తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విలనిజానికి సరికొత్త డిక్షనరీ అమ్రీష్​ పురి - అమిష్ర్​ పురి ప్రత్యేక కథనం

ఆకట్టుకునే ఆహార్యం.. గంభీరమైన గొంతు.. కళ్లలో కనిపించే క్రౌర్యం.. కలిస్తే అమ్రీష్‌ పురి. ప్రతినాయకుడి పాత్రలో విలక్షణమైన విలనిజాన్ని పండించడంలో ఆయనకు ఆయనే సాటి. నేడు ఆయన 87వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం..

Amrish Puri
అమ్రీష్‌పురి

By

Published : Jun 22, 2020, 6:01 AM IST

Updated : Jun 22, 2020, 9:09 AM IST

ప్రతినాయకుడిగా తనదైన ముద్ర బలంగా వేశారు దివంగత నటుడు అమ్రీష్‌ పురి. బాలీవుడ్‌లో తన క్రూరత్వంతో ఎన్నో చిత్రాలను విజయ తీరాలకు నడిపించారు. విలన్...అంటే ఇలాగే ఉండాలనే సరికొత్త డిక్షనరీని రాశారు. నేడు ఆయన 87వ జయంతి సందర్భంగా ప్రత్యేక విశేషాలు మీకోసం..

400 సినిమాల చరిత్ర

హిందీతో పాటు కన్నడ, మరాఠీ, పంజాబీ, మలయాళం, తెలుగు, తమిళ్ లాంటి భారతీయ భాషల్లో అనేక చిత్రాలు చేసిన అమ్రీష్‌ పురి హాలీవుడ్​లో కూడా తన ప్రతిభ కనబరిచారు. విదేశీ వీక్షకులకు కూడా అమ్రీష్‌ పురి పేరు సుపరిచితం. 1984లో స్టీవెన్ స్పిల్ బెర్గ్ దర్శకత్వం వహించిన 'ఇండియానా జోన్స్ అండ్ ది టెంపుల్ ఆఫ్ డూమ్' చిత్రంలో మోలా రామ్ గా అమ్రీష్ పురి లబ్ధ ప్రతిష్టులు. తనకు ఎంతో ఇష్టమైన సినీ విలన్ అమ్రీష్‌ పురి అంటూ స్టీవెన్ స్పిల్ బెర్గ్ ప్రత్యేకంగా కితాబిచ్చారు. అలాగే, 1987లో విడుదలైన శేఖర్ కపూర్ హిందీ మూవీ 'మిస్టర్ ఇండియా' లో నటించిన అమ్రీష్‌ పురి ని ఇప్పటికీ బాలీవుడ్ ప్రేక్షకులు మరిచిపోలేరు. ఆయన సుమారు 4 వందల సినిమాల్లో నటించారు..

అమ్రీష్‌పురి

సోదరుల స్పూర్తితో...!

సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి అమ్రీష్‌ పురి వచ్చారు. తనకన్నా పెద్దవారైన సోదరులు చమన్ పురి, మదన్ పురి అప్పటికే ఇండస్ట్రీలో పేరు మోసిన విలన్లు. గతకాలపు గాయకుడు కె. ఎల్. సైగల్ కి అమ్రీష్‌ పురికి దగ్గర బంధుత్వం ఉంది. సోదరుల స్పూర్తితో సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాలని భావించిన అమ్రీష్ పురి మొదటి స్క్రీన్ టెస్ట్ లోనే విఫలమయ్యారు. దాంతో, సినిమాలు తనకు అచ్చి రావనే నైరాశ్యంలో కుంగిపోయిన ఆయన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్​లో ఉద్యోగం పొందారు. కళాకారుడు కావాలన్న తపన తో పృథ్వీ థియేటర్స్ సంస్థలో చేరి సత్యదేవ్ దూబే రాసిన అనేక నాటకాలను ప్రదర్శిస్తూ వచ్చారు. ఆ నేపథ్యంలోనే 1979లో ఉత్తమ రంగస్థల కళాకారుడిగా సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. ఈ గుర్తింపుతో టీవీలో ప్రసారమయ్యే వాణిజ్య ప్రకటనల్లో చోటు సంపాదించుకున్నారు. అలా అలా ఆయన సినీ ఇండస్ట్రీ కి కూడా పరిచయమయ్యారు. అప్పుడు ఆయన వయస్సు 40 సంవత్సరాలు. అంటే... లేటు వయస్సులో సినీ అవకాశం అందివచ్చినట్లయింది.

ప్రారంభంలో విలన్ అనుయాయుడిగా

1970 ప్రాంతంలో ప్రారంభమైన అమ్రీష్ పురి మొదట్లో ప్రధాన ప్రతి నాయకుడికి అనుచరుడిగా చాలా చిత్రాల్లో పనిచేసారు. 1980లో సూపర్ హిట్ మూవీ హా పాంచ్ చిత్రంలో ప్రధాన విలన్ గా నటించిన తర్వాత అమ్రీష్ పురికి చెప్పుకోదగ్గ గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మెయిన్ విలన్​గా ఆయనకు అవకాశాలు వెతుక్కుని మరీ వచ్చాయి. అదే సంవత్సరం సుభాష్ గయ్ సూపర్ హిట్ సినిమా విధాతలో కూడా అమ్రీష్ పురి మెయిన్ విలన్. దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్ లాంటి హేమాహేమీలు నటించిన శక్తి చిత్రంలో కూడా విలన్ గా అమ్రీష్ పురి నటించి మెప్పించారు. 1983లో జాకీష్రాఫ్ ని హీరో గా పరిచయం చేసిన చిత్రం 'హీరో' లో మరోసారి సుభాష్ గయ్ అమ్రీష్ పురి కి విలన్ గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా సాధించిన సంచలన విజయం ప్రేక్షకులకు తెలిసిందే. 1980 నుంచి 1990 వరకూ ప్రధాన ప్రతి నాయకుడిగా అనేక చిత్రాల్లో నటించిన అమ్రీష్ పురి విమర్శకుల ప్రశంసలు, అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. అమ్రీష్ పురి పేరు తలచుకోగానే చాలా చిత్రాలు ప్రేక్షకులకు గుర్తు వస్తాయి. 1970లో ప్రేమ్ పూజారి సినిమాతో ఆయన కెరీర్ జోరందుకుంది. ఆహాత్ ...ఏక్ అజీబ్ కహానీ, రేష్మా ఔర్ షీరా, హల్చల్, సోనీ కె హాత్, హిందుస్థాన్ కె కసం, నిశాంత్, ఇమాం ధరమ్, భూమిక, రంగా ఔర్ రాజా, పాపి, హమారే తుమ్హారే, ఆక్రోస్, ఖుర్భానీ, దోస్తానా, హమ్ పాంచ్,పత్తర్ సి టక్కర్, క్రోధి, కలియుగ్, గాంధీ, విధాత, విజేత, సుగంధ, మై ఇంత్ కామ్ లూంగా, నిషాన్, అందా కానూన్, కూలీ, మందీ, హీరో...ఇలా చాలా సినిమాలు గుర్తొస్తాయి.

అమ్రీష్‌పురి

అంతర్జాతీయ చిత్ర యవనికపై

అంతర్జాతీయ చిత్ర యవనికపై కూడా అమ్రీష్ పురి సత్తా చాటారు. 1982లో నిర్మితమయిన రిచర్డ్ అటెన్ బరో గాంధీ సినిమాలో అమ్రీష్ పురి పోషించిన ఖాన్ పాత్ర ద్వారా ప్రపంచ సినిమా గడప దాటారు. స్టీవెన్ స్పిల్ బెర్గ్ చిత్రం ఇండియానా జోన్స్ అండ్ ది టెంపుల్ ఆఫ్ డూమ్ కూడా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది.

తిరిగిరాని లోకాలకు అమ్రీష్ పురి

కళాకారుడిగా జీవితాన్ని సుసంపన్నం చేసుకున్న అమ్రీష్ పురి 2005, జనవరి 12న మరణించారు. అరుదయిన బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ ఆయన చివరి శ్వాస వదిలారు.

ఇది చూడండి : యోగాసనాలు నేర్పిస్తున్న 'పెదరాయుడు' కుమార్తె

Last Updated : Jun 22, 2020, 9:09 AM IST

ABOUT THE AUTHOR

...view details