స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్-వేణు శ్రీరామ్ కాంబినేషన్లో 'ఐకాన్' అనే చిత్రం రూపొందనుందని గతంలోనే ప్రకటన వచ్చింది. 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' సినిమా తర్వాత ఈ సినిమా పట్టాలెక్కుతుందని అప్పట్లో అందరూ భావించారు. కానీ, అంతలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురంలో' చిత్రంతో బ్లాక్బాస్టర్ అందుకున్నాడు బన్నీ. ఆ తర్వాత అయినా 'ఐకాన్' ప్రారంభిస్తారని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది.
ఈ నేపథ్యంలో ఒకవైపు సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప'లో అల్లు అర్జున్ నటిస్తుండగా.. మరోవైపు దర్శకుడు వేణు శ్రీరామ్ 'వకీల్‌సాబ్' చిత్రంతో బిజీగా ఉన్నారు. దీంతో 'ఐకాన్' సినిమాను మర్చిపోవాల్సిందే అనుకున్నారంతా! కానీ, ఈ ప్రాజెక్టుపై దర్శకుడు వేణు తాజాగా స్పందించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌ను ప్రారంభించనున్నట్లు 'వకీల్‌సాబ్' ప్రమోషన్స్‌లో స్పష్టం చేశారు.