ఘడి ఘడి డ్రామా కర్తా హై... సాలా” అంటూ షోలేలో ధర్మేంద్ర, హేమామాలినితో ఆడే నాటకాన్ని పసికట్టినా.. ఏ తుమ్హారా బాప్ కా ఘర్ నహీ, పోలిస్ స్టేషన్ హై. ఇస్లియే సీధీ తరహ్ ఖడే రహో” అని జంజీర్లో కరడుగట్టిన రౌడీని నిలబెట్టినా.. ఐ కెన్ టాక్ ఇంగ్లీష్, ఐ కెన్ వాక్ ఇంగ్లీష్, ఐ కెన్ లాఫ్ ఇంగ్లీష్, బికాజ్ ఇంగ్లీష్ యీజ్ వెరీ ఫన్నీ లాంగ్వేజ్. తుమ్హారా నామ్ క్యా హై, బసంతీ అంటూ షోలే లో గోముగా టాంగావాలీని ప్రశ్నించినా ఆ కంఠం అమితాబ్ బచ్చన్‌దే అయివుంటుంది. ఆయన ఒక వ్యక్తి కాదు... ఒక సామూహిక వ్యవస్థ! 70వ దశకంలో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా నాటి యువకులకు ఆరాధ్య దైవంగా నిలచినా, నేటితరం ప్రేక్షకులకు ఆదర్శవంతమైన సలహాలు ఇస్తున్నా, ఒక మంచి నిర్మాతగా లాభాపేక్షలేని సినిమాలు నిర్మించినా, హీరోలు కూడా పాటలు పాడగలరు అని రుజువు చేసినా, కష్టపడి జ్ఞానసముపార్జన చేస్తే యువకులు కరోడ్ పతులు కాగలరని ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ లో నినదించినా ఆ క్రెడిట్ దక్కించుకోగల అర్హత బిగ్-బికే ఉంది. రాజకీయంలో అడుగిడి, అది తన ఒంటికి సరిపడదని గుర్తించి తప్పుకున్న మేధావి, అంతటి ప్రజ్ఞావంతుడు మరొకరు సినీరంగంలో కనిపించరు. తాజాగా బిగ్‌బి భారతీయ చలనచిత్రసీమలోని అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన సినీ ప్రయాణంలోని విశేషాలను ఓసారి గుర్తు చేసుకుందాం.
త్రివేణి సంగమ తనయుడు...
అమితాబ్ బచ్చన్ పుట్టింది 11, అక్టోబరు 1942న పవిత్ర నదుల సంగమస్థానం అలహాబాద్‌లో. తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ హిందీ భాషా పండితుడు. అమితాబ్‌ను ఆయన తండ్రి ‘ఇంక్విలాబ్’ అని ముద్దుగా పిలిచేవారు. తన సహచర కవి సుమిత్రానందన్ పంత్ సలహామేరకు ఆ పేరును అమితాబ్‌గా మార్చారు. తన కలంపేరు ‘బచ్చన్‌ను అమితాబ్ ఇంటిపేరుగా పెట్టారు. బిగ్‌బి అసలు ఇంటిపేరు శ్రీవాత్సవ. ఆయన కాలేజి చదువు నైనిటాల్ లోని ప్రసిద్ధ షేర్ వుడ్ కళాశాలలో పూర్తయింది. తరవాత దిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తల్లి తేజీ బచ్చన్‌కు నటన మీద ఆసక్తి వుండేది. ఆ ప్రభావం అమితాబ్ మీద బాగా పనిచేసింది. 1969లో మృణాల్ సేన్ నిర్మించిన జాతీయ అవార్డు చిత్రం ‘భువన్ షోమ్’ సినిమాకు గళాన్ని అందించి సినిమారంగ ప్రవేశానికి బాటలు పరిచారు. ప్రముఖ దర్శక నిర్మాత కె.ఎ. అబ్బాస్ 1969లో నిర్మించిన ‘సాత్ హిందుస్తానీ’ సినిమాలో మొదటి సారి వెండితెరపైదర్శనమిచ్చారు. ఈ సినిమాకు జాతీయ వచ్చినప్పటికీ అమితాబ్‌కు పెద్దగా పేరు తీసుకురాలేదు. 1971లో ఎన్.సి. సిప్పీ హృషికేష్ ముఖర్జీ దర్శకత్వం లో నిర్మించిన ‘ఆనంద్’ సినిమా బాక్సాఫీస్ హిట్టై రాజేష్ ఖన్నాకు సూపర్ స్టార్ ఇమేజ్ ని, అమితాబ్ బచ్చన్ కు గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు జాతీయ అవార్డుతో పాటు ఆరు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు వచ్చాయి. అమితాబ్ ఉత్తమ సహాయనటుడిగా అవార్డు అందుకున్నారు.
హృషికేష్ ముఖర్జీ నిర్మించిన ‘గుడ్డి’ సినిమాలో అమితాబ్ అతిథి పాత్రలో మెరిశారు. ఆయన భార్య జయభాదురికి ఇదే తొలి సినిమా. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ‘రేష్మా అవుర్ షేరా’ సునీల్ దత్ సొంత సినిమా. ఈ సినిమా బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైంది. అలాగే ఫారిన్ కేటగరీలో 44 వ ఆస్కార్ బహుమతి కోసం భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఇందులో సునీల్ దత్ కు తమ్ముడుగా అమితాబ్ నటించారు. 1972లో అమితాబ్ బచ్చన్ ఏకంగా ఆరు సినిమాలలో హీరోగా, ‘పియాకా ఘర్’, ‘గరమ్ మసాలా’, ‘జబన్’ సినిమాలలో అతిథిగా నటించారు. తమిళ సినిమా ‘మద్రాస్ టు పాండిచేరి’ (1966) ని హిందీలో ఎన్.సి. సిప్పీ.. ‘బాంబే టు గోవా’ పేరుతో రీమేక్ చేశారు. ఆర్.డి. బర్మన్ అద్భుత సంగీతంతో ఈ సినిమా హిట్టయింది. హీరోగా అమితాబ్‌కు తొలి బ్రేక్ ఇచ్చిన సినిమాగా ‘బాంబే టు గోవా’ నిలిచింది.
యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా...
దర్శక నిర్మాత ప్రకాష్ మెహ్రా 1973 లో ‘జంజీర్’ సినిమా నిర్మించారు. సలీం-జావేద్ రచన చేసిన ఈ సినిమా అమితాబ్‌ను ‘యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా నిలబెట్టింది. ఇందులో హీరోయిన్ జయభాదురి నటించింది. ఈ సినిమా బాలీవుడ్ లో ఒక నూతన శకానికి అంకురార్పణ జరిపిందని చెప్పవచ్చు. ఈ సినిమా తరవాత హిందీలో ఉద్రేక పూరిత సినిమాలు రావడం మొదలైంది. ఈ చిత్రం రష్యాలో కూడా హిట్ కావడం విశేషం. ఇందులో అమితాబ్‌ను ఎంపిక చెయ్యడానికి సలీం-జావేద్‌లే కారణం. అప్పటికి అమితాబ్ బచ్చన్ ఖాతాలో పన్నెండు ఫ్లాప్ చిత్రాలున్నాయి. ఆనంద్ సినిమాలో సపోర్టింగ్ పాత్ర, బాంబే టు గోవాలో హీరో పాత్రల విజయం మినహాయిస్తే మిగతా సినిమాల పాత్రలన్నీ పరాజయాలే. పైగా అప్పటికే ఆయనకు 30 ఏళ్ళ వయసొచ్చింది. బాలీవుడ్ లో ‘ఫెయిల్డ్ న్యూ కమ్మర్’గా అమితాబ్‌కు ముద్రపడింది.
దర్శక నిర్మాత ప్రకాష్ మెహ్రా కథను దృష్టిలో ఉంచుకొని రాజ్‌కుమార్, రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, దేవానంద్ పేర్లను పరిశీలిస్తుంటే, సలీం-జావేద్ అమితాబ్ పేరును సూచించారు. అందుకు కారణం బాంబే టు గోవా సినిమాలో అమితాబ్ చేసిన పోరాటాలే. సచిన్ దేవ్ బర్మన్ ఈ సినిమాకు అందించిన సంగీతం అజరామరం. హృషికేష్ ముఖర్జీ మరో చిత్రం ‘నమక్ హరామ్’ కూడా అదే సంవత్సరం విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో అమితాబ్ బచ్చన్‌తో పాటు రాజేష్ ఖన్నా హీరోగా నటించారు. బిగ్‌బికి ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం అందుకున్నారు.
1974 లో అరవింద్ సేన్ చిత్రం ‘కసౌటి’, నరేంద్ర బేడి సినిమా ‘బేనామ్’, ‘మజబూర్’ సినిమాల్లో అమితాబ్ హీరో గా నటించారు. 1975 లో అమితాబ్ నటించిన రెండు సూపర్ హిట్ సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి ‘దీవార్’, మరొకటి ‘షోలే’. యాష్ చోప్రా దర్శకత్వంలో గుల్షన్ రాయ్ నిర్మించిన ’దీవార్’ సినిమాలో అమితాబ్ విశ్వరూప ప్రదర్శన చేశారు. ఇందులో అమితాబ్ పాత్ర అండర్ వరల్డ్ గూండా హాజీ మస్తాన్ ను పోలి ఉండేలా సలీం-జావేద్ రచన చేశారు. ఇదొక బాలీవుడ్ మాస్టర్ పీస్ గా చెప్పవచ్చు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ బహుమతి గెలుచుకుంది. ఈ సినిమా ఎంత పాపులర్ అయ్యిందంటే తెలుగులో ‘మగాడు’ పేరుతో, తమిళంలో ‘దీ’ పేరుతో, మలయాళం లో ‘నత్తి ముత్తల్ నత్తి వరె’ గా పునర్నిర్మితమైంది. ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ ప్రక్రియను ఉపయోగించి ఫైటింగ్ సన్నివేశాలను రూపొందించారు. ఇందులో పతాక సన్నివేశం కోసం అమితాబ్ పది గంటలు తన హోటల్ రూములో రిహార్సల్స్ చేసి రక్తి కట్టించారు. నిర్మాత గుల్షన్ రాయ్ కి అమితాబ్ పోషించిన విజయ్ పాత్రను రాజేష్ ఖన్నాకు, అతని తమ్ముడు రవి పాత్రను నవీన్ నిశ్చల్ కు ఇవ్వాలని భావించినా సలీం-జావేద్ ససేమిరా అన్నారు. రవి పాత్రకు శశికపూర్ న్యాయం చేశాడు.