పాటతో అయినా, మాటతో అయినా ప్రేక్షకులను అలరించడంలో ఆయన రూటే సపరేటు. నాలుగు దశాబ్దాలుగా గాయకుడిగా సంగీతాభిమానుల మనసులు గెలుస్తూనే.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, నటుడిగా తనలోని విభిన్న పార్శ్వాలను ఆవిష్కరిస్తూ వెళుతున్నారు మనో. సతీసమేతంగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనో, ఆయన సతీమణి జమీల పంచుకున్న విశేషాలు మీకోసం.
హీరోయిన్‌లాంటి అమ్మాయిని కావాలని అడిగారట?
మనో: అవును. మా అమ్మ తనను చూడగానే హీరోయిన్ గీతలా ఉందని చెప్పారు. గీత కూడా యూఎస్‌లో కనిపించినప్పుడు 'మనమిద్దరం అక్కాచెల్లెల్లా ఉన్నాం' అని మా ఆవిడతో అన్నారు.
ఈ బుల్లిబాబు ఎలా దొరికాడు?
జమీల: వారే తెనాలికి వచ్చారు. నన్ను చూడటంతోనే 'మీకు నచ్చానా' అన్నారు. 'నచ్చానో లేదో చెబితే, ఆ తర్వాత నేను సమాధానం చెబుతా'నన్నారు. అది వినగానే ఈయనే నాకు కరెక్ట్ అనిపించింది.
పెళ్లై ఎన్నాళ్లైయింది?
మనో: నాకు 19, ఆమెకు 15 ఏళ్లున్నప్పుడు పెళ్లైంది. 36 ఏళ్ల అనుబంధం మాది. తొందరగా పెళ్లవడం వల్ల ఒక ప్రయోజనముంది. మా పెద్దాడికి 35, మా చిన్నోడికి 33. నాకు తమ్ముళ్లలాగా ఉంటారు. అమ్మాయి వయసు 27 ఏళ్లు. అమెరికాలో స్థిరపడింది.
రాత్రి రెండు, మూడు గంటలకు కూడా ఇంకా బిర్యానీ వండుతున్నావా అమ్మా..?
జమీల: ఇప్పటికీ చేస్తున్నాం అన్న. నాకు వండిపెట్టడం ఇష్టం. ఆయనకు చేయించడం ఇష్టం.
మనో: నాకు స్నేహితులెక్కువ కదా! యూఎస్, యూరప్ నుంచి వచ్చేటప్పుడు ఫోన్ చేస్తారు. అక్కడ సాయంత్రం బయలుదేరి అర్ధరాత్రి 12 కల్లా ఇక్కడికొస్తారు. వాళ్లకది డిన్నర్ టైం. విమానాశ్రయం నుంచి నేరుగా ఇంటికొచ్చి మాట్లాడి, డిన్నర్ చేసి అక్కడి నుంచి ఏదైనా హోటల్‌కు వెళ్తారు. ప్రపంచంలో స్నేహితులను మించిన విషయం నాకు మరొకటి కనిపించలేదు. నా జీవితంలో నేను సంపాదించిన ఆస్తి స్నేహితులే. మనదేశం, విదేశాల్లో కలిపి దాదాపు 4వేల మంది స్నేహితులున్నారు.
మనోను మొదటిసారి చూడగానే ఏమనిపించింది?
జమీల: మొదట ఆయన్ను సినిమాల్లో చూశా. 'రంగూన్ రౌడీ', 'కేటుగాడు' చిత్రాల్లో బాలనటుడిగా చేశారాయన. అబ్బాయి బాగుంటాడని ఇంట్లో వాళ్లు చెప్పారు. పదిహేనేళ్ల వయసులో ఏం తెలుస్తుంది. చూడగానే నచ్చాడంతే!
మనో పాడిన పాటల్లో మీకు బాగా నచ్చింది?
జమీల: 'కిల్లర్' సినిమాలోని 'ప్రియా ప్రియతమా..రాగాలు' పాట అంటే ఇష్టం.
ఎవరికోసం ఈ పాట పాడారు?
మనో: ఇళయరాజా దగ్గర ఎవరినీ ఊహించుకోవడం ఉండదు. పాట జాగ్రత్త పాడాలి అనే ధ్యాసే ఉంటుంది. పాట బాగా రావాలనే దానిమీదే ఏకాగ్రత ఉంటుంది. ఆయన మార్పులు చెబుతారు. ఆయన ఓకే అన్నారంటే పాట బాగుందని అర్థం. అప్పటిదాకా పాడాల్సిందే.
చిత్ర పరిశ్రమలోకి ఎలా అడుగుపెట్టారు?
మనో: 14 ఏళ్ల వయసులో ఎమ్‌ఎస్ విశ్వనాథన్ దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. నాకు స్వరం రాసే అలవాటుంది. ఆయనొకసారి ఏదో పాట పడుతుంటే, నేను వెంటనే స్వరం రాసేశాను. ఆయన విని 'అబ్బాయి బాగా రాస్తున్నాడే' అని మెచ్చుకున్నారు. అది విని మిగతా సీనియర్లు 'ఇంకొకసారి స్వరం రాస్తే మద్రాస్‌లో ఉండవు' అని బెదిరించారు. రెండోసారి స్వరం రాయమని విశ్వనాథన్ గారు అడిగితే నేను రాయలేదు. ఆయన వెంటనే విషయం గ్రహించారు. నేర్చుకోవడానికి నాకు ఎక్కడ అడ్డు పడతారోనని ఆయనా మౌనంగా ఉన్నారు. అక్కడ రోజూ నా సంతకం తీసుకునేవారు. హాజరు కోసం తీసుకుంటున్నారామో అనుకున్నాను. సంతకం నా దగ్గర తీసుకొని డబ్బులు వాళ్లు తీసుకుంటున్నారని ఏడాది తర్వాత తెలిసింది.
చక్రవర్తి దగ్గర ఎలా చేరారు?
మనో: మా అన్నయ్య తబలా వాయించేవారు. ఒకసారి చక్రవర్తిగారి దగ్గరకి వెళ్లాం. అక్కడ హార్మోనియం వాయిస్తూ 'పది మందిలో పాడినా' అనే పాటందుకున్నాను. చక్రవర్తి తబలా పని పక్కన పెట్టి నా వివరాలు కనుక్కొన్నారు. 'నువ్వు నా దగ్గర పనిచేయాల'న్నారు. వెంటనే విశ్వనాథన్ గారికి ఫోన్ చేసి చెప్పారు. ఆయన నా పనితనం, మంచితనం గురించి చక్రవర్తి గారికి చెప్పి, 'మీ దగ్గరైతే బాగా ఉపయోగపడతాడు.. పైకొస్తాడు' అని చెప్పారు. మరుసటి రోజే ఆయన దగ్గర చేరాను. సంవత్సరంలో 80కి పైగా సినిమాలకు సంగీతం అందించేవారాయన. నేను స్వరం రాస్తాను, హార్మోనియం వాయిస్తాను, పాట పాడతాను. గాయకులకు పాటలు నేర్పించడం, కంపోజింగ్ అసిస్టెంట్ ఇలా అన్నిరకాల పనులూ చేశా. చిన్నతనంలో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టడం నా అదృష్టం. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా.
అమ్మానాన్న కాకుండా మీ లైఫ్‌లో ముఖ్యమైందెవరు?
మనో: మా సోదరి మహిజ. చాలా కష్టపడింది. నేను స్థిరపడటానికి ఆమే కారణం. ఇల్లు, స్థలం కొనడం ప్లానింగ్ అంత ఆవిడదే. ఆమె తరువాత నా సామ్రాజ్యాన్ని నడిపిస్తుంది జమీలే. ఈమె నా భార్యగా దొరకడం అదృష్టం. పనివెతుక్కోవడం, డబ్బులు సంపాదించడం మన పని. ఇంటిని, పిల్లల బాధ్యతను మోయడం సాధారణ విషయం కాదు.
నాగూర్ బాబు అనే వ్యక్తి గాయకుడిగా ఎలా మారాడు?
మనో: నేను చక్రవర్తిగారి దగ్గర పైలెట్ సింగర్‌గా పాడటం, గాయకులకు పాటలు నేర్పించడటం చేస్తుండేవాడిని. అప్పుడు బి.గోపాల్, కోదండరామిరెడ్డి లాంటి దర్శకులు నా గొంతు బాగుందనేవారు. ఒకరోజు ఇళయరాజా కొత్తగాయకుల కోసం వెతుకుతున్నారని తెలిసింది. ఇళయరాజా తమ్ముడు నన్ను ఆయన దగ్గరకు తీసుకెళ్లారు. అలా 1985లో ఇళయరాజా నన్ను కోలీవుడ్‌కు పరిచయం చేశారు. ఆ తర్వాత కూడా అవకాశాలిచ్చారు. కొన్నాళ్ల తర్వాత చక్రవర్తి గారు 'నిన్ను వదిలేసుకోవడం ఇష్టం లేకనే గాయకుడిగా అవకాశలివ్వలేదు రా, నన్ను క్షమించు' అన్నారు. కానీ 'ఇక్కడ నేర్చుకున్న పనివల్లే నాకు అవకాశాలు వచ్చాయి కదా సార్' అని బదులిచ్చాను.
మద్రాస్ అనుభవాలు?
మనో: జీ ఆనంద్‌గారు మా అమ్మానాన్నలతో పనిచేసేవారట. నేను విశ్వనాథ్‌గారి దగ్గర పనిచేస్తున్నానని తెలిసి ఆయనకు దగ్గరలోనే రూ.35కు అద్దె గది చూపించారు. ప్రతినెలా రూ.150 పంపించేవాడిని. మిగిలిన డబ్బులతోనే నెలంతా గడిపేవాడిని. మంచి భోజనం చేయాలంటే అప్పుడు పాండిబజార్లోని కళ్యాణమండపాలకు వెళ్లేవాడిని. ఒకసారి వెళ్తే మళ్లీ 15 రోజుల వరకూ అటు దిక్కు వెళ్లేవాడిని కాదు. వాచ్‌మెన్ గుర్తుపడతాడేమోనని భయం.
మనో మీద మీకున్న ఫిర్యాదేంటి?
జమీల: అలాంటిదేమీ లేదన్నా. 36 ఏళ్లలో ఎలాంటి ఇబ్బంది రాలేదు. నా మూడో బిడ్డ చనిపోయినప్పుడు మాత్రం దిగులు పడ్డాను. అప్పుడు ఆయనే అండగా నిలబడ్డారు. ఆ సమయంలోనే థైరాయిడ్ కారణంగా ఆరోగ్య సమస్యలొచ్చాయి. దాని కారణంగానే నా గొంతులో కూడా తేడా వచ్చింది.
బాబు ఎలా చనిపోయారు?
మనో: నాలుగేళ్ల ఏళ్ల వయసులో మా మూడో బాబు దూరమయ్యాడు. ఏమనుకుని పెట్టానో కానీ షాహెద్ అని పేరు పెట్టాను. షాహెద్ అంటే త్యాగమని ఆ పేరుపెట్టినప్పుడు తెలియదు. మా కంపౌండ్‌కు పక్కనే కొత్త ఇంటి కోసం ఒకాయన సంపు కట్టాడు. వర్షం నీళ్లు చేరి అందులో చిన్న చిన్న చేపలు కనిపించేవి. వాటిని చూసేందుకు వెళ్లి అందులో పడిపోయాడు. సమయానికి మా ఆయా వాడితో లేదు. 15 నిమిషాల్లో అంతా అయిపోయింది. వాడు చనిపోయి మిమ్మల్ని బతికించాడని ఓ సిద్ధాంతి చెప్పారు. అలా వాడు మా కుటుంబానికి త్యాగమూర్తి అయ్యాడు.