'అల్లరి'తో వెండితెరకు పరిచయమై.. కామెడీ కథా చిత్రాలతో ప్రేక్షకులకు కితకితలు పెట్టారు కథానాయకుడు నరేశ్. 'గమ్యం', 'మహర్షి' లాంటి విభిన్న కథా చిత్రాల తర్వాత అదే తరహా సీరియస్ కథాంశంతో ఆయన నటించిన సినిమా 'నాంది'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నరేశ్ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులోని కొన్ని విశేషాలు..
అలా 'నాంది' పడింది..
'అల్లరి'తో నా కెరీర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి కామెడీ సినిమాలపైనే ఫోకస్ చేశాను. అలా నా నుంచి ఎన్నో హాస్యప్రధాన చిత్రాలు వచ్చాయి. దర్శక, నిర్మాతలు కూడా అదే తరహా కథా చిత్రాలతోనే నా వద్దకు వచ్చేవారు. అలాంటి సమయంలో ఓసారి విజయ్ కనకమేడల 'నాంది' కథతో నా దగ్గరకు వచ్చారు. ఈ కథకు నేను న్యాయం చేయగలనని నిర్మాతలు కూడా విశ్వసించారు. దాంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది.
నిరాశకు గురయ్యా..
''బంగారు బుల్లోడు' విడుదలపై నేను సానుకూలంగా లేననే చెప్పాలి. 2018లోనే ఆ సినిమా పట్టాలెక్కినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ సినిమా ఇటీవల విడుదలయ్యింది. మంచి టాక్‌ను సొంతం చేసుకోలేకపోవడం కొంచెం నిరాశకు గురిచేసింది.
ఎంపిక మారింది..
స్క్రిప్ట్‌ల ఎంపిక విషయంలో నా ఆలోచనా విధానం కొంతమేర మారింది. 'నాంది' సినిమా పట్టాలెక్కినప్పుడే.. ఇది సీరియస్ ఫిల్మ్ అని అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నాం. అదే విధంగా పోస్టర్లు, టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాం. ఈ సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందని నమ్ముతున్నాను.
శారీరకంగా కష్టపడ్డా..
లడ్డూబాబు'కు మేకప్ విషయంలో ఎంతో కష్టపడ్డా. దాదాపు ఐదు గంటలు మేకప్ కోసమే కేటాయించాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు 'నాంది' కోసం శారీరకంగా కష్టపడ్డాను. నేను తలకిందులుగా వేలాడుతున్నట్లు ఉన్న ఓ పోస్టర్ చూశారు కదా.. ఆ సీన్ షూట్ చేయడానికి ఆరు గంటలు పట్టింది.
గూగుల్ చేస్తారు..
మా సినిమాలో చట్టాల గురించి చూపించాం. ముఖ్యంగా ఓ సెక్షన్ గురించి చెప్పాం. కథ విన్నా తర్వాత ఆ సెక్షన్ గురించి గూగుల్ చేసి తెలుసుకున్నా. మా సినిమా విడుదలయ్యాక చాలామంది కూడా నాలాగే గూగుల్ చేసి ఆ సెక్షన్ గురించి తెలుసుకుంటారని అనుకుంటున్నా.