తనకు 70ఏళ్లు వచ్చినా అమితాబ్ బచ్చన్‌లా సినిమాల్లోనే ఉండాలనుకుంటున్నట్లు మనసులో మాట చెప్పాడు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'అల వైకుంఠపురములో..' చిత్రం విజయంతో జోరు మీదున్నాడు బన్నీ. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే మాఫియా కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆ విషయాలు అతడి మాటల్లోనే...
ఒత్తిడి కూడా సంతోషమే
"మొదట్లో నాకు యానిమేటర్ కావాలని ఉండేది. కొద్దిరోజులకే దానిపై ఆసక్తి పోయింది. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో ఉన్నప్పుడు ఆ ఇంటి వాతావరణ ప్రభావం తప్పకుండా పడుతుంది కదా. నా విషయంలోనూ అంతే. అలా నేనూ హీరో అయ్యా. నా ప్రతి సినిమా కోసం సర్వశక్తులు ఒడ్డుతా. గత సినిమాలో నా ప్రదర్శన కంటే కొత్త సినిమాలో ఉత్తమంగా చేయాలనుకుంటా. నేను ఎంతవరకు చేయగలనో అంతవరకూ తప్పకుండా ప్రయత్నిస్తా. ఒత్తిడి తీసుకోవడం ఒక రకమైన సంతోషమే. రోజంతా కష్టపడి పనిచేస్తే, ఒక నటుడిగా ఆత్మ సంతృప్తి ఉంటుంది".
తెలుగు సినిమా స్థాయిని పెంచాయి...
"హిందీ సినిమాల్లో నటించాలని ఉంది. ప్రాంతాన్ని బట్టి సంప్రదాయాలు, సంస్కృతులు వేరుగా ఉన్నా, సినిమా అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. సినిమాలో బలమైన కంటెంట్ ఉంటే తప్పకుండా ప్రతి గుండెను తాకుతుంది. సరైన దర్శక, నిర్మాతలు, మంచి స్క్రిప్ట్ ఉంటే తప్పకుండా చేస్తా. కొన్ని ఆఫర్లు వచ్చినా నా అంచనాలకు సరిపోయేలా లేవు. బహుశా అనేక విషయాలపై నేను కసరత్తులు చేయాలేమో".
"దశాబ్దకాలంగా చూసుకుంటే, తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఇందుకు సరైన ఉదాహరణ.. 'మహానటి'. ఇది ప్రత్యేక కమర్షియల్ సినిమా కాదు. కానీ, మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. 'బాహుబలి' కమర్షియల్ చిత్రమైనా అద్భుతమైన కంటెంట్ ఉంది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రాలివి."
నా భార్య చాలా స్ట్రిక్ట్
"మహిళా అభిమానుల విషయంలో నా భార్య (స్నేహా రెడ్డి) చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. నా మహిళా అభిమానులు నా వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టరని అనుకుంటున్నా. నాకు పెళ్లై, ఇద్దరు పిల్లలున్నారని వాళ్లకు తెలుసు. 'మీ మహిళా అభిమానులను నన్ను కలవమనండి. మీరెలా ఉంటారో చెబుతాను' అని నా భార్య అంటుంది. నా పిల్లలే కాదు, సమాజం పట్ల నాకు బాధ్యత ఉంది".