Pushpa Movie: బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నా.. కోలీవుడ్‌లో విజయం అందుకోవడమే తన కల అని అల్లు అర్జున్(Allu arjun) అన్నారు. 'పుష్ప'(Pushpa) టీమ్ చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొని ఆయన మాట్లాడారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రమిది. రష్మిక కథానాయిక. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబరు 17న విడుదలకానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. తమిళ ప్రేక్షకులు, హీరోల గురించి అల్లు అర్జున్ ఏమన్నారంటే..
ఆయన గురించి తర్వాత చెప్తా..
"'అల వైకుంఠపురములో' సినిమా పూర్తయ్యాక 'పుష్ప' మొదలుపెట్టా. 45 రోజుల్లో పుష్పరాజ్‌గా మారా. ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డా. మేకప్ వేసుకునేందుకు 2 గంటలు, దాన్ని తీసేందుకు 40 నిమిషాల సమయం పట్టేది. ఫహద్ ఫాజిల్ నటన అద్భుతం. ఆయన పెర్ఫామెన్స్‌కి ఫిదా అయిపోయా. తన గురించి ఇంకా చాలా విశేషాలు కేరళ (మలయాళ భాషకు సంబంధించి) ప్రచారంలో పంచుకుంటా. కథానాయిక రష్మిక తన పాత్రతో మంచి ప్రభావం చూపిస్తుంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా"
ఎప్పటి నుంచో అనుకుంటున్నా..
"నా తెలుగు చిత్రాలు డబ్ అయి యూట్యూబ్ వేదికగా హిందీ ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తున్నాయి. నన్ను పరోక్షంగా బాలీవుడ్‌కి పరిచయం చేశాయి. అయినా నాకు మాత్రం ఇక్కడే (తమిళనాడు) గెలవాలనుంది. నా హోమ్ స్టేట్‌లో విజయం అందుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. పాటల వల్ల ఈ సినిమా కోలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇందుకు నా స్నేహితుడు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కి థ్యాంక్స్"