"ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు. కానీ, నాకు ఆర్మీ ఉంది. అభిమానులు, నా పిల్లల వల్లే ఇంత గ్యాప్ తీసుకున్నా అస్సలు బోరు కొట్టకుండా ఉన్నాను" అన్నాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ కథానాయకుడిగా నటించిన చిత్రం 'అల వైకుంఠపురములో'. పూజా హెగ్డే కథానాయిక. టబు కీలక పాత్ర పోషించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర మ్యూజికల్ నైట్ జరిగింది.
"అందరూ గ్యాప్ వచ్చిందని అడుగుతున్నారు. 'సరైనోడు', 'డీజే', 'నా పేరు సూర్య..' ఈ మూడు సినిమాలు అయిన తర్వాత నాకు ఒక కోరిక కల్గింది. ఒక సరదా సినిమా చేయాలన్న ఉద్దేశంతో చాలా రోజులు వెయిట్ చేశా. చాలా కథలు విన్నా ఏవీ నచ్చలేదు. అలాంటి కథ సెట్ కావడానికి త్రివిక్రమ్‌గారి ప్రాజెక్టులు పూర్తవడానికి ఇంత సమయం పట్టింది. అందుకే ఇంత గ్యాప్. రిలీజ్‌లో గ్యాప్ ఉంటుంది కానీ, సెలబ్రేషన్‌లో గ్యాప్ ఉండదు."
"ఈ ఖాళీ సమయంలో నేను నా భార్యతో కలిసి మ్యూజిక్ బ్యాండ్‌లకు వెళ్లడం వల్లే పాటలో అందరూ కనిపించాలని నేను అనుకున్నా. 'సామజవరగమన' ఇంత సెన్సేషన్ అవుతుందని నేను అనుకోలేదు. "ఎక్కడకి వెళ్లినా ఈ పాటే పాడుతున్నారు. విసుగు వచ్చేస్తోంది" అని నా భార్య అంది. ప్రపంచం ముందు హీరో అవడం కన్నా, భార్య ముందు హీరో అయితే, ఆ ఆనందమే వేరు. ఈ సినిమాలో పాట రాసిన ప్రతి రచయిత, పాడిన గాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. తమన్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడు. ఈ సినిమాలోని పాటలతో ఆయనకు ఒక గౌరవం వచ్చింది. పీఎస్ వినోద్‌గారు నన్ను చాలా అందంగా చూపించారు. మురళీ శర్మగారు, జయరామ్‌గారు చాలా చక్కగా నటించారు. సునీల్, సుశాంత్, నవదీప్, రాహుల్ రామకృష్ణల పాత్రలు ప్రత్యేకంగా అలరిస్తాయి. 'రాములో రాములా' పాట చూసి మా అమ్మాయి దోశ స్టెప్ వేశానంది(నవ్వులు). దేన్నైనా సృష్టించే శక్తి ఇద్దరికే ఉంది. ఒకటి నేలకు.. ఇంకొకటి వాళ్లకి(ఆడవాళ్లు) అన్నట్లు మనం మహిళలను గౌరవించాలి. పూజాహెగ్డే, నివేదా పేతురాజు చాలా చక్కగా నటించారు. టబుగారు నాకు మంచి స్నేహితురాలు. ఆవిడ చాలా మంచి ఆర్టిస్ట్."