2010లో విడుదలైన మైనా (తమిళం) సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది అమలాపాల్. ఈ సినిమాలో అమాయకపు నటనతో అందరినీ ఆకట్టుకున్న ఆమె.. ఆ తర్వాత బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో వరుసగా సినిమాలు చేసింది. లవ్ ఫెయిల్యూర్’, బెజవాడ’, నాయక్, ఇద్దరమ్మాయిలతో, ‘జెండాపై కపిరాజు’.. వంటి తెలుగు చిత్రాల్లోనూ నటించి ఇక్కడి ప్రేక్షకులకు బాగా చేరువైంది. 2019లో 'ఆమె' చిత్రంలో తన నటనకు గానూ మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇక అమల వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2011లో 'దైవా తిరుమగల్' (తెలుగులో నాన్న) సినిమా షూటింగ్ సమయంలో ఆ చిత్ర దర్శకుడు ఎ.ఎల్. విజయ్‌తో ప్రేమలో పడింది. మూడేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరు.. 2014లో పెళ్లిపీటలెక్కారు. అయితే ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో 2017లో అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు.
'మీరా'గా మెప్పించి!
వైవాహిక జీవితం మిగిల్చిన చేదు అనుభవాన్ని మర్చిపోతూ మళ్లీ సినిమాలతో బిజీగా మారిపోయింది అమల. విడాకుల తర్వాత తను నటించిన భాస్కర్ ఒరు రాస్కల్, రాట్‌సన్, కుట్టీ స్టోరీ చిత్రాలు తమిళ ప్రేక్షకులను బాగా మెప్పించాయి. ఈ క్రమంలో ఆమె తాజాగా 'పిట్టకథలు' అనే యాంథాలజీ చిత్రంలో నటించింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్‌లో 'మీరా' అనే ఓ గృహహింస బాధితురాలి పాత్రలో నటించింది అమల. ఇక ఈ చిత్ర కథ విషయానికొస్తే... పెళ్లి మీద సంప్రదాయ ఆలోచనలు కలిగిన మీరాను భర్త విశ్వామోహన్(జగపతిబాబు) నిత్యం అనుమానిస్తుంటాడు. వీరిద్దరి మధ్య వయసు తేడా కూడా ఉండడంతో మీరాతో ఎవరు చనువుగా ఉన్నా సహించలేకపోతుంటాడు. లైంగిక, శారీరక వేధింపులకు గురి చేస్తుంటాడు. వివాహ వ్యవస్థ మీద ఉన్న గౌరవంతో అన్నింటికీ తట్టుకుని నిలబడి అతనితోనే జీవితం కొనసాగిస్తుంటుంది మీరా. అయితే ఈ బంధం నుంచి బయటకు రావాలనుకున్నప్పుడు ఆమె చుట్టూ ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. చివరికి ఆమె భర్త హింస నుంచి ఎలా బయటపడిందన్నదే మీరా కథ. ఈ చిత్రంలో అమల అభినయానికి సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇక మీరా కథకు, తన నిజ జీవితానికి కొన్ని పోలికలు ఉండడంతో.. విడాకులు తీసుకున్న సమయంలో తను ఎదుర్కొన్న కొన్ని పరిస్థితుల గురించి ఇలా పంచుకుంది అమల.