బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ భారత చిత్రసీమలో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. కెరీర్లో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న భాయ్.. మూడు దశాబ్దాల ప్రస్థానంలో బాలీవుడ్ సూపర్ స్టార్‌గా ఎదిగాడు. హీరోగా సల్మాన్ తొలి చిత్రం 'మైనే ప్యార్ కియా సినిమా' 1989 డిసెంబరు 29న విడుదలైంది.
అయితే అంతకుముందు 1988లో వచ్చిన 'బీవీ హో తో ఐసీ' సినిమాలో చిన్న పాత్రలో నటించాడు సల్మాన్. కానీ హీరోగా 'మైనే ప్యార్ కియా'తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా హిందీలోనే కాకుండా ప్రాంతీయ భాషల్లోనూ విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. 'ప్రేమ పావురాలు' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మధుర కావ్యంగా మిగిలిపోయింది.
"నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. నటుడి జీవితంలో అతి ముఖ్యమైంది అతని ప్రస్థానం. నా మజిలీ అద్భుతంగా సాగింది." - సల్మాన్ ఖాన్, బాలీవుడ్ హీరో
సల్మాన్ ఖాన్ సినీ ప్రస్థానం రెండు దశలుగా సాగిందని చెప్పొచ్చు. కెరీర్ ఆరంభంలో ప్రేమ కథా చిత్రాలకే ప్రాధాన్యమిచ్చిన భాయ్.. అనంతరం కుటుంబ, థ్రిల్లర్ ప్రధానంగా సాగిన సినిమాలు చేశాడు. సూరజ్ బరజాత్య దర్శకత్వంలో వచ్చిన సాజన్, హమ్ ఆప్ కే హే కౌన్, ఖామోషి: ద మ్యూజికల్, ప్యార్ కియాతో డర్నా క్యా లాంటి సినిమాలు ఈ కోవకు చెందినవే.