాజ్‌ పరిచయం ఎలా?

అనసూయ: శశాంక్‌ భరద్వాజ్‌ను ఎన్‌సీసీలో కలిశా. అదొక పెద్ద స్టోరీలెండి. ఎవరికైనా చెబితే, 'ఎన్‌సీసీలో ట్రైనింగ్‌కు వెళ్లకుండా లవ్‌ ట్రైనింగ్‌ తీసుకున్నారా' అని అంటారని ఎవరికీ చెప్పను.

భర్తతో అనసూయ

మీ లవ్‌స్టోరీ ఇంట్లో తెలిసి తొలుత ఒప్పుకోలేదట!

అనసూయ: అవునండీ. సుశాంక్‌ కూడా 'పెళ్లి చేసుకుందామా?' అని అన్నాడు. వెంటనే ఈ విషయాన్ని అమ్మకు చెప్పా. వాళ్లు ఒప్పుకోలేదు. 'వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం' అని నేను అంటే, 'మన కుటుంబాల్లో గౌరవం ఉండదు' అని సుశాంక్‌ భరద్వాజ్‌ ఆపారు. 9 సంవత్సరాల తర్వాత ఒప్పుకొన్నారు. పెళ్లి కూడా అయిష్టంగానే జరిగింది. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత అందరం ఒక్కటయ్యాం.

టెలివిజన్‌ రంగానికి రావాలని ఎందుకు అనిపించింది?

అనసూయ: స్కూల్లో ఉన్నప్పుడు నేను ఎత్తుగా ఉండటంతో ‘నువ్వు మోడల్‌ అవ్వొచ్చు కదా’ అనేవారు. పిక్సలాయిడ్‌ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నప్పుడు చాలా మంది దర్శకులు వచ్చేవారు. వారిలో సుకుమార్‌గారు కూడా ఉన్నారు. అప్పట్లోనే 'ఆర్య' కోసం అడిగారు. ప్రతి తెలుగు ఇంట్లో సినిమా ఇండస్ట్రీ అంటే ఓ భయం ఉంటుంది. నాకు కూడా ఉండేదేమో. పైగా నాకు అప్పటికే నిశ్చితార్థం అయిపోయింది. చాలా సినిమా ఆఫర్లు వచ్చినా కూడా 'వద్దు' అని చెప్పేదాన్ని. చివరకు ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత న్యూస్‌ రీడర్‌గా చేరాను.

సోషల్‌ మీడియాలో మీ మీద ట్రోలింగ్‌ జరుగుతూనే ఉంటుంది?

అనసూయ: 'అత్తారింటికి దారేది' సినిమా వచ్చినప్పటి నుంచి ఈ ట్రోలింగ్‌ మొదలైంది. అప్పుడు ట్విటర్‌కు కొత్త. 'ఆ పాటలో నేను లేను. గుంపులో గోవిందంలా లేకపోవడం మంచిది అయింది' అని ట్వీట్‌ చేశా. అంతే, ట్రోలింగ్‌ మొదలైంది. ఒక ఆర్టిస్ట్‌గా ఫోకస్‌ మొత్తం మనపై ఉండాలనుకోవడం తప్పు కాదు కదా! నేను ఒక్కదాన్ని అయితే చేసేదాన్నేమో. పైగా నేను ఆరునెలల గర్భవతిని. బహుశా ఆ పాట చేయకపోవడానికి అది కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. ట్రోలింగ్‌ విషయానికొస్తే, కొందరు నెటిజన్లకు 'తెలుగింటి అమ్మాయిలు అంటే లోకువ' అని ఒకప్పుడు బాధేసేది. వివరణలు ఇచ్చుకుంటూ ఉండేదాన్ని. చాలా డిప్రెషన్‌కు వెళ్లేదాన్ని. అప్పుడు నా కుటుంబం నాకు అండగా నిలబడింది.

అనసూయ భరద్వాజ్

డెలివరీ తర్వాత ఏ మహిళ అయినా, శరీరకంగా, మానసికంగా వీక్‌ అయిపోతారు. కానీ, నా శ్రేయోభిలాషుల వల్ల నేను త్వరగా కోలుకున్నా. ఇప్పటికీ కొందరు ఉన్నారు. నేను ఎలా ఉండాలో వాళ్లే నిర్ణయిస్తారు. 'నేను నొప్పులు పడి.. నేను కని.. నేను పెంచుకుంటున్నా. కష్టమంతా నాది'. కానీ, వాళ్లు 'నువ్వు తల్లివి.. అలా ఉండలేవా' అంటుంటారు. ఇక ఎవరినీ ఉపేక్షించాలనుకోలేదు. అందుకే రెబల్‌గా మారా. ప్రస్తుతం కొవిడ్‌ కారణంగా కొంచెం తగ్గాను. నా దగ్గర ఎంతోమంది మీద ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి. ఒక్కరినీ వదిలేది లేదు. ఇలా ట్రోల్స్‌ చేసేవారిని కీబోర్డ్‌ వారియర్స్‌ అంటాను. ఎదురుగా నిలబడితే ఒక్క మాట కూడా మాట్లాడలేరు. అమ్మవారిని దైవంగా కొలిచే ఈ దేశంలో ఒక మహిళపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. నా పిల్లలను, నా భర్తను కూడా ఇందులోకి లాగుతారు.

మీ మొదటి సినిమా ఏది?

అనసూయ: మొదటగా ఒప్పుకొన్నది 'క్షణం' విడుదలైంది మాత్రం 'సోగ్గాడే చిన్నినాయనా'.

'కథనం' ఫ్లాప్‌ తర్వాత 15రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట!

అనసూయ: నేనెప్పుడూ ఒక సినిమా నా భుజాలపై మోసుకెళ్లాలని అనుకోలేదు. ఎవరూ ఫ్లాప్‌ సినిమా తీద్దామని మొదలు పెట్టరు కదా! ప్రతి పాత్రకు న్యాయం చేయాలని తపిస్తాం. అందుకే నాకు బాధగా అనిపించింది. చాలా మంది కష్టపడ్డారు.

'రంగమ్మత్త' పాత్ర ఎందుకు చేయాల్సి వచ్చింది?

అనసూయ: డబ్బుల కోసం ఆ సినిమా చేయలేదు. టీవీ నుంచే నాకు బోలెడంత వస్తుంది. లేకపోతే మా ఆయన ఇస్తాడు. టీవీలో నా ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు. టెలివిజన్‌ నా ఇల్లు. నేను సినిమాల్లో ఎందుకు నటిస్తున్నానంటే.. నన్ను తక్కువ చేసి మాట్లాడేవాళ్లు.. ఎక్స్‌పోజింగ్‌తో నెట్టుకొస్తున్నానని కామెంట్‌ చేసేవాళ్ల నోళ్లు మూయించడానికే సినిమాలు చేస్తున్నా. సినిమాల్లో వేరే అనసూయను చూడాలి. 'రంగమ్మత్త' కోసం నాకంటే ముందు 20మందిని ఆడిషన్‌ చేశారట. ఆ అవకాశం నాకు వచ్చింది. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రల్లో రంగమ్మత్త ది బెస్ట్‌.

ABOUT THE AUTHOR

...view details