చిత్రం: పుష్ప: ది రైజ్
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్, సునీల్, ధనుంజయ, అనసూయ, రావు రమేశ్, అజయ్, అజయ్‌ఘోష్ తదితరులు
సంగీతం:దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాసన్, రుబెన్
సినిమాటోగ్రఫీ: మిరోస్లా కూబా బ్రొజెక్
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా
నిర్మాత:నవీన్ యెర్నేని, వై.రవి శంకర్
రచన, దర్శకత్వం: సుకుమార్; విడుదల: 17-12-2021
అల్లు అర్జున్(Allu arjun)-సుకుమార్(sukumar) కాంబినేషన్‌లో వచ్చిన 'ఆర్య', 'ఆర్య-2' చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. దాదాపు 12ఏళ్ల తర్వాత ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ మూవీ ప్రకటించగానే అందరిలోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక బన్నీని ఊరమాస్ లుక్‌లో 'పుష్ప'(Pushpa)గా పరిచయం చేసిన తర్వాత ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా నటించటం, రష్మిక(Rashmika) డీగ్లామర్ పాత్ర చేయటం, సునీల్, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకులుగా నటిస్తుండటం ఆసక్తిని కలిగించింది. మరి ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'పుష్ప' ఎలా ఉంది?(Pushpa Movie review) పుష్పరాజ్‌గా మాస్ లుక్‌లో అల్లు అర్జున్ ఎలా నటించారు? అసలు ఈ సినిమా కథేంటి?
కథేంటంటే: పుష్పరాజ్(అల్లు అర్జున్) కూలీగా కట్టెల దుకాణంలో పనిచేస్తుంటాడు. అయితే, అతడి పుట్టుకకు సంబంధించిన విషయంలో సమాజంలో అవమానాలే ఎదుర్కొంటూ ఉంటాడు. ఇదే జీవితంలో ఎదగాలన్న కాంక్ష అతడిలో రగిలిస్తుంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను కొట్టి ఇతర దేశాలకు ఎగుమతి చేసే సిండికేట్‌కు మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటాడు కొండారెడ్డి(అజయ్ ఘోష్). ఈ విషయం తెలుసుకున్న పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే డబ్బులు బాగా వస్తాయని ఆ సిండికేట్ తరఫున కూలీగా అడవుల్లోకి వెళతాడు. ఒక కూలీగా ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో అడుగు పెట్టిన పుష్పరాజ్ ఆ సిండికేట్‌కు నాయకుడుగా ఎలా ఎదిగాడు? స్మగ్లింగ్ చేసే ఎర్రచందనం పోలీసులకు చిక్కకుండా పుష్పరాజ్ ఎలా తరలించాడు? ఈ క్రమంలో అడ్డు వచ్చిన మంగళం శ్రీను(సునీల్), కొండారెడ్డిలను ఎలా ఎదిరించాడు? పోలీసు ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్(ఫహద్ ఫాజిల్) నుంచి పుష్పరాజ్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి? శ్రీవల్లి(రష్మిక) ప్రేమను ఎలా పొందాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే:ఇప్పటి వరకూ వివిధ మాఫియాల నేపథ్యంలో వందల కథలను దర్శకులు వెండితెరపై చూపించారు. హవాలా, డ్రగ్స్, ఆయుధాలు ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతిదీ ఒక సబ్జెక్ట్ అవుతుంది. 'పుష్ప' కోసం దర్శకుడు సుకుమార్ 'ఎర్రచందనం' స్మగ్లింగ్ నేపథ్యాన్ని, మాస్‌లో మంచి క్రేజ్ ఉన్న అల్లు అర్జున్ కథానాయకుడిగా ఎంచుకున్నాడు. ఈ పాయింటే ‘పుష్ప’పై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. అందుకు తగినట్లుగానే ప్రేక్షకులను మెప్పించేలా కథ, కథనాలను తీర్చిదిద్దడంలో సుకుమార్ కొంతవరకూ సఫలమయ్యాడు. మాస్ ప్రేక్షకులు మెచ్చేలా పుష్పరాజ్‌ను పరిచయం చేయడం, ఎర్రచందనం రవాణా, సిండికేట్ తదితర వ్యవహారాలతో కథను ప్రారంభించిన దర్శకుడు ఆసక్తి కలిగించేలా ఆయా సన్నివేశాలను గ్రాండ్ లుక్‌తో తెరపై చూపించాడు. ప్రతి సన్నివేశం కథానాయకుడి పాత్రను ఎలివేట్ చేసేలా తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా బన్ని అభిమానులకు కనులపండుగగా ఉంటుంది. ఒకవైపు పుష్పరాజ్ ప్రయాణాన్ని చూపిస్తూనే, మరోవైపు సిండికేట్ వెనుక ఉన్న అసలు పాత్రలను పరిచయం చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచాడు దర్శకుడు. పుష్పరాజ్ కూలీ నుంచి సిండికేట్ నాయకుడిగా అడుగులు వేయడానికి దోహద పడేందుకు అవసరమైన బలమైన సన్నివేశాలు తెరపై చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. విరామం ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. దీంతో ‘పుష్ప’ పాత్ర పతాక స్థాయికి వెళ్లిపోతుంది.
ఎర్రచందనం సిండికేట్ నుంచి వచ్చే పోటీని పుష్పరాజ్ ఎలా ఎదుర్కొంటాడన్న ఆసక్తితో ద్వితీయార్ధం చూడటం మొదలు పెట్టిన ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతుంది. తెరపై సన్నివేశాలు వస్తున్నా, కథ ముందుకు నడవదు. మధ్యలో శ్రీవల్లి ప్రేమ ప్రయాణం, పాటలు బాగున్నా, ఒక సీరియస్ మోడ్‌లో సాగుతున్న కథకు చిన్న చిన్న బ్రేక్‌లు వేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ క్రమంలోనే పోలీస్ ఆఫీసర్ భన్వర్‌సింగ్ షెకావత్‌గా ఫహద్ ఫాజిల్ పాత్ర పరిచయంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఇక్కడి నుంచి పుష్పరాజ్- భన్వర్ సింగ్‌ల మధ్య పోటాపోటీ ఉంటుందని ఆశించినా ఆయా సన్నివేశాలన్నీ సాదాసీదాగా సాగుతుంటాయి. ఒక బలమైన ముగింపుతో తొలి పార్ట్ ముగుస్తుందని ఆశించిన ప్రేక్షకుడు పూర్తి సంతృప్తి చెందడు. పార్ట్-2 కోసం చాలా విషయాలను ప్రశ్నార్థంగానే వదిలేసినట్లు అర్థమవుతుంది. ఎందుకంటే మరో భాగం రావడానికి ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రేక్షకుడి మదిని తొలిచేసే ప్రశ్నతో ముగించి ఉంటే ఇంకాస్త బాగుండేది. అలాగే దాక్షాయణి(అనసూయ), మంగళం శ్రీను(సునీల్), భన్వర్ సింగ్ షెకావత్‌లను మాత్రమే పుష్పరాజ్ ఎదుర్కొంటాడా? లేక ఇంకేవైనా కొత్త పాత్రలు వస్తాయా? ‘పుష్ప: ది రూల్’లో చూడాల్సి ఉంటుంది.