జనసేన అభిమానుల మృతి పట్ల హీరోలు అల్లు అర్జున్, రామ్‌చరణ్‌లు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తమ వంతు సాయంగా మృతుల కుటుంబాలకు అల్లుఅర్జున్ చెరో రూ.2 లక్షలు, రామ్‌చరణ్ చెరో రూ.2.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు.
"నిన్న కుప్పంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు అభిమానులు మృతి చెందారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మీ ఆరోగ్యం, మీ ప్రాణంకంటే ఏదీ విలువైనది కాదు. మీరంతా ఇది ఎప్పుడూ గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని నా మనవి. ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా"
- రామ్ చరణ్, కథానాయకుడు
'వకీల్‌సాబ్' బృందం ఆర్థిక సాయం..
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పంలోని అభిమానులు ఫ్లెక్సీ కడుతున్న సమయంలో విద్యుదాఘాతం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రాజేంద్ర (31), సోమశేఖర్ (29), అరుణాచలం (20) మృతి చెందారు. వారి మృతి పట్ల 'వకీల్‌సాబ్' చిత్ర బృందం సంతాపం తెలిపింది. మృతి చెందిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.2లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు ట్వీట్ చేసింది. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. అభిమానులంతా తమ జీవితాలపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
పవన్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వకీల్‌సాబ్'. బుధవారం పవన్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. హిందీలో ఘన విజయం సాధించిన 'పింక్' రీమేక్ ఈ సినిమా.