జూ.ఎన్టీఆర్ 'ఆది' సినిమాతో మాస్, కమర్షియల్ డైరెక్టర్‌గా వెండితెరకు పరిచయమయ్యారు వి.వి.వినాయక్. మొదటి చిత్రంతోనే ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్న ఆయన.. ఆ తర్వాత అగ్ర కథానాయకులతో ఎన్నో చిత్రాలు తీసి విజయాలను ఖాతాలో వేసుకున్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి ఇటీవలే విచ్చేసిన వినాయక్.. తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనకు వి.వి.వినాయక్ పేరు ఎలా వచ్చిందో చెప్పారు.
"నా పేరు వీర వెంకట వినాయకరావు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత వినయ్ అనేవాళ్లు. నేను డైరెక్టర్ అవుతున్న సమయంలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చాను. నా పేరు ఏది పెట్టాలో అర్థం కాలేదు. వినాయకరావు అంటే బాగోదు. అప్పటికే దర్శకుడు వినయ్ అని ఉన్నారు. అప్పుడే తట్టింది వి.వి.వినాయక్ అని పెట్టమని చెప్పాను. అలా ఈ పేరు వచ్చింది"
- వి.వి.వినాయక్, దర్శకుడు
ఇలా తన పేరు మార్చుకుని దర్శకుడిగా మారిన తర్వాత ఓ హాస్యాస్పద సంఘటన జరిగిందని వి.వి.వినాయక్ తెలిపారు. "ఆది' సినిమా విడుదలైన తర్వాత కూడా చాలామందికి నా పేరు తెలియదు. 'చెన్నకేశవ రెడ్డి' చిత్రం కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో సెట్ పని చూడ్డానికి కారు వేసుకుని వెళ్లాను. అప్పట్లో మేనేజర్ నాగేశ్వరరావు ఉండేవారు. అప్పుడు నన్ను చూసిన ఆయన.. 'ఏంటయ్యా.. కో-డైరెక్టర్ అయిపోయావా ఏంటి?' అని అడిగాడు. ఆ పక్కనే నిర్మాత త్రివిక్రమరావు గారు నిర్మిస్తున్న 'బద్రి' షూటింగ్ జరుగుతుంది. త్రివిక్రమరావు గారు నన్ను చూసి..'నమస్తే డైరెక్టర్ గారూ..' అన్నారు. ఆ మాట వినగానే మేనేజర్ నాగేశ్వరరావు షాక్ అయ్యారు. త్రివిక్రమరావు ఇతడికి ఇంత గౌరవం ఇస్తున్నాడేంటని అనుకుని నాగేశ్వరరావు నన్ను అడిగారు. 'నేను డైరెక్టర్ అయ్యాను' అని చెప్పా. 'ఏ సినిమా..' అంటే 'ఆది' అని చెప్పాను. 'వి.వి.వినాయక్ అంటే నువ్వా?' అని ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు" అని 'ఆలీతో సరదాగా' షోలో వినాయక్ వెల్లడించారు.