ప్రస్తుతం టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూకుడు చూపిస్తున్న కమెడియన్లలో ప్రియదర్శి ఒకరు. 'పెళ్లిచూపులు' సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం 'స్పైడర్', 'జై లవకుశ', 'ఉన్నది ఒకటే జిందగీ', 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సహా పలు చిత్రాల్లో తనదైన కామెడీ టైమింగ్తో అభిమానులకు మరింత చేరువయ్యారు. ఇటీవల 'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఓ గమ్మత్తైన విషయాన్ని పంచుకున్నారు. తన చిన్నప్పుడు తండ్రి ఏటీఎం కార్డును దొంగలించి తరచుగా అందులో నుంచి డబ్బులు డ్రా చేసుకునేవాడినని చెప్పారు.
చిన్నప్పుడే దొంగతనం చేశా: ప్రియదర్శి
'పెళ్లిచూపులు' ఫేం ప్రియదర్శి.. 'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరయ్యారు. చిన్నప్పుడు తన తండ్రి ఏటీఎం కార్డును దొంగలించి తరచుగా డబ్బులు డ్రా చేసుకునేవాడినని చెప్పారు. ఆ డబ్బులతో సినిమా థియేటర్లకు వెళ్లేవాడినని తెలిపారు.
"నాకు డబ్బులు అవసరమైన సమయంలో మా నాన్నగారి ఏటీఎం దొంగలించి 100 రూపాయలు విత్ డ్రా చేసి వాడుకునేవాడిని. అప్పట్లో ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసినా మొబైల్కు మెసేజ్ వచ్చేది కాదు. దీంతో ఈ విషయం ఎవరికీ తెలిసేది కాదు. కానీ మా నాన్న పాస్ బుక్ ప్రింట్ తీసిన సమయంలో నేను డబ్బు దొంగలించిన విషయం అర్థమయ్యింది. ఇక నాకు రౌండ్ పడింది. నేనైతే దొంగలించిన డబ్బుతో ధియేటర్లకు పోయి సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు అదే నాకు ఉపయోగపడింది. ఈ రోజు నన్ను ఈ స్థాయిలో ఉంచింది" అని తన బాల్యంలో చేసిన చిలిపి పని గురించి చెప్పారు ప్రియదర్శి.
ఇదీ చూడండి దసరా కానుకగా బాలయ్య 'నర్తనశాల' విడుదల