"థియేటర్లకి వస్తారా? రారా? అనే సందేహంలో మేముంటే.. మీరు సినిమాలు చేయండి, మేం వస్తామని భరోసా ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా జీవితంలో ఏదైనా సంపాదించుకున్నానంటే అది ప్రేక్షకుల అభిమానమే" అన్నారు ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన 'చావు కబురు చల్లగా' ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా.. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. జీఏ2 పతాకంపై బన్నీ వాస్ నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ నెల 19న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ వేడుకని ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడారు.
"నేనీ సినిమా చూశా, చాలా బాగుంది. ప్రేక్షకులకూ నచ్చుతుందని కచ్చితంగా చెబుతా. ఈ చిత్ర దర్శకుడు కౌశిక్ గురించి తెలుసుకుని షాక్ అయ్యా. 26 ఏళ్ల వయసులో ఇలాంటి ఫిలాసఫీ చెప్పగలిగే దర్శకులు ఉన్నారా? అనిపించింది. కార్తికేయ చేసిన బస్తీ బాలరాజు పాత్ర ప్రేక్షకుల హృదయాలకి హత్తుకుంటుంది. లావణ్య చాలా బాగా నటించింది. ఆమని ఓ గొప్ప పాత్ర చేశారు" అన్నారు. అలాగే తాను నటిస్తున్న పుష్పని ప్రస్తావిస్తూ.. "పుష్ప.. తగ్గేదే ల్యా" అంటూ డైలాగ్ చెప్పారు బన్నీ.