"65 ఏళ్లు దాటిన వ్యక్తులు చిత్రీకరణల్లో పాల్గొనరాదు" అంటూ మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లోని ఓ నిబంధనను కొట్టేస్తూ ముంబయి హైకోర్టు ఇటీవలే తీర్పిచ్చింది. సీనియర్ నటుడు ప్రమోద్ పాండేతో పాటు ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్ అసోసియేషన్స్ దాఖలు చేసి పిటిషన్లపై విచారణ జరిపింది. 65 ఏళ్లు పైబడిన వారిని షూటింగ్స్‌లో పాల్గొనొద్దని చెప్పడం.. ఓ రకమైన వివక్ష కిందకే వస్తుంది అని చెప్పింది. ఆ నిబంధనను తొలిగించాలని కోరింది. ఇప్పుడిదే అంశంపై బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ స్పందించారు.
నాకోసం ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు ఉన్నాయా? - amitabh bachchan news
కరోనా ప్రభావంతో 65 ఏళ్లు దాటినవారు సినిమా షూటింగ్స్‌లో పాల్గొనరాదు అనే అంశంపై మాట్లాడిన అమితాబ్.. తనకు వేరే ఉపాధి ఉంటే చెప్పమని అన్నారు. దాదాపు మూడు వారాల పాటు కరోనాతో పోరాడిన ఈయన.. ఇటీవలే కోలుకున్నారు.
"ఈ అంశం పట్ల నాలో మనసును ఇబ్బంది పెట్టే అనేక ఆందోళనలు నెలకొని ఉన్నాయి. 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వాళ్లు పనికి వెళ్లలేరని ప్రభుత్వ అధికారులు నిర్దేశించారు. అంతకుముందు దాన్ని 50 ఏళ్లకు తగ్గించారు. ఈ వృత్తిలో 78 ఏళ్లు వయసున్న నాలాంటి వ్యక్తులకు ఇది ఇబ్బందికరమైన అంశమే. దీన్ని ఫిల్మ్ బాడీ కోర్టులలో ప్రతిఘటించింది. గౌరవనీయ హైకోర్టు తన తీర్పుతో ఈ వయోపరిమితులను అనుమతించేదిలేదని నేను నమ్ముతున్నా. దీనివల్ల 50 ఏళ్లు పైబడిన వారు పనిచేయడానికి సురక్షితమేనని అనుకుంటున్నాను. కానీ కోర్టు నిర్ణయాలు, చట్టపరంగా కార్యరూపంలోకి రావడానికి మరింత సమయం తీసుకుంటాయి. ఈలోపు ఇంకెలాంటి ఆశ్చర్యకరమైన నిర్ణయలొస్తాయో ఏమో. ఏదేమైనా నాకేదైనా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలుంటే సూచించగలరు" అని అమితాబ్ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు.
ఇటీవలే అమితాబ్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. అమితాబ్, ఆయన కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆరాధ్య.. వైరస్ నుంచి కొన్నిరోజుల క్రితం కోలుకోగా.. అభిషేక్ కూడా శుక్రవారం కరోనా నుంచి బయటపడి శుక్రవారం ఇంటికి వచ్చేశాడు.