తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Pushpa Movie: 'పుష్ప చిత్రీకరణ ఓ గొప్ప అనుభవం' - అల్లుఅర్జున్​ పుష్ప సినిమా రిలీజ్​ డేట్​

Alluarjun Pushpa Movie: సుకుమార్​ దర్శకత్వంలో అల్లు అర్జున్​ హీరోగా తెరకెక్కిన 'పుష్ప' సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఈ చిత్ర నిర్మాతలు. ప్రపంచవ్యాప్తంగా 3 వేలకిపైగా థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ ఆరంభం నుంచి చివరి వరకు ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు.

పుష్ప సినిమా రిలీజ్​ డేట్​, pushpa movie release date
పుష్ప సినిమా రిలీజ్​ డేట్​

By

Published : Dec 11, 2021, 8:02 AM IST

Alluarjun Pushpa Movie: "మంచి కథ ఇస్తే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చూసేందుకు సిద్ధంగా ఉన్నారని ఈమధ్య విడుదలైన సినిమాలు రుజువు చేశాయి. తమిళనాడులో 'డాక్టర్‌'తోపాటు, రజనీకాంత్‌ 'అన్నాత్తే' మంచి వసూళ్లు సాధించాయి. హిందీలో 'సూర్యవంశీ' ఘన విజయం సాధించింది. ‘పుష్ప’లోనూ అందరికీ నచ్చే అంశాలున్నాయి కాబట్టి అందరూ ఆస్వాదిస్తారనే నమ్మకం మాకు ఉంది" అన్నారు ప్రముఖ నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై వరుసగా అగ్ర కథానాయకులతో సినిమాలు రూపొందిస్తున్న నిర్మాతలు వారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా... ముత్తం శెట్టి మీడియాతో కలిసి ఇటీవల 'పుష్ప' నిర్మించారు. సుకుమార్‌ దర్శకత్వం వహించగా, అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటించారు. ఈ నెల 17న పాన్‌ ఇండియా స్థాయిలో చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్‌ సీఈఓ చెర్రీతో కలిసి నిర్మాతలు శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

"ప్రపంచవ్యాప్తంగా 3 వేలకిపైగా థియేటర్లలో 'పుష్ప' సినిమాను విడుదల చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోనే వెయ్యికి పైగా థియేటర్లలో విడుదలవుతోంది. 16వ తేదీ సాయంత్రం నుంచే విదేశాల్లో ప్రీమియర్‌ షోలు మొదలవుతాయి. కచ్చితంగా విజయవంతం అవుతుందీ చిత్రం. మేం చాలా నమ్మకంగా ఉన్నాం. ఒక అరుదైన కథతో ఈ చిత్రం రూపొందింది. మొత్తం 2 గంటల 59 నిమిషాల నిడివి ఉంటుంది. ఆరంభం నుంచి చివరి వరకు రేసీగా ఉంటుంది. ఒక్క ఐదు నిమిషాలూ నిదానంగా సాగుతున్నట్టు అనిపించదు. పాటలన్నీ చక్కటి ఆదరణ పొందాయి. దేవిశ్రీప్రసాద్‌ ఎప్పుడూ మాకు మంచి సంగీతాన్నిస్తారు. ఈసారి ఇంకా చాలా బాగా వచ్చాయి. ఇటీవల కాలంలో అన్ని పాటలూ విజయవంతం కావడం అరుదు. ఈ సినిమా పాటలన్నీ ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ప్రత్యేక గీతం మరో స్థాయిలో ఉంది. పాన్‌ ఇండియా స్థాయి సినిమాలు చేయాలని ప్రతీ నిర్మాత కనే కల. అలాంటి కథ దొరకడం వల్ల ఆ స్థాయిలో రూపొందించాం".

"రంగస్థలం సినిమాలో రామ్‌చరణ్‌ను చూశాక ప్రేక్షకులు ఎంతగా ఆశ్చర్యపోయారో... 'పుష్ప'లో అల్లు అర్జున్‌ను చూశాక అలాంటి అనుభూతికే గురవుతారు. ఈ సినిమా ఎంతటి విజయం సాధిస్తుందో, అంత కంటే ఎక్కువ పేరు అల్లు అర్జున్‌కు వస్తుంది. ఆయన పడిన కష్టం, పక్కాగా యాస పలికిన విధానానికి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కుతాయి. మనుషులు వెళ్లలేని క్లిష్టమైన ప్రదేశాల్లోకి వెళ్లి చిత్రీకరణ చేయడం ఓ గొప్ప అనుభవం. మారేడుమిల్లిలో అటవీశాఖ అధికారులు మేం వెళ్లిన లొకేషన్లను వీడియోలుగా చిత్రీకరించి ఇవ్వమని చెప్పారు. అడవుల్లోకి వెళ్లడానికే రెండు గంటల సమయం పడుతుంది. అక్కడ మేకప్‌ కోసం రెండు గంటలు పడుతుంది. చిత్రీకరణ తర్వాత మేకప్‌ తీయడానికి ఒక గంట పడుతుంది. అలా రోజుకి ఆరేడు గంటలు అదనంగా కష్టపడుతూ చిత్రీకరణలో పాల్గొన్నారు అల్లు అర్జున్‌. ఇప్పటిదాకా ఆయన ఇలాంటి సినిమా చేయలేదు. ఒక ఏడాది కాలంగా ఆయన ఈ పాత్రలోనే ఉన్నారు. ఇప్పటికే యాభై మందికి పైగా సినిమా చూశారు ప్రతి ఒక్కరూ చాలా బాగుందని చెప్పడం సహా, అల్లు అర్జున్‌ నటనను ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు. రష్మిక, అనసూయతోపాటు ప్రతి ఒక్కరికీ ఓ కథ ఉంటుంది. ప్రతీ పాత్ర ప్రేక్షకులపై ప్రభావం చూపిస్తుంది. లాక్‌డౌన్‌ సమయంలో బీ, సీ కేంద్రాల్లోనూ ఫహాద్‌ ఫాజిల్‌ నటనా ప్రతిభ గురించి తెలిసింది. అందుకే ఆయన్ని ప్రతినాయక పాత్ర కోసం ఎంపిక చేశాం. ఆయన నటన చాలా బాగుంటుంది".

"సుకుమార్‌ పక్కా మాస్‌ కథతో ఈ సినిమా తీసినా... ఆయనదైన క్లాస్‌ టచ్‌ తప్పకుండా ఉంటుంది. కుటుంబమంతా కలిసి చూసే అంశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి భాషలోనూ ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం నేపథ్యంలో సాగే కథ అన్నట్టుగానే చూపించాం. యాక్షన్‌ ఘట్టాలన్నీ చాలా సహజంగా, కథకు తగ్గట్టుగా ఉంటాయి. బడ్జెట్‌ కొంచెం ఎక్కువే అయ్యింది, ఈ సినిమాకు క్రేజ్‌ అలాగే వచ్చింది కాబట్టి పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువే తిరిగొస్తుందని నమ్ముతున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన టికెట్‌ ధరల ప్రభావం తప్పకుండా వసూళ్లపై పడుతుంది. కానీ అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి, అన్ని సినిమాలకు వర్తించిన నిబంధనలే మాకూ వర్తిస్తాయి. 'పుష్ప' రెండో భాగం ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టనున్నాం. తెలుగులో ఇప్పుడు తీస్తున్న సినిమాలతోపాటు బాలీవుడ్‌లోనూ సినిమాల్ని నిర్మించే ఆలోచన ఉంది’"

ఉ అంటావా.. ఉ ఊ అంటావా...

సుకుమార్‌ - దేవిశ్రీప్రసాద్‌ కలయికలో సినిమా అంటే అందులో అదిరిపోయే ప్రత్యేక గీతం ఖాయం. ఆ పాట కొన్నాళ్లపాటు శ్రోతల చెవుల్లో మార్మోగిపోవల్సిందే. 'పుష్ప' కోసం 'ఉ అంటావా... ఉ ఊ అంటావా' అంటూ అలాంటి ఓ పాటను సిద్ధం చేశారు. అగ్ర కథానాయిక సమంతపై తెరకెక్కించిన ఆ గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు. ఇంద్రావతి చౌహాన్‌ ఆలపించిన ఆ గీతాన్ని చంద్రబోస్‌ రచించారు.

ఇదీ చూడండి: 'పుష్ప' స్పెషల్ సాంగ్.. సమంత రచ్చరచ్చ ​

ABOUT THE AUTHOR

...view details