సినిమా పాట రాయాలంటే కొన్ని పరిధులు ఉంటాయి. కథకు తగ్గట్టు మాత్రమే రాయాలనే సందర్భాలు ఎదురవుతాయి. అందుకే ఓ పాట గంటలో పూర్తయితే కొన్ని పాటలు రోజులు తరబడి రాయాల్సి వస్తుంది. అలాంటపుడే రచయిత సృజనాత్మకత బయటపడుతుంది. తన పేరు శ్రోతల నోళ్లలో నానేలా చేస్తుంది. ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్‌కు ఇలాంటి పరిస్థితే వచ్చింది 'మర్యాద రామన్న' చిత్రం కోసం. సునీల్, సలోని జంటగా రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు.
మీకు తెలుసా: 'తెలుగమ్మాయి' పాటకు 43రోజులు పట్టిందట! - అనంత్ శ్రీరామ్ తెలుగమ్మాయి సాంగ్
సునీల్, సలోని జంటగా నటించిన చిత్రం 'మర్యాద రామన్న'. ఈ చిత్రంలోని ఓ పాట రాసేందుకు ఏకంగా 43 రోజులు తీసుకున్నారట పాటల రచయిత అనంత్ శ్రీరామ్. ఈ విషయాన్ని తానే స్వయంగా ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
"ఈ కథలో నాయిక సలోని తాను వివాహం చేసుకునే వ్యక్తి ఎలా ఉండాలో ఊహించుకుని బొమ్మలు గీస్తుంటుంది. వాటిని చూసిన కుటుంబ సభ్యులు పిచ్చి గీతలు అంటూ ఏడిపిస్తుంటారు. ఆ బొమ్మల్లో ఏదో విషయం ఉందని కథానాయకుడు చెప్తే ఆ కుటుంబ సభ్యులు ఇంప్రెస్ అయ్యేలా రాయాల్సిన గీతమిది. క్లిష్టమైన సన్నివేశం కావడం వల్ల అత్యధిక సమయం పట్టింది" అని ఓ సందర్భంలో తెలిపారు అనంత శ్రీరామ్. 43 రోజుల వ్యవధిలో ఆ పాట పూర్తి చేశానని చెప్పుకొచ్చారు. కీరవాణి, గీతా మాధురి ఆలపించిన ఈ పాట ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.