అనారోగ్యం కారణంగా జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రాదానోత్సవానికి దూరం అవుతున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు బాలీవుడ్ షెహెన్ షా అమితాబ్. దిల్లీ వేదికగా నేడు ఈ వేడుక జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరుకానున్నారు.
"జ్వరంతో బాధపడుతున్నా. ప్రయాణం చేసే స్థితిలో లేను. అందుకే దిల్లీలో జరగనున్న జాతీయ చలన చిత్ర అవార్డులకు దూరమవుతున్నా. కార్యక్రమానికి హాజరుకానందుకు విచారిస్తున్నా."
-అమితాబ్ బచ్చన్, సినీ నటుడు
అమితాబ్... దాదాపు 60 ఏళ్లు సినీరంగంలో సేవలకు గానూ 2018 ఏడాదికి చెందిన 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డును సెప్టెంబర్లో ఆయనకు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
75 శాతం పాడైంది...!
అమితాబ్ కొంత కాలంగా కాలేయం సమస్యతో బాధపడుతున్నాడు. క్షయ, హైపటైటిస్ బి వ్యాధులను సరైన సమయంలో గుర్తించకపోవడం వల్ల కాలేయం 75 శాతం చెడిపోయిందని ఆయనే ఓ సమావేశంలో వెల్లడించాడు. ఇటీవల బిగ్ బచ్చన్ 5 కేజీల బరువు తగ్గడం ఆయన ఆరోగ్యంపై ఆందోళన కలిగించింది.
ఈ మధ్య కాలంలో కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన అమితాబ్... ఇటీవల ఇంటికి వచ్చినప్పటి నుంచి విశ్రాంతి తీసుకోకుండా యథావిధిగా షూటింగ్లకు హాజరయ్యాడు. త్వరలో విడుదల కానున్న 'చెహ్రే' చిత్రం కోసం ఇటీవల మంచుప్రాంతమైన స్లోవేకియాలో... చిత్రీకరణలో పాల్గొన్నాడు ఈ 77 ఏళ్ల సినీయర్ నటుడు. ఫలితంగా మళ్లీ అనారోగ్యం పాలయ్యాడు.