Rowdy Boys song: "డిసెంబర్‌లో విడుదలైన తెలుగు సినిమాలు విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి. సంక్రాంతికీ చాలా సినిమాలు వస్తున్నాయి. అదీ ఇదీ అని కాదు.. సినిమా గెలవాల్సిన సమయమిది" అన్నారు ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన 'రౌడీబాయ్స్' డేట్ నైట్ పాట విడుదల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. దిల్‌రాజు - శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు.
సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా వేడుకని ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడారు. "నా జీవితంలో దిల్‌రాజు ఓ ముఖ్యమైన భాగం. 'ఆర్య' లేకపోతే నేను లేను. దిల్‌రాజు లేకపోతే 'ఆర్య' లేదు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఆశిష్‌ని చూశా. హర్షిత్, హన్షిత నిర్మాతలుగా, ఆశిష్ హీరోగా ఎదగడం ఎంతో ఆనందంగా ఉంది" అన్నారు.