'ఆర్య'.. టాలీవుడ్ టాప్-10 లవ్‌స్టోరీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. సరికొత్త పంథాలో సాగిపోయే ఈ సినిమా కథ చూశాక ప్రతి ప్రేక్షకుడు 'ఫీల్ మై లవ్' అంటూ థియేటర్ల నుంచి బయటి వచ్చాడంటే అతిశయోక్తి కాదు. లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకుడిగా పరిచయమైన చిత్రమిది. అలాగే 'గంగోత్రి' తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన రెండో మూవీ. వీరిద్దరి కాంబో గురించి ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు అంటే అందుకు కారణం 'ఆర్య'. ఈ సినిమా నేటితో 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం.
ప్రేమ, ద్వేషం.. ఓ ఆర్య
సాధారణంగా ప్రేమ కథలు హీరో, హీరోయిన్ను చూడటం, ఆమె వెంట పడటం, ఐ లవ్ యూ చెప్పడం, తర్వాత ఆ ప్రేమను కాపాడుకోవడం వంటి పంథాలో సాగుతాయి. కానీ 'ఆర్య' ఈ రొటీన్ ఫార్ములాను పక్కకునెట్టి సరికొత్త పంథాలో సాగుతుంది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇందులో హీరోయిన్ గీత (అనురాధా మెహతా) మొదట అజయ్ (శివ బాలాజీ) అనే వ్యక్తికి ఐ లవ్ యూ చెప్తుంది (బిల్డింగ్‌పై నుంచి దూకేస్తా అని బెదిరిస్తే). కానీ అదే సమయంలో కథానాయికను చూసిన ఆర్య (అల్లు అర్జున్).. ఓ పువ్వు తీసుకెళ్లి ఆమె చేతిలో పెట్టి ఐ లవ్ యూ అంటాడు. వినడానికి కాస్త కొత్తగా అనిపిస్తుంది కదా. ఇదే 'ఆర్య'ను ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు పెట్టువకోడానికి కారణం. ఇందులో అజయ్, గీతల మధ్య ప్రేమను, ఆర్య, గీతల మధ్య ప్రేమను విభిన్న కోణాల్లో చూపించారు దర్శకుడు సుకుమార్. ముఖ్యంగా ఆర్యను గీత ద్వేషించడం, దాన్ని ఆర్య మనస్ఫూర్తిగా స్వీకరించడం కూడా భలేగా ఉంటుంది. ఈ ముగ్గురి మధ్య ఓ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ క్రియేట్ చేసి దానిలో నిజమైన ప్రేమ ఇదే అంటూ కథను నడిపించే ప్రయత్నం మెప్పిస్తుంది.
అందరి పాత్రలూ గుర్తుంటాయి
ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్‌కు ఎన్ని మార్కులు పడ్డాయో శివ బాలాజీ, అనురాధాలకు అంతే పేరు వచ్చింది. వీరు ముగ్గురు సినిమాకు ప్రధాన బలం. శివబాలాజీ తండ్రి పాత్ర పోషించిన రాజన్ పీ దేవ్ పాత్ర కూడా చాలా బాగా తీర్చిదిద్దారు. ఆయన గంభీరత్వం తెరపై కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అలాగే అజయ్ స్నేహితుడిగా వేణు మాధవ్ కామెడీ నవ్విస్తుంది.