తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మగాళ్లూ.. ఆ మహిళలను చులకనగా చూడకండి - అమితాబ్‌ బచ్చన్ కుటుంబం

అందాల తారలను అభిమానించే వారే కాదు... వారిపై విమర్శనాస్త్రాలు సంధించే వారూ చాలామందే ఉంటారు. నేరుగానే కాకుండా సోషల్‌ మీడియాలో కొంతమంది ఆకతాయిలు సెలబ్రిటీలను దూషిస్తూ ఇష్టమొచ్చిన విధంగా పోస్ట్‌లు, కామెంట్లు పెడుతుంటారు. రాజ్యాంగం కల్పించిన ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ను అడ్డు పెట్టుకుంటూ వారి మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తుంటారు. కొంతమంది సెలబ్రిటీలు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటే... కొంతమంది మాత్రం తమపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన వారికి తగిన బుద్ధి చెప్తున్నారు. తాజాగా బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్య నవేలీ నందాకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ సందర్భంగా తన తల్లి శ్వేతాబచ్చన్‌ గురించి చులకనగా మాట్లాడిన ఓ నెటిజన్‌కు తనదైన శైలిలో చురకలంటించింది.

Navya Naveli Nanda
మగాళ్లూ.. అలాంటి మహిళలను చులకనగా చూడకండి

By

Published : Feb 18, 2021, 5:12 PM IST

అమితాబ్‌ ముద్దుల కూతురు శ్వేతా నందా-అల్లుడు నిఖిల్‌ నందాల గారాల పట్టిగా నవ్య నవేలీ నందాకు సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ భారీగానే ఉంది. న్యూయార్క్‌లోని ఫోర్ధమ్‌ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఆమె.. బిగ్‌ బీ గ్రాండ్‌ డాటర్‌గా ఇప్పటికే సెలబ్రిటీ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. గతంలో మానసిక ఆందోళన సమస్యతో బాధపడిన ఆమె ఇటీవల తన స్నేహితులతో కలిసి ‘ఆరా హెల్త్‌’ అనే ఆన్‌లైన్‌ హెల్త్‌ కేర్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఈ ఆన్‌లైన్‌ వేదిక ద్వారా ఎన్నో శారీరక, మానసిక అనారోగ్యాలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తోందీ స్టార్‌ కిడ్.

అమ్మను చులకన చేసి మాట్లాడినందుకు!

సామాజిక దృక్పథం మెండుగా ఉన్న నవ్య లింగ సమానత్వం కోసం ఇటీవల ‘ప్రాజెక్ట్‌ నవేలీ’ పేరుతో ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో లింగ సమానత్వం గురించి, అదేవిధంగా తన కొత్త ప్రాజెక్టు విషయాల గురించి ప్రముఖ మ్యాగజైన్‌ ‘వోగ్‌ ఇండియా’ నవ్యను ఇంటర్వ్యూ చేసింది. ఇందులో భాగంగా- ‘అమ్మమ్మ (జయా బచ్చన్‌), అమ్మ (శ్వేతా బచ్చన్)... ఇలా మా కుటుంబంలో మహిళలందరూ ఏదో ఒక పని చేసే వాళ్లే. వాళ్లను చూస్తూనే నేను పెరిగాను’ అని నవ్య చెప్పుకొచ్చిన మాటలను ఉటంకిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేసిందా మ్యాగజైన్‌. నవ్యను ట్యాగ్‌ చేస్తూ షేర్‌ చేసిన ఈ పోస్టుకు ఒక నెటిజన్‌ ‘మీ అమ్మకు ఉద్యోగం లాంటిదేమీ లేదు కదా..? ఆమె ఎలా వర్కింగ్‌ ఉమన్‌ అవుతుంది’ అని స్మైలీ ఎమోజీతో కామెంట్‌ పెట్టాడు.

అలాంటి మహిళలను అవమానించకండి!

మామూలుగా సోషల్‌ మీడియాలో మహిళలను కామెంట్‌ చేస్తేనే వదిలిపెట్టని నవ్య తన తల్లిని చులకన చేసి మాట్లాడేసరికి తట్టుకోలేకపోయింది. వెంటనే ‘మా అమ్మ ఒక రచయిత, డిజైనర్‌, భార్య, అమ్మ’ అని ఆ నెటిజన్‌కు సమాధానమిచ్చింది. అంతటితో ఆగకుండా మహిళలను కించపరుస్తూ కామెంట్లు చేసే ఆకతాయిలందరికీ జ్ఞానోదయం కలిగేలా ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది.

‘తల్లిగా, భార్యగా ఉండడమనేది కూడా ఫుల్‌ టైం జాబ్‌ లాంటిదే. ఇంటి బాధ్యతలన్నీ భుజాన వేసుకున్న మహిళలను చులకనగా చూడకండి. ఒక తరాన్ని పెంచి పోషించడంలో వారి పాత్ర ఎంతో కీలకమైనది. అలాంటివారికి అండగా నిలబడండి తప్ప అవమానించకండి’ - బచ్చన్‌ గ్రాండ్‌ డాటర్.

అమితాబ్‌ బచ్చన్‌తో పాటు ఆయన భార్య జయా బచ్చన్‌, కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ కూడా వెండితెరపై మెరిశారు. కానీ ఆయన కూతురు శ్వేతా బచ్చన్‌ మాత్రం ఇందుకు మినహాయింపు. విద్యాభ్యాసం పూర్తయ్యాక కొన్ని టీవీ ప్రకటనలకు మోడల్‌గా పని చేసిన ఆమె సినిమాల్లో మాత్రం నటించలేదు. 1997లో ప్రముఖ నటుడు రాజ్‌ కపూర్‌ మనవడు నిఖిల్‌ నందాను వివాహమాడిన శ్వేత ఆ తర్వాత రచయిత్రిగా, ఫ్యాషన్‌ డిజైనర్‌గా స్థిరపడిపోయింది. 2018లో ఆమె రాసిన ‘ప్యారడైజ్‌ టవర్స్‌’ అనే పుస్తకం బాగా అమ్ముడుపోయిన నవలల్లో ఒకటిగా నిలిచింది. ఫ్యాషన్‌ డిజైనర్‌గానూ ప్రతిభ చూపుతూ సొంతంగా ఓ ఫ్యాషన్‌ లేబుల్‌ను ప్రారంభించింది. శ్వేతకు నవ్యా నవేలీ నందాతో పాటు అగస్త్యా నందా అనే కుమారుడు ఉన్నాడు.

ఇవీ చూడండి:అనాథ పిల్లలతో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్

ABOUT THE AUTHOR

...view details