'నాకు ఏ విషయంలోనూ భయం లేదు' అని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి చెప్పినట్లు విద్యార్థులందరూ భయం లేకుండా, దృఢ విశ్వాసంతో జీవించాలని నటుడు సూర్య(suriya movies) విజ్ఞప్తి చేశారు. జాతీయ అర్హత పరీక్ష(నీట్)కు(neet 2021) హాజరయ్యే ముగ్గురు విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురై ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వరుస ఘటనలు అందరినీ కలిచివేశాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నటుడు సూర్య ప్రత్యేక వీడియో పోస్ట్ చేశారు. ఒక సోదరుడిగా విజ్ఞప్తి చేస్తున్నానని భావోద్వేగంతో మాట్లాడారు.
"పరీక్ష అనేది జీవితం కన్నా పెద్దదేమీ కాదు. మీరు డిప్రెషన్‌లో ఉంటే, వెంటనే మీ సన్నిహితులతో ఎక్కువ సేపు గడపండి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు ఇలా ఎవరైనా సరే. ఒత్తిడి, నిరాశ, నిస్పృహలనేవి కొద్దిసేపటి తర్వాత తొలగిపోతాయి. కానీ, ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయం మీ జీవితాన్నే ముగించేస్తుంది. మిమ్మల్ని అమితంగా ప్రేమించే తల్లిదండ్రులకు అది యావజ్జీవ శిక్షలాంటిది. దీన్ని మర్చిపోవద్దు. ఒక సోదరుడిగా ఈ విషయం చెబుతున్నా" అని తీవ్ర ఒత్తిడితో బాధపడుతున్న విద్యార్థులను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు.