అమల అక్కినేని, టాలీవుడ్ కింగ్ నాగార్జున మనసు దోచుకున్న అందాల భామ. నాగ్, అమలలది టాలీవుడ్లో ఓ అందమైన జంట. వివాహానికి ముందు సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా.. ఆ తరువాత వాటికి దూరమయ్యారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ తెరపై మెరిశారు.
నేపథ్యం
అమల అక్కినేని జన్మస్థలం కోల్‌కతా. 1968, సెప్టెంబర్ 12న జన్మించారు. తండ్రి భారతీయుడు, తల్లి ఐరిష్ దేశస్తురాలు. చెన్నై కళాక్షేత్ర కళాశాల నుంచి భరత నాట్యంలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు అమల. ప్రసిద్ధ కళాకారిణి రుక్మిణి దేవి ఆరెండల్ ఈ సంస్థని స్థాపించారు. 13 సంవత్సరాల వయసు నుంచే రుక్మిణి దేవి బృందంలో ప్రదర్శనలు ఇస్తూ దేశవిదేశాలు పర్యటించారు అమల.
మొదటి సినిమా అవకాశం
అలా ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో ప్రముఖ నటుడు, దర్శకుడు టి.రాజేందర్ సినిమాలో అవకాశం వచ్చింది. ప్రేమకథల్ని రసరమ్యంగా తెరకెక్కించగల సత్తా ఉన్న సృజనాత్మక దర్శకుడు తన చిత్రంలో క్లాసికల్ డాన్సర్ పాత్ర కోసం అమలను సంప్రదించారు. గ్రాడ్యుయేషన్ అప్పుడే పూర్తైన సంవత్సరంలో ఆ అవకాశం వచ్చిన కారణంగా సినిమా పరిశ్రమ ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తి కలిగిందట అమలకు. అందువల్ల ఆ అవకాశాన్ని చేజార్చుకోలేదు. అంతేకాదు పూర్తి స్థాయి నాట్యకారిణి పాత్ర చేయడం కూడా తనకు సౌకర్యవంతంగా ఉందని ఒకానొక సందర్భంలో చెప్పారు. ఒక నర్తకిగా ప్రదర్శనలు ఇవ్వడం కంటే సినిమాలో నటించడం బాగుందని ఆమె పేర్కొన్నారు.
54 చిత్రాల విజయవంతమైన సినీ ప్రయాణం
అమల మొత్తం 54 సినిమాల్లో నటించారు. టి.రాజేందర్ సినిమా 'మైథిలీ ఎన్నై కాథలి'తో ఎంట్రీ ఇచ్చిన ఆమె అనతికాలంలోనే డార్లింగ్ ఆఫ్ ఇండస్ట్రీగా మారిపోయారు. వరుస సినిమాలు చేస్తూ విజయాలు సాధిస్తూ ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషా చిత్రాల్లో అమలకు ఎన్నో అవకాశాలు వచ్చాయి.
హాస్టల్లో పెరగడం
తండ్రి నేవీ అధికారిగా పనిచేస్తూ ఉండడం, తల్లి ఐర్లాండ్‌లో ఉండడం వల్ల అమల హాస్టల్లో పెరిగారు. అమల స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వారు. సినిమాల్లోకి రావాలన్న నిర్ణయం కూడా ఇలాంటిదే. అమల నిర్ణయాన్ని తల్లిదండ్రులు గౌరవించారు.
సినిమాలోనే అమలకు నాగ్ ప్రపోజ్
అప్పుడప్పుడే తెలుగు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న అమలని అక్కినేని వారసుడు నాగార్జున అభిమానించారు. 'నిర్ణయం' సినిమాలో వీరిద్దరి లవ్ ట్రాక్‌కి నిదర్శనమా అన్నట్లు.. 'హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం... ప్రేమించాను దీన్నే... కాదంటోంది నన్నే..' అన్న పాట అప్పట్లో అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. 'గొప్ప ఇంటి కుర్రవాణ్ణి....అక్కినేని అంతటోన్ని... కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా?' అంటూ సినిమాలోనే నాగార్జున ప్రపోజ్ చేశారు.