"తెలుగు అమ్మాయి అనగానే పల్లెటూరి చిత్రాలకే సరిపోతుంది. నటీనటులు కూడా చీరలు, చుడీదార్లు వంటి వస్త్రధారణలో కనపడటానికే ఇష్టపడతారని అంతా అనుకొని వారిపై ఓ ముద్ర వేసేస్తారు. నాకిప్పటి వరకు వచ్చిన పాత్రలు ఆ తరహాలోనివే. కానీ నటిగా నేనెలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధమే" అని చెప్పింది ఈషా రెబ్బా.
ఇప్పటివరకు 'అ!','అరవింద సమేత' వంటి చిత్రాల్లో నటిగా మెరిసిందీ అందాల భామ. ఇప్పుడు 'రాగల 24 గంటల్లో' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈనెల 22న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించింది ఈషా.
- "ఇలాంటి నాయికా ప్రాధాన్య చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. నాకు ఈ తరహా జోనర్లో పనిచేయాలని ఎప్పట్నుంచో ఉంది. ఆ కల ఇప్పటికి నెరవేరినందుకు సంతోషంగా ఉంది. శ్రీనివాసరెడ్డి కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చేసింది. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో నా పేరు విద్య. ఈ పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడ్డా. ఎందుకంటే నాయికా ప్రాధాన్య చిత్రమనగానే బాధ్యత అంతా మన భుజాలపైనే ఉంటుంది. కథ నా చుట్టూనే తిరుగుతుంటుంది కాబట్టి ఎక్కువ షూట్‌లో పాల్గొనాల్సి వచ్చేది. నా పాత్రలో కోపం, బాధ, భయం.. ఇలా అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. వీటిని పలికించడం కోసం మానసికంగా శ్రమ పడాల్సి ఉంటుంది. చిత్రీకరణలో ఈ అనుభవాలన్నింటినీ ఎంతో ఆస్వాదించా. నన్ను ఈ చిత్రంలో ఎంతో అందంగా చూపించారు."
- "శ్రీనివాస్ కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన 'ఢమరుకం' చేశారనే తెలుసు. ఆ తర్వాతే తెలిసింది. ఆయన ఎక్కువ కామెడీ జోనర్ చిత్రాలకు పనిచేశారని. ఆయనకు ఈ సినిమా తొలి థ్రిల్లర్ అయినా ఎంతో క్లారిటీతో తెరకెక్కించారు. కథలో ఉన్న మలుపులను ప్రేక్షకులెవ్వరూ ముందుగా ఊహించలేరు. చాలా ట్విస్ట్‌లు, సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. నాకు ఆయన కథ చెప్పినప్పుడు తర్వాత ఇలా జరుగుతుందేమో అని అనుకునేదాన్ని కానీ, నా అంచనాలకు ఎక్కడా ఆస్కారం ఉండేది కాదు. థ్రిల్లర్‌లకు ఉండాల్సిన ప్రధాన లక్షణం కూడా ఇదే కదా అనిపించింది. సత్యదేవ్ పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఆయనది ప్రతినాయక ఛాయలున్న పాత్రే అయినప్పటికీ ప్రతినాయకుడు కాదు".
- "తెలుగు అమ్మాయి కావడం వల్ల అవకాశాలు తక్కువ వస్తుండొచ్చు. కానీ ఆ ముద్ర నా కెరీర్‌కు ఎప్పుడూ ప్రతికూలంగా మారలేదు. అవకాశాల కోసం ఈ మధ్య హాట్ ఫొటోషూట్లు చేస్తున్నానేమో అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. నిజానికి నేనెప్పుడూ హాట్‌గానే ఉంటాను. అన్నిరకాల దుస్తులు ధరించడానికి ఇష్టపడుతుంటా. నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలి అనుకుంటా. ఓ సినిమా ఎంచుకునేటప్పుడు కథ బాగుందా? దర్శకుడికి కథపై మంచి పట్టుందా లేదా? అన్నదే ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. స్టార్ హీరోలతో చేసే అవకాశం వస్తే కాస్త కథ అటు ఇటుగా ఉన్నా ఒకే చేసేస్తా. ఎందుకంటే మనకి పేరొస్తుంది కదా (నవ్వుతూ). పరాజయాలకు కుంగిపోయే మనస్తత్వం కాదు నాది".