గంగోత్రితో పరిచయమయ్యాడు...ఫీల్ మై లవ్ అంటూ పలకరించాడు... బన్నీ బన్నీ అంటూ భేష్ అనిపించాడు... దేశముదురుతో దుమ్మురేపాడు... పరుగుతో పరుగులెత్తించాడు... జులాయితో జూలు విదిల్చాడు... మలయాళ ప్రేక్షకులకు మల్లూ అర్జున్‌గా మారాడు.. అల్లు అర్జున్. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలు చూద్దాం!
- బ్యాక్ గ్రౌండ్..
అల్లు అర్జున్ 1983 ఏప్రిల్ 8న చెన్నైలో జన్మించాడు. పద్దెనిమిదేళ్ల వరకు చెన్నైలోనే పెరిగిన అల్లు అర్జున్ పద్మ శేషాద్రి పాఠశాలలో చదువుకున్నాడు. చిన్నప్పట్నుంచే డ్యాన్స్‌పై మక్కువ ఏర్పడింది. ఓ పక్క డ్యాన్స్ నేర్చుకుంటూనే పియానో, జిమ్నాస్టిక్స్ కూడా నేర్చుకున్నాడు. తండ్రి అల్లు అరవింద్ పెద్ద నిర్మాతైనా... మేనమామ చిరంజీవి అగ్రనటుడైనప్పటికీ.. సినీఇండస్ట్రీలోతనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
- సినీ ప్రస్థానం..
చిరంజీవి నటించిన 'విజేత' సినిమాలోచిన్నవయసులోనే తొలిసారి నటించాడు అల్లు అర్జున్. 'స్వాతి ముత్యం' లోనూ కమల్‌హాసన్ మనుమడిగా కనిపించాడు. అనంతరం 'డాడీ' చిత్రంలో అతిథి పాత్రలో అలరించాడు. గంగోత్రితో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు. తర్వాత సుకుమార్ తెరకెక్కించిన ఆర్యతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. బన్ని, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య 2, వేదం, జులాయి, రేసుగుర్రం, రుద్రమదేవి, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు లాంటి విజయాలను అందుకున్నాడు.