దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో.. అందరూ అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పిస్తోంది పంజాబ్ ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేకంగా 'మిషన్ ఫతే' పేరుతో ఓ పాటను రూపొందించింది. ఇందులో బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, కరీనా కపూర్, గురుదాస్ మాన్ సహా కపిల్‌దేవ్, హర్భజన్ సింగ్ వంటి ప్రముఖ క్రీడా సెలబ్రిటీలు కనిపించారు.
మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చింది పంజాబ్ ప్రభుత్వం. ప్రజలు జాగ్రత్తలను పక్కాగా పాటిస్తూ.. బాధ్యతగా ఉండాలని సూచించింది. అప్పుడే కరోనాతో యుద్ధం ముగిసిపోలేదని, ప్రతి ఒక్కరు మాస్కుల వినియోగం, భౌతిక దూరం, చేతులు కడుక్కోవడం వంటి నిబంధనలు పాటించాలని అందులో కోరింది. ఇవే వైరస్ ఎదుర్కోడానికి సహాయపడతాయని తెలిపింది.