Alluarjun cried: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. 'పుష్ప' థాంక్స్ మీట్లో దర్శకుడు సుకుమార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కంటతడి పెట్టారు. సుకుమార్ లేకుంటే తాను లేనని ఉద్వేగంగా మాట్లాడారు. బన్నీ మాటలతో దర్శకుడు సుకుమార్ కూడా ఉద్వేగానికి లోనయ్యారు.
"సుకుమార్ గారి గురించి నేను ఎక్కువ చెప్పలేను. ఆయన కూడా నా గురించి ఎక్కువ చెప్పలేరు. ఎందుకంటే మన వ్యక్తిగత విషయాలను పబ్లిక్‌తో పంచుకోలేం. సుకుమార్ నాకు అంత సన్నిహితమైన వ్యక్తి. సుకుమార్ అంటే ఏంటో ప్రపంచానికి తెలియాలి. సుకుమార్ ఉంటే నా లైఫ్ ఒకలా ఉంది. లేకపోతే వేరేలా ఉండేది. ప్రతి మనిషికీ 18-19ఏళ్ల వయసులో జీవితంలో ఏం అవ్వాలన్న సందిగ్ధత ఉంటుంది. వారు ఎంచుకునే కెరీర్ బట్టి అది ముందుకు వెళ్తుంది. నేను సినిమాలు చేద్దామనుకున్నప్పుడు సుకుమార్‌తో చేయడం వల్ల లైఫ్ ఇలా వచ్చింది. మరొకరితో చేస్తే ఇంకెలా ఉండేదో. ఒకటైతే చెప్పగలను ఐకాన్‌స్టార్ వరకూ రాగలిగాను అంటే దానికి కారణం సుకుమార్‌గారు. ఆరోజుకు అది వన్ డిగ్రీ కాన్సెప్ట్. ఇది ఎలా పనిచేస్తుందంటే షిప్ వెళ్లేటప్పుడు ఒక డిగ్రీ పక్కకు జరిగితే వెళ్లాల్సిన చోటుకు కాకుండా పక్క ఖండానికి వెళ్లిపోతుంది. నా జీవితానికి సుకుమార్ ఆ చిన్న డిగ్రీ. ‘నేను మీకు రుణపడి ఉన్నా’ అనే మాట నా జీవితంలో చాలా తక్కువ మందికి మాత్రమే వాడగలను. నా తల్లిదండ్రులు, మా తాతయ్య, మా చిరంజీవిగారికి, ఆ తర్వాత సుకుమార్‌కు మాత్రమే. 'ఆర్య' అయిపోయి నాలుగైదేళ్లు అయిన తర్వాత నేను ఒక కారు కొనుకున్నా. దాని ఖరీదు రూ.85లక్షలు. ఒక రోజు ఆ కారు స్టీరింగ్‌పై చేయి పెట్టి ‘ఇంతదూరం వచ్చానంటే ఎవరెవరు కారణమై ఉంటారా’ అని ఆలోచిస్తు్న్నా. నా మైండ్‌లో తట్టిన మొదటి వ్యక్తి సుకుమార్‌గారు. 'డార్లింగ్ నువ్వు లేకపోతే నేను లేను. ఆర్య లేదు ఇంకేమీ లేదు' (కన్నీళ్లు తుడచుకుంటూ..) పబ్లిక్‌లో భావోద్వేగానికి లోనవ్వకూడదు అనుకుంటాను కానీ, కుదరడం లేదు. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ చేసి, యావత్ భారతదేశం చూసేలా చేశారంటే నా కెరీర్‌కు సుకుమార్ ఎంత కంట్రిబ్యూషన్ ఇచ్చారో మాటల్లో చెప్పలేను" అని బన్నీ భావోద్వేగంతో మాట్లాడారు.