తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తెరపై అల్లరోడు కనపడితే 'అల్లరే అల్లరి'!

కామెడీకి కేరాఫ్ అడ్రస్​గా మారిన హీరో అల్లరి నరేష్. హాస్యబరిత చిత్రాలతో పాటు వైవిధ్యమైన పాత్రలూ చేస్తూ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే మహర్షి చిత్రంతో మెప్పించి మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. నేడు అల్లరి నరేష్ పుట్టినరోజు.

అల్లరి నరేష్

By

Published : Jun 30, 2019, 6:59 AM IST

Updated : Jun 30, 2019, 7:12 AM IST

అల్లరి నరేష్.. కామెడీకి పెట్టింది పేరు.. తన హాస్యంతో ప్రేక్షకులకు 'కితకితలు' పెట్టిస్తాడు.. తన 'అల్లరి'తో సందడి చేస్తాడు.. గాలి శీనుగా ఏడిపిస్తాడు.. మహర్షికి మిత్రుడిగా మురిపిస్తాడు.. కామెడీతోనే కాకుండా వైవిధ్యమైన పాత్రలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సుడిగాడు అల్లరినరేష్. నేడు అల్లరోడి పుట్టినరోజు సందర్భంగా అతడి సినీ జీవితంపై ఓ లుక్కేద్దాం!

బ్యాక్​గ్రౌండ్​..

జూన్ 30న చెన్నైలో జన్మించాడు నరేష్. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు రెండో కుమారుడు. చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమంలో చదువుకున్నాడు. అనంతరం అల్లరి సినిమాతో చిత్రసీమలో హీరోగా అడుగుపెట్టాడు. చెన్నైకు చెందిన విరూపను 2015లో వివాహం చేసుకున్నాడు.

డైరెక్టర్ కాబోయి యాక్టర్..

దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా చిత్ర సీమలో అడుగుపెట్టిన అల్లరి నరేష్ మొదట తండ్రిలా మెగాఫోన్ పట్టుకోవాలనుకున్నాడంట. అయితే రవిబాబు తెరకెక్కించిన అల్లరి చిత్రంలో అవకాశం రావడం వల్ల హీరో అయ్యాడు. ఆ సినిమా బంపర్ హిట్ అయింది. దీంతో నరేష్.. అల్లరి నరేష్​గా మారిపోయాడు. అక్కడ నుంచి వరుసపెట్టి సినిమాలు చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు.

కామెడీకి కేరాఫ్ అడ్రస్​..

ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తూ 16 ఏళ్ల సినీ ప్రస్థానంలో 50కు పైగా చిత్రాల్లో నటించాడు. తండ్రి ఈవీవీ సత్యనారాయణతో కలిసి నరేష్ తీసిన అన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అల్లరి, తొట్టిగ్యాంగ్, కితకితలు, అల్లరే అల్లరి, సీమశాస్త్రీ, బొమ్మనబ్రదర్స్ చందన సిస్టర్స్​, బ్లేడ్ బాబ్జీ, బెండు అప్పారావు ఆర్ఎమ్​పీ, కత్తికాంతారావు, బెట్టింగ్ బంగార్రాజు, సీమటపాకాయ్ లాంటి హాస్యబరిత చిత్రాలతో ఆకట్టుకున్నాడు. సుడిగాడు చిత్రంతో ఆ కామెడీ పతాక స్థాయికి చేరుకుంది.

విభిన్న పాత్రలతో నటుడిగా గుర్తింపు..

కామెడీ సినిమాలే కాకుండా వైవిధ్యబరిత చిత్రాలతో నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. అందులో నేను, డేంజర్, ప్రాణం, గమ్యం, శంభో శివ శంభో, లడ్డూబాబు లాంటి సినిమాలున్నాయి. అల్లరి రీమేక్​గా రూపొందిన కురంబు చిత్రంతో తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ‘గమ్యంలో చేసిన గాలిశీను పాత్రకిగానూ ఉత్తమ సహయ నటుడిగా నంది పురస్కారాన్ని, ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు.

మహర్షితో మరింత క్రేజ్​..

ఇటీవల మహర్షి చిత్రంలో మహేశ్ బాబు స్నేహితుడిగా నటించి ప్రేక్షకుల్లో తన క్రేజ్​ను మరింత పెంచుకున్నాడు అల్లరి నరేష్​.

హీరోగానే కాకుండా నిర్మాతగానూ మారాడు. తన తండ్రి పేరుతో స్థాపించిన ఈవీవీ సినిమా పతాకంలో సోదరుడు ఆర్యన్‌ రాజేష్‌తో కలిసి ‘బందిపోటు’ నిర్మించాడు.

Last Updated : Jun 30, 2019, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details